ETV Bharat / state

అమరావతిలో 'ప్రపంచ స్థాయి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ' - ఈ నెలలో శంకుస్థాపన

రూ.150 కోట్లతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు - రూ.100 కోట్లు ఇవ్వనున్న దుబాయ్‌కు చెందిన శోభా గ్రూప్‌ - ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా రూపకల్పన

Model of the Central Library building
Model of the Central Library building (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 2, 2026 at 10:15 AM IST

3 Min Read
Choose ETV Bharat

Establishment Of Central Library In Amaravati : రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పనులకు ఈ నెలలో శంకుస్థాపన చేయనున్నారు. సాధారణ గ్రంథాలయానికి పరిమితం కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విజ్ఞాన, పరిశోధన, సాంస్కృతిక కేంద్రంగా ఈ లైబ్రరీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

దాతల సహకారంతో నిర్మాణం : ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం రూ.150 కోట్లలో రూ.100 కోట్లను దుబాయ్‌కు చెందిన ప్రముఖ స్థిరాస్తి సంస్థ శోభా గ్రూప్ అందించనుంది. మిగిలిన రూ.50 కోట్లను ఇతర దాతలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా సమీకరించనున్నారు. అవసరమైతే అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. నిర్మాణాన్ని ప్రారంభించిన 24 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు.

19.60 ఎకరాల్లో విజ్ఞాన సముదాయం : రాజధానిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) సమీపంలో 19.60 ఎకరాల భూమిని సీఆర్‌డీఏ ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. ఇదే ప్రాంగణంలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో పాటు తెలుగు సాంస్కృతిక కేంద్రం, మానవ వనరుల అభివృద్ధి సంస్థ భవనాలను కూడా నిర్మించనున్నారు. ఈ భవనాలకు సంబంధించిన డిజైన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి.

ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా రూపకల్పన : స్టేట్ సెంట్రల్ లైబ్రరీని ఆధునిక సాంకేతికతతో పాటు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. మూడు లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో జీ+5 అంతస్తుల భవనంగా ఇది నిర్మితమవుతుంది. ఒకేసారి 2,500 మంది కూర్చునే సదుపాయంతో దేశంలోనే అతిపెద్ద సీటింగ్ సామర్థ్యం కలిగిన గ్రంథాలయంగా ఇది నిలవనుంది.

ఈ గ్రంథాలయంలో అన్ని వర్గాల పాఠకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 10 లక్షలకు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నారు. సాహిత్యం, విజ్ఞానం, సాంకేతికత, చరిత్ర, వైద్యం, న్యాయశాస్త్రం, పోటీ పరీక్షలు, పరిశోధనలకు సంబంధించిన విస్తృత సేకరణను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ సమాచార వనరులకూ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

విద్యార్థులు, పరిశోధకులకు ప్రత్యేక విభాగాలు : సాధారణ పాఠకులతో పాటు విద్యార్థులు, పరిశోధకులకు ప్రత్యేకంగా వేర్వేరు పఠన విభాగాలను ఏర్పాటు చేస్తారు. వారికి అవసరమైన పుస్తకాలు, సమాచార వనరులు ఆయా విభాగాల్లో అందుబాటులో ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రత్యేక రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసి, అత్యాధునిక అధ్యయన సౌకర్యాలను కల్పించనున్నారు.

అంతేకాకుండా చిన్నారుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక బాలల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ లైబ్రరీ, ఇ-లైబ్రరీ సేవలతో పాటు ఆన్‌లైన్ సమాచార వనరులను కూడా అందుబాటులో ఉంచుతారు. అరుదైన పుస్తకాలు, పురాతన రాతప్రతులను భద్రపరిచే ప్రత్యేక సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

నాలెడ్జ్, కమ్యూనిటీ, క్రియేటివ్ స్పేస్‌లు : సంప్రదాయ గ్రంథాలయానికి భిన్నంగా ఈ భవనంలో నాలెడ్జ్ స్పేస్, కమ్యూనిటీ స్పేస్, క్రియేటివ్ స్పేస్, ఓపెన్ స్పేస్ వంటి విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యా, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక వేదికలు, సమావేశ ప్రాంగణాలు, చర్చా వేదికలు ఇందులో భాగంగా ఉంటాయి.

జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ హాళ్లు, సెమినార్ హాళ్లు, ఆధునిక ఆడిటోరియం, ఎగ్జిబిషన్ గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, పుస్తక ప్రదర్శనలు, సాహిత్య సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఇది ప్రధాన వేదికగా ఉపయోగపడనుంది.

ఆంధ్ర సంస్కృతికి ప్రతీకగా ప్రత్యేక డిజైన్ : ఈ భవన నిర్మాణంలో సంప్రదాయం, ఆధునికతకు సమన్వయం కల్పించారు. మొత్తం 108 స్తంభాలను బౌద్ధ స్తూపాల్లో కనిపించే ఆయక స్తంభాల స్ఫూర్తితో నిర్మించనున్నారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ఈ స్తంభాలపై కళాత్మకంగా ప్రతిబింబిస్తారు. అలాగే భవనంలోని మెట్లను ఉండవల్లి గుహల శిల్పకళ స్ఫూర్తితో రూపొందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని ప్రతిఫలించేలా రూపకల్పన చేశారు.

స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణం పూర్తైన తర్వాత అమరావతిలో ఇది ఒక ఐకానిక్ నాలెడ్జ్ హబ్‌గా నిలవనుంది. విద్యార్థులు, పరిశోధకులు, రచయితలు, సాహిత్యాభిమానులు, సాధారణ పాఠకులకు ఒకే వేదికపై అత్యాధునిక అధ్యయన, పరిశోధన, సాంస్కృతిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితమయ్యే ఈ గ్రంథాలయం రాష్ట్ర విజ్ఞానాభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

రాజధానిలో అతిపెద్ద డ్రోన్‌ డెలివరీ నెట్‌వర్క్‌ను నిర్మించనున్నాం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

అమరావతి మీదుగానే బుల్లెట్‌ రైలు - పాత ప్రతిపాదనకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు