తొలి ప్రయత్నంలోనే IES - నాన్న కల ఆమె ర్యాంక్
మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్‌సీ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) ఎంపికైన తిరుపతి యువతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 19, 2025 at 12:22 PM IST
Women from Tirupati Crack Indian Engineering Services (IES) : సాధించాలనే తపన, పట్టుదల, కష్టపడేతత్వం, లక్ష్యం దిశగా కృషి ఉంటే విజయం వరిస్తుంది. కొందరు ఆర్థిక సవాళ్లను, కుటుంబ సమస్యలను దాటి తమ కోరుకున్న జీవితాన్ని పొందుతారు. అలాంటి వారు తోటి వాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తారు. యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షల్లో అత్యంత కష్టమైన వాటిల్లో ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) కూడా ఒకటి. దాన్ని తొలి ప్రయత్నంలోనే సాధించారు 22 ఏళ్ల ఇందుమతి. పేదరికం, హేళనలే తనలో పట్టుదలనీ, కసినీ పెంచాయంటున్న ఆమె ఆ ప్రయాణాన్ని ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఏదైనా సాధించడానికి అన్నిసార్లూ పేదరికమే అడ్డు కాదు. హేళనలూ, నిరుత్సాహమూ వెనకడుగు వేసేలా చేస్తాయనుకుంటారు అంతా. కానీ తనలో మాత్రం అవే సాధించాలన్న పట్టుదలని పెంచాయంటుంది ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ కొలువు సాధించిన ఇందుమతి. తనది తిరుపతి, తండ్రి కృష్ణమూర్తి లారీ డ్రైవర్, తల్లి మాధవి బర్డ్ ఆసుపత్రిలో అసిస్టెంట్‌గా చేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ కష్టపడుతూ తమ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు.
‘నీకు నచ్చింది చదువుకో’ : మదుమతి నాన్నకి బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉండేదని, కానీ పరిస్థితుల దృష్టా అది సాధ్యపడక కల లాగే మిగిపోయిందని అమె అంటున్నారు. దాన్ని కూతురు సాధిస్తే చూడాలనుకున్నారు ఆ తండ్రి. అందుకే ‘అమ్మాయికి చదువెందుకు?’ అని అందరూ ఎంత నిరాశపరిచినా తనకు మాత్రం ‘నీకు నచ్చింది చదువుకో’ మనే చెప్పేవారని మదమతి తెలుపుతున్నారు. వాళ్ల మాటలు తన తండ్రిని ఎంత బాధపెట్టాయో కానీ తనలో మాత్రం కసిని పెంచాయంటున్నారు ఈమె. కాబట్టే, పదో తరగతిలో 9.7 జీపీఏ, పాలిటెక్నిక్‌లో 93% మార్కులు సాధించానని అంటున్నారు. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందిన కారణంగా ఆమెకు మంచి కళాశాలలో ఇంజినీరింగ్ సీటొచ్చింది.
ప్రొఫెసర్లే డబ్బులు పోగుచేసిచ్చారు : ఎలక్ట్రానిక్స్‌పై మక్కువతో బీటెక్‌లో ఈఈఈ చదవాలనుకున్నారు మదుమతి. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని, దీంతో మా స్కూలు హెడ్‌మాస్టర్ సాయం చేశారని చెప్తున్నారు. ఇక్కడా బాగా చదివి జేఎన్‌టీయూ కాకినాడ నుంచి బంగారు పతకం అందుకున్నట్లు వివరించారామె. అప్పుడే ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ సాధించాలన్న కల ఏర్పడిందని, దిల్లీలో కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడూ మళ్లీ డబ్బుల సమస్యే! అప్పుడు కళాాశాల ప్రొఫెసర్లే డబ్బులు పోగుచేసి రూ.లక్ష అందించారని చెబుతున్నారు. అయితే అక్కడ ఉండటానికి కావాల్సిన ఖర్చులకు తండ్రి మరింత కష్టపడాల్సి వచ్చిందని అంటున్నారు.
రోజు 12, పరీక్షల సమయంలో 15 గంటలు : తిరుమల ఘాట్‌రోడ్లలో నడుపుతూ లారీ క్యాబిన్‌లో ఆయన పడే కష్టం ఎన్నోసార్లు కళ్లారా చూశాని, అలాంటి నాన్న కష్టాన్నీ, ఇంతమంది నమ్మకాన్నీ వృథా చేయొద్దు అనుకున్నారు మదుమతి. ఫోన్, సోషల్‌మీడియా, సినిమాలు అన్నీ పక్కనపెట్టి ఏడాదిపాటు పుస్తకమే లోకంగా గడిపారు. రోజులో 12గంటలు చదివేదాన్నని చెప్తున్నారు మదుమతి. పరీక్షల సమయంలో 15 గంటలు కష్టపడ్డారు. అలా ఈ ఏడాది జూన్‌లో ప్రిలిమ్స్ రాశారు. ఆపై మెయిన్స్‌నీ సాధించారు. బాగానే రాసినా తెలియని ఆందోళన ఉండేదంటున్నారు. ఇంటర్వ్యూ విషయంలోనూ అంతే అని, ఇంటర్వ్యూయర్లు ఇచ్చిన ప్రోత్సాహంతో అడిగిన ప్రశ్నలకు ఆత్మవిశ్వాసంతో సమాధానాలిచ్చాను అంటున్నారు. సాధిస్తానని నమ్మకం ఉంది కానీ 75వ ర్యాంకు సాధించా అని తెలిసినప్పుడు చాలా ఆనందమేసిందని,. నాన్న అయితే ఆ కబురు విని భావోద్వేగానికి గురయ్యారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగే పెద్ద ప్రాజెక్టుల్లో టెక్నికల్ హెడ్‌గా సేవలందించాలని ఇదే తన ముందున్న ప్రధాన లక్ష్యమంటున్నారు మదుమతి.
అమ్మభాషకు అక్షరసేద్యం - రిటైర్డ్ ఇంగ్లిష్ టీచర్ 'తెలుగు లిపి కాపాడుదాం'

