ETV Bharat / state

సైకిల్ యాత్రలు, పర్వతారోహణలు - అనంతపురం అమ్మాయికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

సైకిల్‌పై దేశాల్ని చుట్టేస్తున్న సమీరా ఖాన్‌ - 2018లో సైకిల్‌ యాత్ర ప్రారంభం - ఇప్పటి వరకు 37 దేశాల్లో సైకిల్‌పై పర్యటన - సైక్లిస్ట్‌, పర్వతారోహకురాలిగా గుర్తింపు

Yuva Story On Cyclist Sameera Khan
Yuva Story On Cyclist Sameera Khan (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 2, 2026 at 4:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

Cyclist and Mountaineer Sameera Khan : సాధారణంగా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే ఏం చేస్తాం! విమానంలోనో, రైలులోనో ‌ప్రయాణిస్తాం. కానీ సమీరా ఖాన్‌ మాత్రం అనంతపురం నుంచి బిహార్‌లోని షేక్‌పురా వరకూ ఉన్న 1,800 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పైనే అధిగమించింది. ఇదే కాక 37 దేశాలు, వేల కిలోమీటర్లు సైకిల్‌ యాత్ర చేపట్టి "బాలికా సాధికారత" రాయబారిగా ప్రయాణం కొనసాగిస్తోంది. మరి ఎవరీ సమీరా ఖాన్‌? కష్టనష్టాలకోర్చి ఎందుకింత సుదీర్ఘ సైకిల్‌ యాత్ర చేస్తోంది?

"ఒక సైకిల్ 37 దేశాలు, 11 పర్వతారోహణలు! వినడానికి ఇదేదో రికార్డులా అనిపించ వచ్చు. కానీ, ఒక తెలుగు అమ్మాయి ఒంటరిగా, సామాజిక అడ్డంకులను దాటుతూ సాగించిన సాహసయాత్ర. ఆంధ్రప్రదేశ్‌ అనంతపురానికి చెందిన సమీరా ఖాన్‌ 2018లో తన ప్రయాణం ప్రారంభించింది. ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, తుర్కియే, నెదర్లాండ్స్, స్పెయిన్, థాయిలాండ్, శ్రీలంక, జపాన్, దక్షిణాఫ్రికా సహా ఇప్పటికే 37 దేశాలు సైకిల్ పై చుట్టేసింది.

సైకిల్ యాత్రలు, పర్వతారోహణలు - అనంతపురం అమ్మాయికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు (ETV)

ఆడపిల్లలు కేవలం పెళ్లి కోసమే పుట్టలేదు : సమీరా సైక్లిస్ట్ మాత్రమే కాదు, అద్భుతమైన పర్వతారోహకురాలు కూడా. ఇప్పటివరకు 11 పర్వతాలను అధిరోహించగా, 7 శిఖరాలు విజయవంతంగా చేరుకుంది. ఇదంతా ఎలా ప్రారంభమైందంటే సమీరాకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే తల్లి మరణించింది. కొద్ది కాలానికే తండ్రిని కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి విషాదాలు ఎవరినైనా కుంగుబాటుకు గురి చేస్తాయి. నిస్సహాయుల్ని చేస్తాయి. కానీ సమీరా ఎదిరించి నిలిచింది. "ఆడపిల్లలు కేవలం పెళ్లి కోసమే పుట్టలేదు. ప్రతి ఒక్కరికి కలలు ఉంటాయి, వాటిని కుటుంబాలు ప్రోత్సహించాలి" అని ఆమె గట్టిగా నమ్మింది.

సమీరాకు ఈ సుదీర్ఘ ప్రయాణం శారీరక శ్రమ మాత్రమే కాదు అది ఆమె పట్టుదలకు నిదర్శనం. ఈ పట్టుదలే ఖండాలు దాటించి, పర్వత శిఖరాలను అధిరోహించేలా చేసింది. ఆత్మవిశ్వాసంతో, తనకు నచ్చినట్టు సైక్లిస్టుగా, పర్వతారోహకురాలుగా తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళ్తోంది.

" నేను సైక్లిస్ట్‌, పర్వతారోహకురాలిని. 2018లో ఈ ప్రయాణం మొదలు పెట్టా. అప్పటి నుంచి ఇప్పటివరకు వాలంటీర్‌ మోటివేషనల్‌ స్పీకర్‌గా సేవలందిస్తున్నా. గ్రామీణ బాలికా సాధికారిత పేరిట దేశం మొత్తం క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నాను. గతేడాది మే నెలలో దీన్ని ప్రారంభించాను. మరో మూడు నెలల పాటు కొనసాగిస్తాను. ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, తర్వాత తెలంగాణ వెళ్తాను." - సమీరా ఖాన్‌, సైక్లిస్ట్‌, పర్వతారోహకురాలు

భారతదేశంలో సైకిల్ యాత్ర కష్టమే : విదేశాలతో పోలిస్తే భారతదేశంలో సైకిల్ యాత్ర కష్టమే అని ఆమె అభిప్రాయపడ్డారు. భద్రతా సమస్యల నుంచి సామాజిక ప్రవర్తన వరకు మహిళా సైక్లిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వింతగా చూడటం, ఎగతాళి చేయడం వంటివి జరుగుతుంటాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయినా బిహార్ చేరుకున్నప్పుడు అక్కడి డీజీపీ వినయ్ కుమార్ సత్కరించడం ఎంతో ఉత్సాహం, శక్తిని ఇచ్చిందని గుర్తుచేసుకుంటోంది సమీరా.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, అయినా! : రోజుకు 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణించే సమీరాకు ఒక గొప్ప ఆశయం ఉంది. బాలికల విద్య, సాధికారత కోసం ఒక ప్రత్యేక సంస్థను స్థాపించాలని ఆమె కోరుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా, ప్రభుత్వ మద్దతు లభించకపోవడం కొంత నిరాశ కలిగించిందని, అయినా అది తన ప్రయాణాన్ని ఆపలేదంటోంది సమీరా ఖాన్.

బాలికా సాధికారతపై అవగాహన : ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తూ బాలికా సాధికారతపై అవగాహన కల్పిస్తోంది సమీరా. పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థినులతో ముచ్చటిస్తోంది. వెళ్లిన ప్రతిచోట మనం ఆడపిల్లలమే కావచ్చు, కానీ బలహీనులం కాదు. మన హక్కుల కోసం మనం పోరాడాలి అని చెప్పి మరీ వస్తుంది. కన్న కలలు నెరవేర్చుకోవాలని ఉన్నా, కుటుంబ ప్రోత్సాహం లేకనో, సమాజానికి భయపడో ఆడపిల్లలు వెనకడుగు వేస్తూ ఉంటారు. అడ్డంకులన్నీ అధిగమించి ముందుకు సాగే వారెందరికో సమీరా ఖాన్‌ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

ఓ వైపు కళా, మరోవైపు క్రీడలు - మల్టీ టాలెంటెడ్‌గా సత్తా చాటుతున్న అక్షర

కష్టపడింది, కల నెరవేర్చుకుంది - పెళ్లి ఒత్తిడి తట్టుకొని కానిస్టేబుల్​గా ఎంపికైన కల్పన