ETV Bharat / state

సన్నాయి వాయిద్యంలో రాణిస్తున్న యువతులు - పురుషులకు దీటుగా ప్రతిభ చూపుతున్న వైనం

డోలు, సన్నాయి వాయిద్యాలలో రాణిస్తున్న యువతులు - పురుషులకు దీటుగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మహిళలు - నాదస్వరం, డోలు నేర్చుకుంటూ విశేషంగా నిలుస్తున్న విద్యార్థులు - ప్రతిభకు పలు అవార్డులు, రివార్డులు

SPECIAL STORY ON YOUNG ARTISTS
SPECIAL STORY ON YOUNG ARTISTS (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 4, 2026 at 2:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

Students excelling in Playing Drum And Nadaswaram : శుభకార్యాలు, వేడుకలు, ఉత్సవాలకి సన్నాయిమేళం తప్పనిసరి. హిందూ సంప్రదాయంలో డోలు, సన్నాయి మంగళకరమైన వాయిద్యాలు. నాదస్వరం, డోలు పేరు చెప్పగానే పురుష కళాకారులే గుర్తుకు వస్తారు. మగవారికి దీటుగా డోలు, సన్నాయిని వినసొంపుగా వాయిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు కొందరు యువతులు. మంగళకరమైన వాయిద్యాలు నాదస్వరం, డోలు నేర్చుకుంటూ అందరిలో వారు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. తమకు ఇష్టమైన నాదస్వరం, డోలు తదితర సంగీత వాయిద్యాల్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

పురుషులకు దీటుగా సంగీత వాయిద్యాల్లో రాణిస్తూ : గతంలో ఏ శుభకార్యక్రమమైనా సన్నాయి, డోలు వినియోగించేవారు. మారుతున్నపరిస్థితికి అనుగుణంగా వివిధ రకాలైన వాయిద్యాలు వినియోగించేవారు. కానీ కాలంతో పాటు పరిస్థితుల్లోనూ మార్పు వచ్చింది. చాలామంది వివిధ రకాల శుభకార్యాల్లో డోలు, సన్నాయి పెట్టుకుంటున్నారు. ఆ రెండింటి పేరు చెప్పగానే పురుషులు గుర్తుకువస్తుంటారు. ఆ వృత్తిలో మహిళలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎక్కువగా చెన్నై, తమిళనాడు, విజయవాడ, తిరుపతిలో కనిపిస్తారు. కానీ ఇప్పుడు సన్నాయి, డోలు వాయిద్యాలను హైదరాబాద్‌కి చెందిన అమ్మాయిలు నేర్చుకుంటున్నారు. హైదరాబాద్‌ ప్రగతినగర్‌కు చెందిన ఓ కుటుంబం మొత్తం డోలు సన్నాయిలు వాయిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తద్వారా తమ ప్రతిభను చాటుకుంటున్నారు.

సన్నాయి వాయిద్యంలో రాణిస్తున్న యువతులు (ETV)

పలు అవార్డులు రివార్డులు సొంతం : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతతరంలో కొందరు పురుషులు సైతం సన్నాయి, డోలు నెర్చుకోవడం మానేశారు. తల్లిదండ్రుల వద్ద నేర్చుకొని తమతోనే అంతరించి పోకూడదనే ఉద్దేశంతో పిల్లలకు నేర్పిస్తున్నారు. పిల్లలకు చదువుతోపాటు ఆ కళల్లో ప్రావీణ్యం ఉంటే ఉపాధిగా మారుతుందని గురువులు అంటున్నారు. పెళ్లిళ్లు, పండుగలు ఇతర శుభకార్యాల్లో సన్నాయి మేళం వాయిస్తు పలు అవార్డులు, రివార్డులు కైవసం చేసుకుంటున్నారు.

"చిన్నప్పటి నుంచి మా నాన్న ప్రోత్సాహంతో నేను, మా చెల్లెళ్లు సంగీత వాయిద్యాలను ఉపయోగించడం నేర్చుకున్నాం. వారు నాకు సన్నాయి, నాదస్వరం నేర్పించారు. 15 ఏళ్ల వయసు నుంచే ఈ విద్యను అభ్యసించాం. మా తండ్రి మంచి సంగీతంలో విద్వాంసులుగా పేరుతెచ్చుకున్నారు. వారి నుంచి స్ఫూర్తి పొంది మేం నేర్చుకున్నాం. ముందు నుంచే ఇది నేను కూడా నేర్చుకోగలను అని చెప్పి స్టార్ట్​ చేశాను. ఆ దిశగా మా తండ్రి కూడా నన్ను ప్రోత్సహించారు"- ప్రమీల, సంగీత వాయిద్య గురువు

ఓ వైపు చదువుకుంటూనే : చదువు కొనసాగిస్తూనే సన్నాయి, డోలు నేర్చుకుంటూ, పలు కార్యక్రమాలలో రాణిస్తున్నారు ఆ అమ్మాయిలు. కొందరు ఆసక్తితో నేర్చుకుంటే మరికొందరు తమకంటూ ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల్ని ప్రేరణగా తీసుకొని నేర్చుకుంటున్నట్లు విద్యార్థులుతెలిపారు. ఆ విద్యను భవిష్యత్ తరాలకు అందిస్తామని చెబుతున్నారు. సన్నాయితో పాటు డోలు వాయిస్తూ సంప్రదాయ రంగాలలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

"నాదస్వరం వృత్తిలో రెండేళ్లనుంచి ఉంటున్నాను. నేను ఈ రంగంలోకి రావడానికి ముఖ్య కారణం మానాన్నగారు. మొదట్లో నేను కొంచెం తడబడేదాన్ని. కానీ మా నాన్న ప్రోత్సహాంతో నేర్చుకోగలిగాను. ఆయన ఎంతగానో ప్రోత్సహించి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. భవిష్యత్​లో నాలా మరింతమందిని తీర్చిదిద్దాలనుకుంటున్నాను. మా నాన్నవాళ్లు ఈవెంట్లకు వెళ్తుంటారు. నాకు ఉన్న ఆసక్తితోనే దీనిని నేర్చుకున్నాం"- విద్యార్థిని

ఉన్న ప్రతిభకు మెరుగులు దిద్దుతూ పలుచోట్ల రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువతులు. తల్లిదండ్రుల నాటి నుంచి వస్తున్న కళను బతికించుకుంటూ ఆ రంగంలోనే తాము ఉపాధి పొందుతూ మరింత మరింతమందికి నేర్పిస్తామని వారు చెబుతున్నారు. అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీలేదని నిరూపిస్తున్నారు.

YUVA : ఆమె ప్రతిభకు 'నంది' సహా 20కిపైగా అవార్డులు - కూచిపూడి నృత్యంలో రాణిస్తున్న 'ఆశ్నా షెఫాలీ'