ETV Bharat / state

ముందు వలపు గీతం - విఫలమైతే మృత్యు గీతం!

ప్రేమ వలలో చిక్కుకుని భవిష్యత్తును పాడు చేసుకుంటున్న అమ్మాయిలు - సోషల్‌ మీడియా పరిచయాలతోనే ఈ పరిస్థితి - విద్యార్థి స్థాయి నుంచే అవగాహన అవసరం - ప్రతి యేటా పెరుగుతున్న ఆత్మహత్య కేసులు

Increase Of Girl Suicide Cases For Love
Increase Of Girl Suicide Cases For Love (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : January 19, 2026 at 1:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

Increase Of Girl Suicide Cases For Love : విద్యార్థి దశను దాటి భవిష్యత్తుపై కోటి ఆశలతో ఉన్న యువతులు ప్రేమ వలలో చిక్కుకుని జీవితాలు ఆగం చేసుకుంటున్నారు. పెంచి, పెద్ద చేసిన అమ్మానాన్నలను కాదని, ప్రేమించిన వ్యక్తిని నమ్మి మోసపోతున్నారు. చదువుకొని జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాల్సిన ఆమె ప్రేమలో మోసపోయామని తెలిసి మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

  • గద్వాల మండలానికి చెందిన ఓ యువతి(20) అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకుందామనుకుంటే నిరాకరించాడు. ఈ నెల 12న ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
  • ఈ నెల 5న మానవపాడు మండలానికి చెందిన వైద్య విద్యార్థిని ప్రేమించి మోసపోయానని మనస్తాపంతో పురుగు మందు తాగి తనువు చాలించింది.
  • గట్టు మండలానికి చెందిన ఓ కానిస్టేబుల్, ఖమ్మం జిల్లా యువతి ప్రేమించుకున్నారు. చివరకు పెళ్లికి నిరాకరించడంతో ఆ యువతి ఇక్కడికి వచ్చి కానిస్టేబుల్‌ ఇంటి వద్దే ధర్నా చేసింది. పట్టించుకోకపోవడంతో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.

సోషల్​ మీడియా వలనే! : ప్రేమించిన యువకుడు మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి వదిలేశాడని, ఇంట్లో చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వరుస ఘటనలు ఇటీవల ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. పాఠశాలలు, కాలేజీలు, సోషల్‌ మీడియా పరిచయాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని తెలుస్తోంది.

ఇంట్లో చెప్పుకోలేక : 'నాన్నకు చెప్తే ఏమంటారో? అమ్మకు తెలిస్తే తట్టుకోగలదా! సమాజం నన్ను ఎలా చూస్తుంది' అనే భయాలు ఆమె గొంతును నొక్కేస్తున్నాయి. చాలా మంది యువతులకు సఖి కేంద్రాలున్నా సేవలు ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. షీ టీంలను సంప్రదించాలనే ధైర్యమే ఉండటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.

తల్లిదండ్రుల పాత్ర కీలకం :

  • పిల్లలు ఏమైనా చేస్తే తప్పు చేశారని వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి వారిని శిక్షించడం సరికాదు. ముందు వారు చెప్పేది పూర్తిగా వినాలి. ఆ తర్వాతే మాట్లాడాలి. అప్పుడు కూడా వారి మనసు నొప్పించేలా దూషించకూడదు.
  • పిల్లలు తప్పు చేశారని వారిపై కోపం పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. వారికి మేమున్నాం అని భరోసా ఇవ్వాలి.
  • పిల్లలు తల్లిదండ్రులతో ఏ విషయాన్నైనా పంచుకునేలా ఇంటి వాతావరణం ఉండాలి.

ఆలోచించుకోండి :

  • ప్రేమలో తన మాటలు ఎలా ఉన్నాయి అని కంటే తన చర్యలను ఎక్కువగా నమ్మాలి.
  • మీపై ఒత్తిడి, ఆంక్షలు, బెదిరింపులు లాంటివి చేస్తే అది ప్రేమ కాదు. అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి.
  • ఏ పరిస్థితిలోనైనా నీ జీవితం కన్నా ఏదీ గొప్పది కాదని గ్రహించాలి.

పాఠశాలల నుంచే అవగాహన అవసరం :

  • విద్యార్థి స్థాయి నుంచే జీవిత నైపుణ్యాలు, బంధాలపై తరగతులు చెప్పాలి.
  • కళాశాలల్లో కౌన్సెలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేయాలి.
  • సఖి కేంద్రాలపై ప్రచారం చేసి, అందరికీ దాని గురించి అవగాహన కల్పించాలి.
  • షీ టీం నంబర్లు ప్రతి మహిళ వద్ద ఉండాలి.

"తల్లిదండ్రులు వారి పిల్లలను కళాశాలలు, పాఠశాల స్థాయిలోనే ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండేలా సూచనలు చేయాలి. పిల్లలతో రోజూ పది నిమిషాలైనా మాట్లాడి ఆలోచనలు పంచుకోవాలి. ఇటీవల కాలంలో చాలా మంది యువతులు ప్రేమలో మోసపోయామని తల్లిదండ్రులతో చెప్పుకోలేక మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు." - నర్సింహ, జిల్లా బాలల సంరక్షణ అధికారి, గద్వాల

గతేడాదిలో భరోసా కేంద్రానికి వచ్చిన కేసులు :

⦁ మహబూబ్​నగర్​లో 168 కేసులు, 240 కౌన్సెలింగ్​లు.

⦁ నారాయణపేటలో 106 కేసులు, 168 కౌన్సెలింగ్​లు.

⦁ నాగర్​కర్నూల్​లో 96 కేసులు, 134 కౌన్సెలింగ్​లు.

⦁ జోగులాంబలో 81 కేసులు, 122 కౌన్సెలింగ్​లు.

⦁ వనపర్తి 78 కేసులు, 114 కౌన్సెలింగ్​లు.

తొందరపాటు వద్దు : యువత ప్రేమలో మోసపోయారని తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా సమస్య ఎదురైతే కుటుంబసభ్యులను, స్నేహితుల నుంచి సలహాలు తీసుకోవాలి. ఆకర్షణలు తాత్కాలికమే అని గ్రహించాలి. ముందుగా చదువు, ఉద్యోగం, జీవితంలో స్థిరపడేందుకు యత్నించాలి. చదువుల్లో రాణిస్తూనే ఇష్టమైన ఇతర రంగాల్లోనూ రాణించాలి. లక్ష్యం ఏర్పరుచుకుని సాధించేలా కృషి చేయాలి.

క్షణికావేశ నిర్ణయాలు వద్దు - ఉన్నది ఒకటే జిందగీ - పూర్తిగా చూడాలి దాని సంగతి!

Love Failure: ప్రేమ విఫలమైందని.. జీవితాన్ని మధ్యలోనే ముగించడమెందుకు..!!