ఆర్థిక ఇబ్బందులు అవరోధాలు కావు - కృషి, పట్టుదలతో కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఆరేళ్ల నిరీక్షణ తర్వాత నెరవేరిన వారి స్వప్నం - కానిస్టేబుల్ ఉద్యోగాలతో తల్లిదండ్రుల ఆనందం - ఆర్థిక ఇబ్బందులు అవరోధం కాదని నిరూపించిన అజయ్, సుధీర్ - కృషి, పట్టుదలే విజయసూత్రమంటున్న యువకులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 2:11 PM IST
Young Aspirants Secure Constable Jobs Through Hard Work : ఉన్నత చదువులు చదువుకోవాలని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అలానే ఆ యువకులు కూడా ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు తోడుగా ఉండాలని అనుకున్నారు. కన్నవారి కష్టాలు చూసి రాత్రింబవళ్లు కష్టపడి చదివారు. పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. అమ్మనాన్న తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రమతో సాధన చేసి కానిస్టేబుల్ కొలువు దక్కించుకున్న యువకులపై గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
సుధీర్‌బాబు తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు. పిల్లల్ని మంచి స్థానంలో చూడాలనే ఉద్దేశంతో కూలి పనులు చేస్తూనే బీటెక్ వరకూ చదివించారు. కానీ ఇంజినీరింగ్ పూర్తయినా ఉద్యోగాల్లేక ఏదొ ఒక పని చేసి తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం, కోచింగ్ వెళ్లి సన్నద్ధమయ్యే స్థోమత లేక పరీక్ష రాసి అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో సీటు సంపాదించడం అన్నీ అలా జరిగి పోయాయి.
ఎట్టకేలకు కల నెరవేరింది : స్టడీ సర్కిల్‌లో సీటు తర్వాత కానిస్టేబుల్ కొలువే లక్ష్యంగా చదువు ప్రారంభించిన సుధీర్‌కు కోర్టు కేసుల కారణంగా నోటిఫికేషన్ వాయిదా పడటం కష్టంగా మారింది. అయినా పట్టు వదిలేయలేదు. ఊర్లో ఉండి సన్నద్ధమయ్యేందుకు సౌకర్యాలు లేకపోవడంతో తల్లిదండ్రులతో కలిసి ఏలూరులో గది అద్దెకు తీసుకుని శిక్షణ కొనసాగించాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కావడంతో ఎట్టకేలకు వారి కల నెరవేరింది. కష్టం తీరిందని తెలుపుతున్నారు వాళ్లు.
'2022లో డిగ్రీ పూర్తి అయ్యింది. అప్పటి నుంచి శిక్షణ ప్రారంభించాను. అమ్మానాన్న వ్యవసాయ కూలీలు. ప్రాక్టీస్ కోసం గ్రామంలో సరైన సౌకర్యం లేకపోవడంతే, ఏలూరుకు వచ్చి గది అద్దెకు తీసుకున్నాం. ఇక్కడ గ్రౌండ్లో రోజూ సాధన చేసేవాడ్ని. ఇప్పుడు కానిస్టేబుల్‌కు ఎంపికయ్యాను. డీఎస్పీ కావాలనేది నా లక్ష్యం.' - సుధీర్ బాబు, కానిస్టేబుల్ జాబ్‌కి ఎంపికైన అభ్యర్థి
ప్రిపరేషన్ సమయంలో గది అద్దె, ఖర్చుల కోసం సుధీర్ తల్లి ఓ పాఠశాలలో ఆయాగా చేరి మరీ తనను ప్రోత్సహించారు. ఎంత కష్టమైనా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి కూలీ పనులు చేస్తూనే తనకు అండగా నిలిచారు. పిల్లల్ని ప్రయోజకులు చేయాలనే ఆశయంతో కష్టపడి చదివించానని ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం దక్కడంతో సంతోషంగా ఉందంటున్నారు సుధీర్ తల్లి విజయ లక్ష్మి.
కష్టపడింది, కల నెరవేర్చుకుంది - పెళ్లి ఒత్తిడి తట్టుకొని కానిస్టేబుల్‌గా ఎంపికైన కల్పన
అజయ్ కాకినాడలో : ఇదిలా ఉండగా అజయ్ బాబుది మరో కథ. అరెకరం పొలం ఉన్నా అది మెట్ట కావడంతో నీటి వసతి లేక తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలుగా పని చేసేవారు. తండ్రి తాపీ మేస్త్రీ. 2018లో డిగ్రీ పూర్తి చేసిన అజయ్ ఆ వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అప్పుడే కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నాడు. కాకినాడలోని ఓ ప్రైవేటు కోచింగ్ సెంటర్‌లో చేరాడు. అక్కడే గది అద్దెకు తీసుకుని చదువుకుంటూ కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధమయ్యాడు.
మరెందరో గెలుపు బాట చూపారు ఈ యువకులు : ఏడాదిన్నర క్రితం తండ్రి అకాల మరణంతో కుటుంబ భారం తల్లిపై పడింది. అప్పుడే కోచింగ్ ఆపేసి ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషిద్దామనుకున్నాడు అజయ్. ఇంట్లో వాళ్లు సర్దిచెప్పడంతో చివరి ప్రయత్నంగా శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగంతో ఆగిపోనని గ్రూప్-2 సాధించడమే లక్ష్యమని చెబుతున్నాడు అజయ్ బాబు. కృషి, పట్టుదలతో శ్రమించాలనే కానీ ఆర్థిక ఇబ్బందులు అవరోధాలు కాదని నిరూపించి కానిస్టేబుల్ కొలువు సాధించారు ఈ యువకులు. తమలాంటి మరెందరో గ్రామీణ యువకులకు ఓ గెలుపు బాట చూపిస్తున్నారు.
12 రాష్ట్రాల నుంచి 1900 మంది - ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్న విద్యార్థులు

