'యాగంటి'కి పెరుగుతున్న ఆదాయం - వసతులు లేక భక్తుల ఇబ్బందులు
యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం ఆదాయం పెరుగుతున్నా, కనీస వసతులు లేక భక్తుల కష్టాలు- క్షేత్రంలో ఎలాంటి అభివృద్ధి పని చేయాలన్నా పురావస్తుశాఖ అధికారుల మెలిక

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 3:35 PM IST
Yaganti UmaMaheswara Swamy Temple At Nandyal District : ఏకశిలపై శివపార్వతులు కొలువుదీరి ఉండటం. అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రాంతం, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన వేదిక. ఇరవై ఏళ్లకు ఒకసారి అంగుళం ఎత్తు పెరుగుతున్న బసవన్న. చుట్టూ కొండలు. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాల్లో నంద్యాల జిల్లాలోని బనగానపల్లె సమీపంలో ఉన్న యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ కనీసం భక్తులకు ‘వసతి’ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల నూతన పాలకమండలి కొలువుదీరిన నేపథ్యంలో భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
క్షేత్ర పరిధిలో దేవాదాయశాఖకు సొంత స్థలం లేదు : ఆలయానికి సంబంధించి 96 ఎకరాల మాన్యం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ భూములు బనగానపల్లి మండలంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్ర పరిధిలో దేవాదాయశాఖకు సొంత స్థలం లేకపోవడం గమనార్హం. ఉన్న కొంత స్థలాన్ని ఇతరులు ఆక్రమించుకుంటున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆలయం ఎదురుగా కొండలు ఉన్నాయి. వాటిని తొలగిస్తే కొంత వరకు అభివృద్ధి పనులు చేపట్టొచ్చని స్థానికులు వివరిస్తున్నారు. కానీ అందుకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దిశగా పాలకమండలి దృష్టి సారించాలి.
8 నెలల్లో రూ. 4 కోట్ల ఆదాయం : ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉండటంతో ఇక్కడకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కేవలం భక్తుల ద్వారానే ఏటా రూ. కోటికిపైగా ఆదాయం సమకూరుతోందని ఆలయ అధికారులు తెలుపుతున్నారు. గత ఎనిమిది నెలల్లో రూ.4 కోట్ల ఆదాయం వచ్చింది. దండిగా ఆదాయం వస్తున్నా క్షేత్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. భక్తులు రాత్రివేళల్లో బస చేయడానికి దేవాలయానికి సంబంధించి వసతి గృహాలు లేవు. ఆలయ సమీపంలో పర్యాటక శాఖకు చెందిన కాటేజీలు మాత్రమే ఉన్నాయి. ఇందులో అద్దెలు ఎక్కువగా ఉండటంతో భక్తులకు భారంగా మారింది.
స్పందించని పురావస్తుశాఖ - కొరవడిన అభివృద్ధి : పురాతన ఆలయం కావడంతో పురావస్తుశాఖ పర్యవేక్షిస్తోంది. ఆలయ నిర్వహణను దేవాదాయశాఖ నిర్వర్తిస్తోంది. క్షేత్రంలో ఎలాంటి అభివృద్ధి పని చేయాలన్నా పురావస్తుశాఖ అధికారులు మెలిక పెడుతున్నారు. ప్రసాదం తయారీ షెడ్డు, శుద్ధజల కేంద్రం, ఎక్స్‌లేటర్ తదితర పనులు చేపట్టాలని గత సెప్టెంబరులో పురావస్తుశాఖకు ప్రతిపాదనలు పంపినా స్పందించలేదని ఆలయాధికారులు వాపోతున్నారు. క్షేత్రంలో నూతన వసతిగృహాలు, నిత్యాన్నదాన సత్రాలు, సీసీ రహదారులు, భక్తుల వరసల నిర్మాణాలు, వాహనాల పార్కింగ్, కోనేరు పరిసరాల్లో జంగిల్ క్లియరెన్సు, చరవాణి టవర్ ఏర్పాటు తదితర విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆలయాధికారి పాండురంగారెడ్డి తెలిపారు.
ఆలయ ప్రాంగణంలో భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలివే : కోవెలలో తాగునీటి వసతి లేదు. స్థానికంగా వసతి గృహాలు లేకపోవడంతో భక్తులు ప్రైవేటు అతిథి గృహాలను ఆశ్రయిస్తున్నారు. కార్తికమాసం, శివరాత్రి ఉత్సవాలకు పెద్దసంఖ్యలో వాహనాల్లో భక్తులు వస్తుంటారు. వాహనాల పార్కింగ్‌కు స్థలం లేకుండాపోయింది. ప్రైవేటు స్థలంలో నిలుపుతున్నారు. గర్భగుడి మరమ్మతులకు గురికావడంతో వర్షాకాలంలో కారుతోంది.
ఆదాయం : గత ఎనిమిది నెలల్లో ఆలయ ఆదాయం రూ.4 కోట్లు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.1.62 కోట్లు అయినట్లు వివరిస్తున్నారు. ఆలయానికి సంబంధించిన బ్యాంకు బ్యాలెన్సు రూ.98 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. భక్తుల సంఖ్య రోజుకు 1,500 (వారాంతంలో 5 వేల మంది) గా ఉంటున్నట్లు ఆలయ సిబ్బంది వెల్లడించారు.
యనమదుర్రుగా మారిన యమపురి - ఇక్కడ విచిత్రంగా శివయ్య
శివాలయం దగ్గర మట్టి పనులు - బయల్పడిన 15వ శతాబ్దపు ఆళ్వారుల విగ్రహాలు

