వాట్సప్‌లో 'హాయ్' అని టైప్ చేయండి - ఇంటి వద్దకే కూలీలు!
రైతులు, కూలీలను సులువుగా అనుసంధానించడానికి ఓ కొత్త పరిష్కారం చూపించిన యువకుడు - వాట్సప్‌లో బ్లూ కనెక్ట్ పేరుతో సరికొత్త చాట్ బాట్‌ను రూపొందించిన వైనం - ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా అడుగులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 4:47 PM IST
Young Man Dhanesh Created Chat Bot on WhatsApp : సాధారణంగా వ్యవసాయ సీజన్ మొదలు కాగానే రైతులు పొలం పనులు మొదలు పెడతారు. చేతిలో పెట్టుబడి ఉన్నా పని చేసేందుకు అవసరమైన కూలీలు మాత్రం దొరకరు. అనుకున్న సమయానికి, అనుకున్న కూలీకి మనుషులు దొరకని పరిస్థితి రైతులది. మరోవైపు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా దగ్గర్లో ఎక్కడ పనులు జరుగుతున్నాయో తెలియక కూలీలు ఇబ్బందులు పడుతుంటారు.
ఇలాంటి పరిస్థితి రైతులు, కూలీలు నిత్యం ఎదుర్కొంటునే ఉన్నారు. చివరికి కావాల్సిన వారు దొరికినా సమయానికి రాకపోవడం, ఎక్కువగా డబ్బు ఖర్చు కావటం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితిని అర్థం చేసుకొని రైతులు, కూలీలను సులువుగా అనుసంధానించడానికి ఓ కొత్త పరిష్కారం చూపించారు కడియాల ధనేష్ అనే యువకుడు.
హాయ్ అని మెసేజ్ పెట్టగానే : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన ధనేష్ వాట్సప్‌లో బ్లూ కనెక్ట్ అనే పేరుతో ఓ చాట్ బాట్‌ను క్రియేట్ చేశారు. ఈ చాట్ బాట్‌ను ఉపయోగించాలంటే మొదట 6281685487 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సప్ చాట్‌లో నంబర్ ఓపెన్ చేయగానే బ్లూ కనెక్ట్ చాట్‌బాట్ మనకు ఆహ్వానం పలుకుంది. తర్వాత హాయ్ అని మెసేజ్ పెట్టగానే పని ఇవ్వాలనుకుంటున్నారా? (రైతు) లేదా పని కోరుతున్నారా? (కార్మికుడు) అని ప్రశ్నలు అడుగుతుంది.
10 కి.మీ. పరిధిలోని కూలీలు : మన ఎంపికకు అనుగుణంగా మాతృ భాషా తెలుగులోనే పలు ప్రశ్నలు వరుసగా వస్తాయి. అలా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మనకు కావాల్సిన వారితో అనుసంధానం చేస్తుంది. ఈ వాట్సప్ ఈ ప్లాట్‌ఫాంలో రైతులు తమకు 10 కి.మీ. పరిధిలో అందుబాటులో ఉన్న కూలీలను సంప్రదించవచ్చు. అంతేగాకుండా ఈ చాట్‌బాట్‌లోనే ప్రభుత్వ పథకాలు, వాతావరణ సంబంధించిన సమాచారమూ అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా లాభాపేక్షలేని సంస్థగా పని చేస్తుండటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫాం రూపొందించినట్టు కడియాల ధనేష్ తెలిపారు.
అవార్డునూ అందుకున్న ధనేష్ : ఈ బ్లూ కనెక్ట్ రూపకర్త ధనేష్ 2023 సంవత్సరంలో మెకానికల్ సబ్జెక్ట్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం చిన్న, చిన్న ఉద్యోగాలు చేసి కొంత డబ్బును కూడబెట్టారు. ప్రస్తుతం ఆ డబ్బుతోనే ఇలాంటి వాట్సప్ చాట్‌బాట్‌లు క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమిట్-2026లో పాల్గొన్నారు. అక్కడ సోషల్ ఇంపాక్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో బ్లూ కనెక్ట్ ప్రాజెక్టుకు అవార్డునూ సైతం అందుకున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకే ఈ చాట్‌బాట్ పరిమితమైంది. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు విస్తరించాలనేది తన లక్ష్యమని కడియాల ధనేష్ చెబుతున్నారు.
పౌరసరఫరాలకు 'మనమిత్ర' వాట్సాప్ - హాయ్ అంటే చాలు అన్నీ సేవలు అందులోనే!

