కూచిపూడిలో రాణిస్తున్న మిత్రవింద - అకాడమీ నెలకొల్పడమే లక్ష్యం
కూచిపూడిలో అద్భుతంగా రాణిస్తోన్న మిత్రవింద - రాష్ట్ర, జాతీయస్థాయిలో 400కు పైగా ప్రదర్శనలు - తల్లి ప్రోత్సాహంతో నాట్యంలో అద్భుతమైన ప్రతిభ - నృత్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 3:31 PM IST
Yuva Story on Kuchipudi Dancer Mitravinda : టీవీల్లో కూచిపూడి నృత్యాలను కళ్లార్పకుండా చూసింది ఆ అమ్మాయి. తాను కూడా అలా చేయాలని నిర్ణయించుకుంది. నృత్యంపై అమితమైన మక్కువతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తూ 400 పైగానే ప్రదర్శనలు ఇచ్చి అనేక అవార్డులు సొంతం చేసుకుంది. తండ్రి చిన్నతనంలోనే దూరమైనా తల్లి ప్రోత్సాహంతో నిత్యం నాట్యంలో అద్భుతమైన ప్రతిభతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకుంది కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మిత్రవింద.
చక్కని ఆహార్యం అభినయంతో అందంగా కూచిపూడి నృత్యం చేస్తున్న ఈ యువతి మిత్రవింద. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈ అమ్మాయి శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నతనంలోనే తండ్రి దూరమైనా తల్లి దీవెనమ్మ ప్రోత్సాహంతో కూచిపూడి నేర్చుకుంటోంది. ప్రొద్దుటూరులోని నటరాజ కళాక్షేత్రంలో కూచిపూడి నృత్య శిక్షకుడు పఠాన్ మోహిద్దీన్ ఖాన్ శిక్షణలో ప్రతిభ చాటుకుంటోంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డు : 2020వ సంవత్సరం చెన్నైలో 1,183 మంది నృత్య కళాకారులు 41 నిమిషాల్లో చేసిన కూచిపూడి ప్రదర్శనకు మిత్రవిందకు గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ఇండియన్ రికార్డు, మార్వలెస్ బుక్ ఆఫ్ రికార్డు వరించాయి. ఇదే ప్రదర్శనకు హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఫెంటాస్టిక్ అచీవ్ మెంట్స్ రికార్డ్ కూడా అందుకుంది. 2021 అక్టోబరులో తెలంగాణలో నిర్వహించిన రెండవ ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవ ప్రదర్శనలో ఈ యువతి పాల్గొంది.
2023లో కూచిపూడి సర్టిఫికెట్ కోర్సు, 2025లో డిప్లమో కోర్సు పూర్తి చేసింది మిత్రవింద. 2019 నుంచి 2025 వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో 400 పైగానే ప్రదర్శనలు ఇచ్చి అనేక అవార్డులు సొంతం చేసుకుంది. తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలు, తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా మాఢవీధుల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.
"నా చిన్న వయసులోనే మా నాన్న మరణించారు. అప్పటినుంచి మా అమ్మ ప్రోత్సాహంతోనే చదువుతోపాటు కూచిపూడిలో సైతం రాణిస్తున్నాను. నాకు నాట్యమయూరి అవార్డు చిలకలూరిపేటలో, గిన్నిస్ రికార్డు చెన్నైలో, నంది అవార్డు తమిళనాడులో వచ్చాయి. అలాగే యువ కాంపిటీషన్స్‌లో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాను." - మిత్రవింద, కూచిపూడి నృత్యకారిణి
అకాడమీ నెలకొల్పాలనే లక్ష్యం : ఉదయం, సాయంత్రం వేళల్లో తీరికలేకుండా కూచిపూడి నృత్యప్రదర్శనలో సాధన చేస్తోంది ఈ యువతి. ఓవైపు చదువులో రాణిస్తూనే తనకు ఇష్టమైన కూచిపూడి నృత్య ప్రదర్శనకు ఎంతదూరమైనా వెళ్తోంది. కూచిపూడిలో ఎంఏ కోర్సు పూర్తి చేసిన తర్వాత తానే స్వయంగా కూచిపూడి అకాడమీ నెలకొల్పాలనే లక్ష్యం ఉందని చెబుతోంది.
మిత్రవింద కూచిపూడి నృత్యంలో రాణిస్తుండంతో స్నేహితులూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. తన వల్ల కళాశాలకు మంచి పేరు వచ్చిందని చదువులో కూడా మంచి ప్రతిభ కనబరుస్తోందని చెబుతున్నారు అధ్యాపకులు. పాశ్చాత్య నృత్యాలు నేర్చుకున్నప్పటికీ, కూచిపూడి అభ్యసిస్తే ఏకాగ్రత పెరగడం, శరీర నియంత్రణతో పాటు నడవడిక చక్కగా ఉంటోందని చెబుతోంది మిత్రవింద.
తల్లి చివరి కోరిక - తొలి ప్రయత్నంలోనే జిల్లా జడ్జిగా ఎంపికైన యువతి
కష్టపడింది, కల నెరవేర్చుకుంది - పెళ్లి ఒత్తిడి తట్టుకొని కానిస్టేబుల్‌గా ఎంపికైన కల్పన

