వయసుకు మించి స్కూల్ బ్యాగ్‌ల బరువు - ప్రీప్రైమరీకి పుస్తకాలను అంటగడుతున్న కార్పొ'రేటు'
పుస్తకాల బరువుతో భారంగా బడికి వెళ్తున్న చిన్నారులు - మూడేళ్ల పిల్లలకు కూడా పుస్తకాలు కొనాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి - విద్యార్థులుకు 'ప్లే వే'లో పాఠాలు సాగాలంటున్న అధికారులు

Published : July 8, 2026 at 10:51 AM IST
Young Children Carrying Weight of Books : పిల్లలు ఆడుతూ, పాడుతూ పాఠాలు నేర్చుకున్నపుడే బాగా అర్థం చేసుకోగలుగుతారు. సరదాగా నవ్వుకుంటూ, పాడుకుంటూ తమ బాల్యాన్ని గడుపగలుగుతారు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే పిల్లల వయసు కంటే పుస్తకాల బరువే ఎక్కువగా ఉంది. ప్రతిరోజూ బ్యాగులను భారంగా భుజాలకు వేసుకుని స్కూళ్లకు వెళ్తున్నారు. వేరే దేశాల్లోని పాఠశాలల్లో పిల్లలకు ఒకటో, రెండో పుస్తకాలు తప్ప ఎక్కువగా ఉండవు. కానీ మన దగ్గర మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం.
అప్పడప్పుడే అమ్మఒడి నుంచి బడి బాట పట్టిన మూడేళ్ల చిన్నారులకు పుస్తకాల బాధ మాత్రం తప్పడం లేదు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యాలయాల్లో చిన్నారులకు అసలు బ్యాగులు ఉండకూడదు. వారికి 'ప్లే వే'లో సరదాగా బోధన సాగాలి. కానీ రాష్ట్రంలోని ప్రైవేటు ప్రీ ప్రైమరీ స్కూళ్లలో చిన్నారులు బ్యాగులతోనే తరగతులకు వెళ్తున్నారు. అక్షరాలు నేర్చుకునే పిల్లలకు రంగురంగుల పుస్తకాలను పాఠశాల యాజమాన్యాలు అంటగడుతున్నాయి. అతిచిన్న వయసులోనూ పుస్తకాల బరువును మోసేలా చేస్తున్నాయి.
పుస్తకాల సెట్‌ను కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి : రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం కూడా పూర్వ ప్రాథమిక విద్యాలయాలు ప్రారంభించింది. ఈ స్కూళ్లల్లో చిన్నారులకు ఆటపాటలతో బోధన సాగిస్తున్నారు. కానీ ప్రైవేట్ పాఠశాలలు మాత్రం అవసరం లేకున్నా పిల్లలకు అన్ని రకాల పబ్లికేషన్స్ పుస్తకాలను అంటగడుతున్నాయి. నర్సరీ, ప్రీ ప్రైమరీ చదివే మూడేళ్ల పిల్లలకు 3 నుంచి 4 పుస్తకాలు ఉండే సెట్‌ను తీసుకోవాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. వాటి కోసం రూ.3 వేల నుంచి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. రైటింగ్ బుక్స్, రైమ్స్ బుక్స్ పేరుతో పసిపిల్లలపై సిలబస్‌ను రుద్దుతున్నారు. ఇంకా యూకేజీ పిల్లలకైతే 8 నుంచి 10 పుస్తకాల సెట్‌ను ఇస్తున్నారు. వీటి ధర రూ.5 వేలుగా నిర్ణయించారు. దీనికితోడు వారు ఎక్కడ చెబితే అక్కడే కొనాలని పాఠశాల యాజమాన్యాలు చెప్పడం గమనార్హం.
చిన్నారులకు ఇంత బరువు మించరాదు : స్కూల్ బ్యాగు బరువు నియంత్రణ చట్టం - 2020 ప్రకారం ప్రీ ప్రైమరీ పిల్లలకు అసలు ఎలాంటి బ్యాగు ఉండకూడదు. కానీ ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ఈ పద్ధతి అమలు కావడం లేదు. ఒకటి నుంచి రెండో తరగతి పిల్లల బ్యాగు 2.2 కేజీలు, మూడు నుంచి ఐదు తరగతి వారికి 2.5 కేజీల బరువు మించకూడదు. కానీ పిల్లలు మాత్రం ఇంతకు మించిన బరువును మోస్తున్నారు. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారుల చర్యలు మాత్రం శూన్యం. ఇది తల్లిదండ్రులను ఎంతగానో కలవరపాటుకు గురిచేస్తుంది. పాఠశాలల నుంచి ముడుపులు అందడం వల్లే అధికారులు మౌనం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రీ ప్రైమరీలోని చిన్నారులకు ప్లేవే పద్ధతిలో బోధించాలి. ప్రాథమిక విద్యార్థులకు ప్రభుత్వ సిలబస్ కవర్ చేస్తూ అదనపు విజ్ఞానం కోసం ఇతర పుస్తకాలను బోధించవచ్చు. కానీ పలానా పుస్తకాలనే కొనాలని మాత్రం ఒత్తిడి చేయవద్దు. 6 నుంచి 10వ తరగతి వరకైతే ఎన్సీఈఆర్టీ లేదా ఎస్సీఈఆర్టీ పుస్తకాలను మాత్రమే బోధించాలి. నిబంధనల ప్రకారం విద్యార్థుల బ్యాగు బరువు ఉండాలి - మల్లికార్జున్, నిజామాబాద్ డీఈవో
అధిక ఫీజులు వసూలు : పిల్లలకు మంచి విద్యను అందించాలనే తల్లిదండ్రుల ఆశయాన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమన్యాలు అవకాశంగా మలుచుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం ఇష్టానుసారం ఫీజులను పెంచుతూ పోతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో చాలా వాటిలో సీబీఎస్ఈ, ఒలంపియాడ్, ఐఐటీ ఫౌండేషన్, టెక్నో వంటి ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నుంచి రూ.50 వేలలోపు వసూలు చేస్తున్నారు. ఒకవేళ కొత్త అడ్మిషన్ అయితే రూ.2 వేలు చెల్లించాల్సిందేనంటూ తేల్చి చెబుతున్నారు.
స్కూల్ ఫీజులు ఏడాదికోసారి పెంచుకోవచ్చు! - విద్యా కమిషన్ సిఫార్సులు
ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు - నియంత్రణకు త్వరలోనే ప్రత్యేక చట్టం!

