కూచిపూడిలో రాణిస్తున్న యువతి - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోప్రతిభ
కూచిపూడి నాట్యంలో రాణిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన యువతి - సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్న సునంద - నాట్య పాఠశాల ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 26, 2026 at 1:26 PM IST
Young Woman from Krishna District Excels in Kuchipudi Dance: కళల్లో నాట్యానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. కానీ నృత్యంలో రాణించడం అనుకున్నంత సులువేం కాదు. ఎంతో సాధన చేయాలి. నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఇలాంటి ఆసక్తినే చూపించి నృత్యకారిణిగా మంచి పేరు తెచ్చుకుంది ఆ యువతి. 1000కి పైగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చింది. పలువురి ప్రముఖుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు అందుకుంది. ఇంతకీ ఎవరా యువతి ఆమె కళారంగ ప్రస్థానం ఏంటో ఈ కథనంలో చూద్దాం.
5 ఏళ్ల వయసులో నాట్యం నేర్చుకోమంటే పిల్లలెవరైనా కాస్త మారాం చేస్తారు. కానీ ఈ యువతి మాత్రం అలా కాదు. చిన్నప్పటి నుంచే నృత్యం అంటే ఎంతో ఇష్టం. దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడైంది. నాట్యంలో ఉన్న గొప్పదనం ఏంటో వివరిస్తూ పెంచారు తల్లిదండ్రులు. క్రమంగా నృత్యంలో శిక్షణ తీసుకుంది. అలా ప్రయాణం మొదలు పెట్టి ఇప్పుడు దేశ విదేశాల్లో ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగింది. ఆమే కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణ సునంద శ్రియ. చదువుల్లో ఉత్తమ మార్కులు సాధిస్తూనే కూచిపూడి నృత్యం, నాటక రంగాల్లో ప్రతిభ కనబరుస్తోందీ విద్యార్థిని. ప్రస్తుతం పీబీ సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతోంది. దేశ, విదేశాల్లో వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. భవిష్యత్తులో కూచిపూడిలో పీహెచ్‌డీ పూర్తి చేస్తానని చెబుతోంది కృష్ణ సునంద శ్రియ.
సీఎం, డిప్యూటీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం: నాట్యంలో ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న సునంద గతేడాది విజయవాడలో జరిగిన శాసన వ్యవస్థ సాంస్కృతిక శోభ కార్యక్రమంలో పాల్గొని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుంది. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సంస్కార భారతి నిర్వహించిన నృత్య పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుంది. తానా వరల్డ్ తెలుగు ఫెస్ట్ ఆన్‌లైన్ పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రం సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా తల్లికి నాట్యంపై ఉన్న మక్కువే సునందను నాట్యంలో ఉన్నతంగా నిలబెట్టింది. కుమార్తె నృత్యంలో రాణించడం ఆనందంగా ఉందంటోంది తల్లి శేషమణి.
సునంద నాట్యంలో రాణించడంపై హర్షం వ్యక్తం చేసిన కళాశాల ప్రిన్సిపల్ రమేశ్ భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు. ఏ ఉద్యోగం చేసినా తనకు ఇష్టమైన నాట్యరంగంలో చివరి వరకు కొనసాగుతానని అంటోంది సునంద. మరింత మందికి శిక్షణ ఇచ్చేలా నాట్య పాఠశాలను ఏర్పాటు చేస్తానని చెబుతోంది.
"నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు డ్యాన్స్ క్లాస్లో చేర్పించారు. నా మొదటి గురువు ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు. ఆయన దగ్గర నేను శిష్యరికం చేశాను. తర్వాత నన్ను స్కూల్లో కూడా బాగా ప్రోత్సహించారు. గురుకులంలో లాగా నేను మా గురువుగారి ఇంట్లో ఉండి డిప్లమా కోర్స్ పూర్తి చేశాను. ఇలా చిన్నతనం నుంచి నా డ్యాన్స్ జర్నీ ప్రారంభం అయింది. భవిష్యత్తులో నాకు మాస్టర్స్ చేయాలని ఉంది. ఆ తర్వాత సినిమా రంగంలోకి కూడా వెళ్లాలని ఉంది." - కృష్ణ సునంద శ్రియ, నృత్యకారిణి
అమరావతి 'క్వాంటమ్ హ్యాకథాన్'లో జీఎంఆర్ విద్యార్థుల ప్రతిభ - జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి
సివిల్స్ పరీక్షలో 3 సార్లు విఫలం - గ్రూప్-1, 2 కొలువులు సాధించిన అక్కాచెల్లెళ్లు

