సంపూర్ణ చంద్రగ్రహణం - యాదగిరిగుట్ట ఆలయం మూసివేత - ఎప్పుడు తెరుస్తారంటే?
సంపూర్ణ చంద్రగ్రహణం దృష్ట్యా యాదగిరిగుట్ట ఆలయాన్ని మూసివేసిన అర్చకులు - రేపు ఉదయం 3 గంటల వరకు మూసివేత - సంప్రోక్షణ, ఆలయ శుద్ధి అనంతరం నిత్యా పూజలు చేసి దర్శనానికి భక్తులకు అనుమతి

Published : March 3, 2026 at 12:55 PM IST
Yadagirigutta Temple Closed Due to Lunar Eclipse : ఈరోజు సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలను మూసివేశారు. అందులో భాగంగా ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఉదయం 7 గంటలకు ఆలయ అర్చకులు, అధికారులు సమక్షంలో మూసివేశారు. బుధవారం ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసే ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు తెలిపారు. రేపు ఉదయం 3 గంటల తర్వాత సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, నిత్య పూజలు చేసి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని వివరించారు.
శ్రీవారి గర్భాలయాన్ని మూసివేసిన అధికారులు : టీటీడీ అధికారులు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా సుమారు 10.30 గంటల పాటు ఆలయం మూసివేత ఉంటుందని ప్రకటించారు. ఉదయం 9 గంటలకు శ్రీవారి గర్భాలయం, మహాద్వారాన్ని అర్చకులు మూసివేశారు. మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణ కాలం ఉండనుంది. తిరుమలలో ఉదయం 9 గంటలకు అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ నిలిపివేశారు. సాయంత్రం గ్రహణం వీడాక శుద్ధి, పుణ్యాహవచనంతో దర్శనాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. నేటి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ అనుమతిని టీటీడీ నిరాకరించింది.
టికెట్ల జారీ నిలిపివేసిన టీటీడీ : ఇవాళ శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేసిన అధికారులు రేపు శ్రీవారి సర్వదర్శన టోకెన్లు జారీ పునఃప్రారంభించారు. నేడు శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్ల విక్రయాలను కూడా నిలిపివేశారు. విమానాశ్రయంలో 200, రోజువారీ ఆన్‌లైన్ టికెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది. భద్రాచలంలోని ఆలయాన్ని ఉదయం 8.30 గంటలకు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం రాత్రి 8 గంటలకు భక్తులకు దర్శనాలు ఉంటాయని అధికారులు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో వైభవంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి బ్రహ్మ పుష్కరిణిలో తెప్పోత్సవం, డోలొత్సవం జరిగింది. చంద్రగ్రహణం దృష్ట్యా ఉదయం 9 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ, గ్రహణ హోమం అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు.
సంప్రోక్షణ కార్యక్రమాలు : ఉదయం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలు మూసివేసి ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 7.30 గంటల నుంచి ఆలయ ద్వారాలు తెరవనున్న అర్చకులు వెల్లడించారు. నేడు ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రాత్రి 9 గంటలకు స్వామి అమ్మవార్ల మహామంగళ హారతి కార్యక్రమం ఉంటుందన్నారు. శ్రీశైలంలో రాత్రి 9 నుంచి రాత్రి 10.30 గంటల వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనంకానుంది.
జోగులాంబ అమ్మవారి ఆలయం మూసివేత : గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. చంద్రగ్రహణం దృష్ట్యా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు మూసివేసి రేపు ఉదయం 9 గంటలకు ఆలయశుద్ధి మాహసంప్రోక్షణ చేసిన తర్వాత దర్శనానికి అనుమతి ఉంటుంది. ఈరోజు అన్నీ దేవాలయాలను చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు. కొన్ని ఆలయాల్లో సాయంత్రం గ్రహణం ముగిశాక శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత దర్శనాలకు అనుమతించనున్నారు. ఏపీలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న ఆలయాన్ని అధికారుల సమక్షంలో అర్చకులు మూసివేశారు. ఆర్జిత సేవలు సైతం రద్దు చేశారు.
మొన్న జ్వాలా వలయంతో సూర్యుడు- ఇప్పుడు రక్త వర్ణంలో చంద్రుడు!- అంతరిక్షంలో ఏం జరుగుతోంది?
కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం- ఏయే రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా?

