కనుల పండువగా శ్రీ లక్ష్మీ నరహింహ స్వామి కల్యాణ మహోత్సవం - తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం
కనుల పండువగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ ఘట్టం - సింహ లగ్నంలో అమ్మవారికి మాంగళ్యధారణ చేసిన స్వామివారు - చతుర్వేద పఠనం, మంత్రోచ్ఛారణ, జయ జయ ధ్వానాల మధ్య తిరు కల్యాణం

Published : February 26, 2026 at 9:14 AM IST
Sri Lakshmi Narasimha Swamy Brahmotsavam : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపై లక్ష్మీ నారసింహుల కల్యాణ మహోత్సవం కనుల పండవగా జరిగింది. గజవాహనంపై నారసింహుడు పెళ్లి కుమారుడిగా ముస్తాబై, మాఢ వీధుల్లో విహరిస్తూ ఉత్తర మాఢ వీధిలోని కల్యాణ వేదికకు చేరుకున్నారు. పల్లకీపై అమ్మవారు లక్ష్మీదేవి తిరువీధిలోని మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని అర్చకులు, వేద పండితులు, రుత్వికులు, పారాయణికులు కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించారు.
ముత్యాల తలంబ్రాల సమర్పించిన గవర్నర్ : స్వామివారి తిరు కల్యాణానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధా దేవ్ వర్మ ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సింహ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, వేద పారాయణాలు, మంగళ వాద్యాలు, కరతాళ ధ్వనుల మధ్య నరసింహస్వామి వారు లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఈ సమయంలో ఆలయ ప్రాంగణం నమో నారసింహ, జై నరహింహ అంటూ గోవిందా నామస్మరణతో మార్మోగింది. స్వామి అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్యక్షేత్రంలో నవానిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన కార్యక్రమం కల్యాణ మహోత్సవం. లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం స్వామివారు అమ్మవారి మెడలో మంగళ సూత్రధారణ గావించారు. స్వామివారి కరుణా కటాక్షములు సమస్త లోకాలకు సంతరిస్తాయి. వెంకటాచార్యులు, యాదగిరిగుట్ట, ఆలయ ప్రధాన అర్చకులు
నాలుగో సారి వార్షిక బ్రహ్మోత్సవాలు : లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం స్వామివారు అమ్మవారి మెడలో మంగళ సూత్రధారణ గావించారని, స్వామివారి కరుణా కటాక్షములు సమస్త లోకాలకు సంతరిస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు వెంకటాచార్యులు వివరించారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత నాలుగోసారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. స్వామి వారి కల్యాణం కొండపై ఆలయ సన్నిధిలో నిర్వహించడంతో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ మాఢ వీధులు భక్తులతో నిండిపోయాయి. కల్యాణ ఘట్టం అంగరంగ వైభవంగా జరిగిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.
స్వామివారి తిరు కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో ప్రజానికం అందరూ హాజరయ్యారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఏ బ్రహ్మోత్సవాల్లో, ఏ కల్యాణోత్సవాల్లో కూడా రానంత మంది భక్తులు ఈసారి పాల్గొనడం ఒక శుభసూచకం. - భవాని శంకర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో
మూడు గంటల కల్యాణ మహోత్సవం : బుధవారం రాత్రి 9.30 గంటలకు కల్యాణ తంతు ప్రారంభమైంది. అర్ధరాత్రి లోక కల్యాణం, జగత్ రక్షణ కోసం స్వామివారు అమ్మవారి మెడలో మంగళ సూత్రధారణ గావించారని, స్వామివారి కరుణా కటాక్షములు అమ్మవారితో పాటు సమస్త లోకాలకు సంతరిస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు వెంకటాచార్యులు వివరించారు. ఈ కల్యాణ మహోత్సవం సుమారు మూడు గంటల పాటు జరిగింది. యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 18వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కల్యాణ మహోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
యాదాద్రిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు - మూడోరోజు మత్స్యావతారంలో స్వామివారు
వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు - ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు

