ETV Bharat / state

3సార్లు గుండె ఆగినా, ప్రాణం నిలబెట్టారు- విశాఖ కిమ్స్​ వైద్యుల ప్రతిభ

మూడుసార్లు గుండె ఆగినా కిమ్స్ వైద్యుల చికిత్సతో ప్రాణాలు దక్కించుకున్న మహిళ- వెంట్రిక్యులర్ టాకీకార్డియా, వీఎఫ్‌, మూత్రపిండాల వైఫల్యం, కుచించిన ఊపిరితిత్తిలు ఇన్ని సమస్యలున్నా నిలిచిన ప్రాణం

Women Survives After 3 Cardiac Arrests
Women Survives After 3 Cardiac Arrests (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 10, 2026 at 3:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

Women Survives After 3 Cardiac Arrests: అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిన మహిళకు వరుసగా మూడుసార్లు గుండె ఆగినా, సమయానికి అందించిన అత్యవసర చికిత్స, ఐసీయూ నిపుణుల అప్రమత్తత, మల్టీ స్పెషాలిటీ వైద్యుల సమన్వయంతో ప్రాణాలు కాపాడిన అరుదైన ఘటన విశాఖపట్నం సీతమ్మధార కిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఐసీయూ చీఫ్ డాక్టర్ ఐ. రామకృష్ణ, ఫిజిషియన్ డా. బీవీఎన్ రావు వెల్లడించారు.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్టణానికి చెందిన 62 ఏళ్ల మహిళ డయాబెటిస్​తో బాధపడుతూ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నల్లటి మల విసర్జన, ఆహారం తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో జనవరి నెల 21వ తేదీన సీతమ్మధార కిమ్స్ హాస్పిటల్​లో చేరింది. ఆస్పత్రికి వచ్చేసరికి ఆమె షాక్‌లో ఉండటంతో నోరాడ్రినలిన్‌ సపోర్ట్ అవసరమైంది. పరీక్షల్లో హిమోగ్లోబిన్‌ 6.4 గ్రాములు, క్రియాటినిన్‌ 3.2గా నమోదయ్యాయి. ట్రోపోనిన్‌ 0.4గా ఉండగా, 6 గంటల తర్వాత కూడా అదే స్థాయి కొనసాగింది. ఎన్‌టి-ప్రోబీఎన్‌పీ 30 వేలకుపైగా ఉండగా, 2డీ ఎకో పరీక్షలో గుండె కండరాల కదలికలో లోపాలు, స్వల్ప ఎల్వీ డీస్‌ఫంక్షన్‌ (ఈఎఫ్‌ సుమారు 47 శాతం) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

రెండు సార్లు గుండె ఆగింది: 48 గంటలపాటు పరీక్షించి చికిత్సనందించిన తర్వాత బీపీ అదుపులోకి వచ్చింది. మూత్ర విసర్జన మెరుగుపడటం వంటి లక్షణాలు కనిపించడంతో సమస్య మూలాన్ని గుర్తించేందుకు ఎండోస్కోపీ నిర్వహించారు. అయితే పరీక్ష జరుగుతున్న సమయంలోనే ఆమెకు వెంట్రిక్యులర్‌ టాకీకార్డియా (వీటీ) రావడంతో ఆకస్మికంగా గుండె ఆగిపోయింది. సీపీఆర్‌, ఎలక్ట్రిక్‌ షాక్‌ సహాయంతో వైద్యులు ఆమెను కాపాడారు. ఐసీయూకు తరలించిన తర్వాత మరోసారి గుండె ఆగిపోవడంతో మళ్లీ అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టారు. అనంతరం రెండు రోజుల తర్వాత మూడోసారి కార్డియాక్‌ అరెస్ట్‌ సంభవించగా, మరోసారి షాక్‌ చికిత్సతో విజయవంతంగా కాపాడారు.

విల్​పవర్​: ఇంతటి ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనా ఆమె స్పృహలో ఉండటం, వైద్యుల ఆదేశాలకు స్పందించడం వైద్య బృందాన్ని ఆశ్చర్య పరిచింది. చికిత్స సమయంలో ఆమె కిడ్నీ పనితీరు దెబ్బతినడంతో డయాలసిస్‌ చేయాల్సి వచ్చింది. ఎడమ ఊపిరితిత్తి కుంచించుకుపోవడం మరో సవాలుగా మారడంతో చివరకు ట్రాకియోస్టమీ చేయాలని వైద్యులు నిర్ణయించారు.

ట్రాకియోస్టమీ అనంతరం ఆమెకు శ్వాస తీసుకోవడం సులభమలడంతో వెంటిలేటర్‌ నుంచి తొలగించారు. వెంటిలేటర్ మీద ఉన్న రోగిని సొంతగా ఎటువంటి సహాయం లేకున్నా శ్వాస తీసుకునే స్థితికి తీసుకొని రావటం, డాక్టర్లకు సవాలతో కూడుకున్న విషయం. ఈ కేసులో అది ఇంకా చిక్కుముడితో కూడుకున్న పని. ప్రతీ రోజూ వెంటిలేటర్ నుంచి తీసే ప్రయత్నం చేస్తూ, ఊపిరితిత్తులకు సంబంధించిన కండరాల వ్యాయామం క్రమం తప్పకుండా చేయించటం, ఇన్ఫెక్షన్ బారినుంచి కాపాడటం చేసిన తర్వాత పేషెంట్ సొంతంగా గాలి తీసుకోవడం ప్రారంభించడంతో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని, డీకాన్యులేషన్‌ చేశారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం మరింత మెరుగుపడి డిశ్చార్జ్‌ అయ్యారు.

ముద్దులొలికే చిన్నారికి అరుదైన వ్యాధి, నిత్యం నరకయాతన - ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

బాబు బతకాలంటే ఇంజక్షన్​కు రూ.16 కోట్లు కావాలి - సాయం చేయాలంటున్న తల్లిదండ్రులు