తల్లి చివరి కోరిక - తొలి ప్రయత్నంలోనే జిల్లా జడ్జిగా ఎంపికైన యువతి
2014లో కాకినాడ అసోసియేషన్ న్యాయవాదిగా పేరు - పదేళ్లు జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు లాలస సన్నద్ధం - తల్లి కోరిక నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమించిన లాలస

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 4, 2026 at 5:23 PM IST
Lalasa First Attempt Won District Judge Post : ఓర్పుతో ఓటమి కూడా విజయంగా నిలుస్తుంది. ఎందుకంటే జీవితంలో ఎన్నిసార్లు ఓటమి నిరాశపరిచినా ఆశను వదలకుండా కష్టపడితే గమ్యం చేరుకోవచ్చని ఈ యువతి నిరూపించింది. పోటీ పరీక్షల్లో పదిసార్లు విఫలమైనా నిరాశను తన దరికి చేరనివ్వలేదు. ఎప్పుడూ నీడలా ఉండే అమ్మ దూరమైనా మనోధైర్యంతో మాతృమూర్తి కల నెరవేర్చాలనుకుంది. జిల్లా జడ్జి పరిక్షల్లో ప్రతిభ చాటి న్యాయమూర్తిగా లాలస ఎంపికైంది.
ఇన్ని సార్లు పరీక్షలు రాస్తావా? : లాలస పదేళ్ల పాటు కష్టపడి తొలి ప్రయత్నంలోనే జిల్లా జడ్జిగా ఎంపికైంది. 2014లో కాకినాడ బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుంది. పదేళ్లుగా జూనియర్ సివిల్ జడ్జి పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యింది. తల్లి కోరిక నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమించి విజయం సాధించింది. తల్లి తోడు లేకున్నా ఇంటి పనులు చేసుకుంటూ కుమార్తె జిల్లా జడ్జి పరిక్షల్లో న్యాయమూర్తిగా విజయం సాధించడంతో తండ్రి వెంకటరమణ భావోద్వేగం చెందారు.
ఇన్ని సార్లు పరీక్షలు రాస్తావా? నువ్వు జడ్జి కావు. అయినా తల్లి లేని పిల్లవు చదువు ఎందుకు? తొందరగా పెళ్లి చేసుకో ఇలాంటి సూటిపోటి మాటలు లాలసను చాలా బాధించాయి. కానీ ఈ మాటలను ఆమె పంటి దిగువన దిగమింగుకొని ముందుకు సాగింది. కొన్ని రోజులకు ఎవరేమన్నా పట్టించుకోకుండా తల్లికి ఇచ్చిన మాట కోసం నిరంతరం శ్రమించింది.
గుండెపోటుతో మరణించిన లాలస తల్లి: లాలస స్వస్థలం పెదగాడి కాకినాడ జిల్లా. ఈమె తండ్రి వెంటకరమణ సీనియర్ న్యాయవాది. తల్లి గౌరి గుండెపోటు రావడంతో 2021లో చనిపోయింది. ఆమెకు తమ్ముడు ఉన్నాడు. నాన్న ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజిగా ఉండటంతో ఇంట్లో, బయట అన్ని పనులు లాలసనే చేసుకునేది. లాలస విద్యాభ్యాసమంతా కాకినాడలో జరిగింది. తండ్రి తన న్యాయవాద వృత్తితో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నిపండం లాలసకి నచ్చింది. దీంతో లాలస కూడా తండ్రి లాగే న్యాయవాది కావాలనుకుంది.
కుమార్తెకు న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉండటంతో తల్లి కూడా ఆ దిశగా ప్రోత్సాహించింది. లాలస రాజీవ్ గాంధీ లా కళాశాలలో న్యాయ విద్యను పూర్తి చేసింది. 2014లో కాకినాడ బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుంది. లాలస సీనియర్ న్యాయవాది ఎమ్వీజే రామ్ గోపాల్ వద్ద ప్రాక్టీస్ చేస్తూనే జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలకు సన్నద్ధమయ్యింది. 2015 నుంచి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టింది. దశాబ్దం పాటు పదిసార్లు ఎగ్జామ్ రాసినా విజయం దక్కలేదు.
న్యాయమూర్తిగా చూడాలనుకున్న తల్లి : లాలసను న్యాయమూర్తిగా చూడాలన్న తల్లి కోరికను తీర్చేందుకు లాలస పట్టుదలతో శ్రమించింది. 2025లో జిల్లా జడ్జి పరీక్షకు తొలిసారి హాజరై అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా జడ్జి పోస్ట్‌కు ఎంపికవడం గొప్ప విషయమని స్థానికులు అంటున్నారు. జిల్లా జడ్జి పోస్ట్‌కు ఎంపికైన పిన్న వయస్కురాలిగా లాలస నిలిచింది. పట్టువదలని విక్రమార్కురాలిగా పదేళ్ల పాటు చదివి విజయం సాధించడంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రి, తమ్ముడు కూడా న్యాయవాదులు కావడంతో ప్రతి దశలోనూ ఆమెకు అండగా నిలిచారు.
జిల్లా జడ్జిగా ఎంపికై విజయం సాధించడంతో న్యాయవర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల నుంచి లాలసకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రెండు మూడు సార్లు విఫలమైతేనే లక్ష్యం మార్చుకొని, కొత్త రంగంలోకి చాలా మంది వెళ్తారు. కానీ లాలస మాత్రం 10 సార్లు ఫెయిల్ అయినా పట్టు వదలకుండా మాతృమూర్తి చివరి కోరిక తీర్చేందుకు అలుపెరగని ప్రయత్నం చేసి విజయం అందుకున్నారు. సీనియర్ న్యాయవాది లాలస గురువు బ్రహ్మాజీ తనకెంతో సహాయ సహకారాలు అందించారని లాలస తెలిపింది.
జీవితంలో ఎన్నోసార్లు ఓటమి ఎదురైనా, ఆశను వదలకుండా కష్టపడితే గమ్యం తప్పకుండా చేరుకోవచ్చని లాలస విజయం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. పోటీ పరీక్షల్లో పదిసార్లు విఫలమైనప్పటికీ, నిరాశను తన దగ్గరకు రానివ్వకుండా ధృడ సంకల్పంతో ముందుకు సాగింది. ఎప్పుడూ తన నీడలా వెంట ఉండే తల్లి దూరమైనప్పటికీ, మనోధైర్యంతో మాతృమూర్తి కలను నెరవేర్చాలని నిశ్చయించుకుంది. నెరవేర్చింది.
రాయలసీమ లిఫ్ట్ పనులు - రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఏపీ
సంక్రాంతికి తగ్గేదేలే - ప్రత్యేక శిక్షణ, డైట్‌తో కాలు దువ్వుతున్న పుంజులు

