త్వరలో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి - రూ.లక్ష ఎలా పొందాలంటే?
మహిళా దినోత్సవ బహుమతి - డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకు, వివాహాలకు చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి పథకాలు


By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 6:20 PM IST
NTR Vidya Lakshmi And Kalyana Lakshmi Schemes For DWACRA: మహిళా దినోత్సవాన్ని (మార్చి 8) పురస్కరించుకొని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు అందించనుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచే రెండు కీలక పథకాలతో పాటు మరిన్ని వరాలను ప్రకటించనున్నారు. వీటికి ఇప్పటికే ఆయన ఆమోదముద్ర వేశారు.
రూ.లక్ష వరకు పావలా వడ్డీకి రుణం: డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకు, వివాహాలకు చేయూతనిచ్చేలా "ఎన్టీఆర్ విద్యాలక్ష్మి", "ఎన్టీఆర్ కల్యాణలక్ష్మి" పథకాలను సెర్ప్ అధికారులు రూపొందించారు. ఈ పథకాల కింద స్త్రీ నిధి బ్యాంకు (సెర్ప్ పరిధి) ద్వారా గరిష్ఠంగా రూ.లక్ష వరకు పావలా వడ్డీకి రుణం అందిస్తారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేశారు. గతేడాది అక్టోబరులోనే వీటిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించినా సీఎం ఆదేశాల మేరకు పథకాల అమలులో లోపాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా ఈ పథకాలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం ఉన్న సభ్యులకు ఈ పథకాలు వర్తింపజేయనున్నారు. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఉన్నతి, ఇతర మార్గాల్లో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించే వారికి చేయూత అందజేస్తారు. లబ్ధిదారు బయోమెట్రిక్ నమోదు ఆధారంగా పథకాలు అమలు చేస్తారు.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం: పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలకు చెల్లించాల్సిన ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువుకు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణసాయం 4% వడ్డీ (పావలా వడ్డీ)కి ఇస్తారు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. అడ్మిషన్ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇనిస్టిట్యూట్ వివరాలు, రసీదులు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు.
ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి: సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది. అవసరానికి అనుగుణంగా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు (గరిష్ఠంగా) రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది. 4% వడ్డీ (పావలా వడ్డీ)కి ఇస్తారు. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లించాలి. లగ్నపత్రిక, శుభకార్యం నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా సమర్పించాలి. పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు.
ఒక్కో పథకానికి ఏడాదికి రూ.1,000 కోట్లు: ఒక్కో పథకానికి ఏడాదికి రూ.1,000 కోట్ల చొప్పున రెండింటికి కలిపి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ పథకాల అమలు ద్వారా పావలా వడ్డీ కింద సమకూరే ఆదాయంలో 50 శాతాన్ని తిరిగి డ్వాక్రా సంఘాలకు అనుబంధంగా ఉన్న మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యల బలోపేతానికి వినియోగించనున్నారు. మిగతా 50 శాతం స్త్రీ నిధి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు. ఈ పథకం కింద రుణసాయం పొందిన తర్వాత సదరు లబ్ధిదారు ప్రమాదంలో చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,500 మంది యానిమేటర్లు, 5 వేల మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్లు విధులు నిర్వర్తిస్తుండగా, వీరికి రూ.15 వేలు విలువ చేసే సెల్‌ఫోన్లు ఉచితంగా ఇవ్వనున్నారు. 600 మంది ఏపీఎంలకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో వీరికి సెల్‌ఫోన్లు ఇవ్వగా చాలా వరకు అవి పాడైపోయాయి.
రోలర్ స్కేటింగ్‌లో రాణిస్తున్న భవ్య శ్రీ - క్రీడల విభాగంలో ఎంబీబీఎస్ సీటు
సేంద్రియ సాగుకు రైతు సాధికార సంస్థ ప్రోత్సాహం - ఈనెల 21, 22న రైతు ఉత్సవం

