గవర్నర్‌ను కలిసేందుకూ అదే దాదాగిరి - కోటి సంతకాలను సమర్పించడానికి వెళ్లిన వైఎస్ జగన్
వైద్య కళాశాలలపై కోటి సంతకాలను సమర్పించేందుకు మందీమార్బలంతో లోక్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లిన జగన్ - కాన్వాయ్‌తో సమాంతరంగా బైక్ ర్యాలీ, మధ్యలో కూడళ్ల వద్దకు పెద్దఎత్తున జనాన్ని తరలించి హడావుడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 19, 2025 at 10:38 AM IST
YS Jagan Meet Governor Abdul Nazeer At Lokbhavan: పరామర్శలకైనా ఇంకో పేరుతో పర్యటనలకు వెళ్లినా మందీమార్బలంతో భారీగా షో చేయడం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అలవాటే. ఆ అలవాటును చివరికి రాష్ట్ర గవర్నర్‌ను కలిసేందుకు వెళుతున్నపుడు సైతం కొనసాగించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం అప్పగిస్తోందనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సేకరించిన కోటి సంతకాల పత్రాలను సమర్పించేందుకంటూ గురువారం జగన్ లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. అయితే లోక్‌భవన్‌కు వెళ్లే క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు.
నిబంధనలను గాలికొదిలేసిన వైఎస్సార్సీపీ: రాజ్‌భవన్‌కు వెళ్లేమార్గంలో స్వరాజ్ మైదానంలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహంవద్దకు జగన్ వెళ్లారు. అక్కడ కూడా నేతలు భారీగా జనాన్ని తీసుకువచ్చారు. నిబంధనలను గాలికొదిలేశారు. నానా హంగామా సృష్టించారు. మొత్తం జనసమూహమంతా ఆ స్మృతివనంలోకి ఒక్కసారిగా వెళ్లడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
అసందర్భంగా జై జగన్ నినాదాలు: గవర్నర్‌ను కలవాలంటే ముందస్తు అనుమతి ఉన్నవారు మాత్రమే లోక్‌భవన్‌కు రావాలి. కానీ, గురువారం జగన్‌తోపాటు ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో లోక్‌భవన్ పరిసరాలకు చేరుకుని జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక్కడ పోలీసులు, భద్రతా సిబ్బంది వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఏ మాత్రం వినకుండా లోక్‌భవన్ ప్రవేశద్వారం సమీపానికి వెళ్లి హడావుడి చేశారు.
సంతకాల పత్రాల లోడ్‌తో ఉన్న వాహనాలను లోక్‌భవన్‌కు పంపేందుకు గురువారం ఉదయం జగన్ తన క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపారు. అప్పుడూ బారీగా జనాన్ని సమీకరించి అక్కడ హల్‌చల్ చేశారు. మధ్యాహ్నం భారీ కాన్వాయ్‌లో జగన్, ఆయనతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు లోక్‌భవన్‌కు బయల్దేరారు. ఆ కాన్వాయ్‌తోపాటు బైక్ ర్యాలీని సైతం చేపట్టడం గమనార్హం.
వాహనాలతో హడావుడి:దాంతో వారధిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా వారధి దాటాక కృష్ణలంక వద్ద కూడలిలో వైఎస్సార్సీపీ నేతలు భారీగా మహిళలు, ఇతర కార్యకర్తలను సమీకరించి గందరగోళం సృష్టించారు. అక్కడా ట్రాఫిక్ అటూ ఇటూ కదల్లేని పరిస్థితిని కల్పించారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహణకు తీసుకునేవాళ్లు మేం అధికారంలోకొచ్చాక 2 నెలలు తిరక్కముందే జైళ్లో జైళ్లలో ఉంటారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణలో 1.04 కోటల మంది సంతకాలు చేశారని జగన్ తెలిపారు.
పార్టీ ముఖ్యనేతలతో కలిసి గురువారం లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. అంతకముందు వాహనాల్లో తీసుకువచ్చిన సంతకాల ప్రతులను గవర్నర్ కార్యాలయ అధికారులు పరిశీలించారు. గవర్నర్ కలిశాక లోక్‌భవన్ వద్ద, అంతకముందు తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులతో కలిసి నిర్వహించిన సమావేశంలోనూ జగన్ మాట్లాడారు.
ప్రైవేటీకరణ కుంభకోణంపై కోర్టుకెళ్తాం: ప్రభుత్వ వైద్యకళాశాలను ప్రైవేటు వారికి ఇవ్వడంతో సీఎం చంద్రబాబు పెద్ద కుంభకోణానికి తెరదీశారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఒక్కో కాలేజీకి జీతాల రూపంలో ఉద్యోగులకు ఏటా రూ.60 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.120 కోట్లు ఇవ్వబోతున్నారు. అంటే పది కళాశాలలకు రూ.1200 కోట్లు ప్రైవేటు నిర్వాహకులకు ప్రభుత్వమిచ్చేలా నిర్ణయించారని జగన్ ఆరోపించారు.
అంతేకాకుండా ఆ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయంటూ మోసగిస్తున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ 10 కాలేజీలను పూర్తి చేసేందుకు ఏటా రూ.1000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు పెడితే చాలు. ఏడాదికి రూ.2.50 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రూ.1000 కోట్లను పెట్టలేరా? పెట్టకపోతే వదిలేయండి. మేం అధికారంలోకి వచ్చాక కాలేజీలన్నింటినీ పూర్తి చేస్తామని జగన్ వ్యాఖ్యానించారు.
మేమొచ్చిన రెండు నెలల్లోనే వారందరీనీ జైల్లో పెడతాం : వైఎస్ జగన్

