అన్నవరంలో అర్ధరాత్రి హైడ్రామా - పెళ్లి బృందంపై యువకుల వీరంగం
అన్నవరం సత్యగిరిపై దౌర్జన్యానికి దిగిన నర్సీపట్నం యువకులు - కారు హారన్ మోగించొద్దన్నందుకు కర్రలతో దాడి - అడ్డుకోబోయిన మహిళలు, భద్రతా సిబ్బందిపైనా దౌర్జన్యం

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 28, 2026 at 4:01 PM IST
Youths Attack Marriage Group in Annavaram : పవిత్ర పుణ్యక్షేత్రం అన్నవరం సత్యగిరిపై కొందరు యువకులు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు. ఓ పెళ్లి బృందంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. సుమారు గంటన్నర పాటు నానా హంగామా చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన మహిళలను సైతం వదిలిపెట్టలేదు. వారిని రక్షించేందుకు వచ్చిన దేవస్థానం భద్రతా సిబ్బందిపై కూడా దౌర్జన్యానికి దిగారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కారు హారన్ తో మొదలైన వివాదం : బుధవారం అర్ధరాత్రి సత్యగిరిపై భారీ సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో ఉచిత కల్యాణ మండపాల ఎదురుగా ఉన్న రోడ్డులో వాహనాలు బారులు తీరాయి. రాత్రి 1.30 గంటల సమయంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన కొందరు యువకులు కార్లలో అక్కడికి వచ్చారు. అదే సమయంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామానికి చెందిన ఓ పెళ్లి బృందం కారు అక్కడ ఆగి ఉంది. తమ కారు వెళ్లేందుకు ఆ కారును పక్కకు తీయాలంటూ నర్సీపట్నం యువకులు పెద్దగా హారన్ మోగించారు.
చిన్న మాటకే కర్రలతో దాడి : పదే పదే హారన్ మోగిస్తుండటంతో శరభవరం పెళ్లి బృందంలోని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కారులో చిన్న పిల్లలు నిద్రపోతున్నారని, పెద్దగా హారన్ మోగించడం వల్ల వారు భయపడి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ చిన్న మాటకే నర్సీపట్నం యువకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఒక్కసారిగా రెచ్చిపోయి పెళ్లి బృందంపై దాడికి దిగారు. అనంతరం తమ కారును వేరే చోట పార్కింగ్ చేసి వచ్చారు. పెళ్లి బృందం ఉన్న కల్యాణ మండపం వద్దకు చేరుకుని మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. చేతికి దొరికిన కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ గొడవను అడ్డుకునేందుకు వచ్చిన మహిళలపైనా తిరగబడ్డారు. ఈ తోపులాటలో ఓ మహిళ కింద పడిపోయారు. గొడవను నివారించేందుకు వచ్చిన దేవస్థానం భద్రతా సిబ్బందిపై కూడా సదరు యువకులు దాడికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
హరిహర సదన్‌లోనూ వదలని వైనం : కల్యాణ మండపం వద్ద దాడి చేసిన తర్వాత కూడా ఆ యువకులు శాంతించలేదు. కాసేపటి తర్వాత హరిహర సదన్ వసతి సముదాయంలోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న సదరు పెళ్లి బృందంలోని వారిపై మరోసారి భౌతిక దాడికి పాల్పడ్డారు. రిసెప్షన్ వద్ద ఉన్న ఒక వ్యక్తిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. రాత్రి 1.30 గంటలకు మొదలైన ఈ గొడవ తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది. గంటన్నర పాటు యువకులు సృష్టించిన ఈ భీభత్సంతో పెళ్లి బృందాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఇలాంటి దౌర్జన్యాలు జరగడం పట్ల భయాందోళనలు వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన యువకులపై చర్యలు చేపట్టారు. గొడవకు కారణమైన ముగ్గురు యువకులపై న్యూసెన్స్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.
హారన్ కొట్టాడని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకుల దాడి - మహిళా కండక్టర్‌పైనా అటాక్
బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి - తీవ్ర గాయాలు - గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు

