
వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రులకు - చాలా మంది రొమ్ము క్యాన్సర్ బాధితుల పరిస్థితి ఇదే
60 నుంచి 70 శాతం మందిది ఇదే తీరు - 40 ఏళ్లు దాటితే స్క్రీనింగ్ తప్పనిసరి - ఆసుపత్రుల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు

Published : October 15, 2025 at 8:25 PM IST
Breast Cancer Advanced Stage in Women : మహిళల్లో రొమ్ము క్యాన్సర్ చాపకింద నీరులా కోరలు చాస్తోంది. చాలామందికి రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడం, సామాజిక బిడియం (మొహమాటం) వల్ల వ్యాధి బాగా ముదిరే వరకు పరీక్షలు చేయించుకోవడం లేదు. 60 నుంచి 70 శాతం మంది చివరి దశలో డాక్టర్లను సంప్రదిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే (మెహదీ నవాబ్ జంగ్) ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. నగరంలోని ఇతర క్యాన్సర్ ఆసుపత్రుల్లో సైతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
రొమ్ములో అసాధారణ కణజాలం పెరిగితే అది క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంటుంది. గడ్డలు ఉన్నంత మాత్రాన అది క్యాన్సర్ అని నిర్ధారణకు రాకూడదు. తప్పనిసరిగా సంబంధిత మెడికల్ టెస్టులు చేయించుకోవడం అవసరం. తొలి దశలోనే గుర్తిస్తే వ్యాధిని వేగంగా నియంత్రించవచ్చు. చాలామందిలో దీనిపై అవగాహన లేకపోవడం వల్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. అక్టోబరు నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం అయిన నేపథ్యంలో ప్రత్యేక కథనం మీకోసం.
ఈ లక్షణాలు ఉంటే..
- రొమ్ము ఆకృతిలో మార్పు
- రొమ్ములో కణితి చేతికి తగిలేలా ఉండటం
- చనుమొన నుంచి రక్తం, ఇతర స్రావాలు కారడం
- చనుమొన చొట్టపడి లోపలకు పోవడం
- గజ్జల్లో వాపు
వ్యాధికి ప్రధాన కారణాలు...
- లైఫ్స్టైల్లో మార్పులు
- అధిక కొవ్వుతో కూడిన ఆహారం తీసుకోవడం
- అధిక బరువు, ఎక్కువగా మద్యం సేవించడం
- కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర
- ఆలస్యంగా పిల్లలు కలగడం
- హార్మోన్ల ప్రభావం ఉండటం
- చిన్న వయసులోనే రుతుక్రమం మొదలవటం
"రొమ్ము క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించడం ద్వారా ఆదిలోనే దానిని నియంత్రించవచ్చు. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ మమోగ్రామ్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలి. కుటుంబంలో తల్లి, తోబుట్టువుకు గతంలో వ్యాధి ఉంటే మిగతావారు చాలా అప్రమత్తంగా ఉండాలి. నెలలో ఒకసారి స్వీయ పరీక్ష చేసుకోవాలి. గడ్డలు లాంటివి చేతికి తగిలితే ఆందోళన పడకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. జీవనశైలిలో కొన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసుకోవడం ద్వారా వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చు" -ప్రొఫెసర్ రఘునాథ్‌రావు, మెడికల్ అంకాలజీ, ఎంఎన్‌జే
రొమ్ము క్యాన్సర్ చికిత్స తర్వాత : కారణమేదైనా చికిత్స అనంతరం నీరసించిపోయిన శరీరాన్ని తిరిగి పునరుత్తేజితం చేయాలంటే అందుకు వ్యాయామం చక్కగా దోహదం చేస్తుంది. అందులోనూ క్యాన్సర్ చికిత్స తర్వాత వర్కవుట్‌ని తమ రొటీన్‌లో భాగం చేసుకున్న వారిలో మళ్లీ రొమ్ము క్యాన్సర్ తలెత్తే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయని పలు పరిశోధనలు సైతం స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల శ్వాస సంబంధిత వ్యాయామాలు, భుజాలు, చేతులతో చేసే చిన్నపాటి వ్యాయామాలు చికిత్స అనంతరం కొద్దిగా కుదుట పడిన తర్వాత చేయడం మంచిదంటున్నారు నిపుణులు.
అలాగే శారీరక శక్తిని తిరిగి పొందడానికి జుంబా డాన్స్ లాంటి వర్కవుట్స్ చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు. అయితే రొమ్ము క్యాన్సర్ సర్జరీ తర్వాత వర్కవుట్లు ఎప్పుడు ప్రారంభించాలి? శరీరంపై ప్రభావం పడకుండా ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వంటి విషయాలు మాత్రం మీ ఆరోగ్య స్థితిని తెలియజేసి ముందుగానే నిపుణులను అడిగి తెలుసుకొని ఆపై ఆచరించడం మంచిది. లేదంటే ఇతర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా లేకపోలేదు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది : మిస్ వరల్డ్ ఓపల్ సుచాత
'రొమ్ము క్యాన్సర్‌కు మందు.. నాలుగో దశలోనూ నయం.. భారత శాస్త్రవేత్త ప్రతిభ!'

