ETV Bharat / state

మొదట మేడ మీది నుంచి తీసి, తరువాత టాయిలెట్​ క్లీనర్ ఎక్కించి - భర్తను హత్య చేసిన భార్య

రెండేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లిన భర్త - ఆ సమయంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న భార్య - భర్త తిరిగి రావడంతో తమకు అడ్డుగా ఉన్నాడని హత్య

Husband Killed By Toilet Cleaner
Husband Killed By Toilet Cleaner (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 7, 2026 at 7:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

Husband Killed By Toilet Cleaner : ఎన్నోరోజుల తర్వాత దుబాయ్‌ నుంచి వస్తున్న భర్తను సంతోషపెట్టేందుకు ప్రతిరోజూ ఆయనకు మందు తాగేందుకు కంపెనీ ఇవ్వడం కోసం ఏకంగా ఓ యువకుడినే డబ్బులిచ్చి మరీ పెట్టుకుంది. మొగుడు అడిగినా అడగకపోయినా ప్రతిరోజూ ఆయన్ను మద్యంలో ముంచెత్తాలని దానికి ఎన్ని డబ్బులు కావాలన్నా తాను ఇస్తానంటే నిజంగా ఆ భర్తపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో అనుకున్నారు. కానీ మద్యం మత్తులో ఆ భర్త మేడపై నుంచి కిందపడినప్పుడైనా ఆ కుటుంబసభ్యులు అనుమానించలేదు. చిన్న చిన్న దెబ్బలే కదా అని స్వయంగా నర్సు అయిన భార్య చేతిలోనే ఆ భర్త ప్రాణాలు పెట్టారు. ఒకసారి చావు నుంచి తప్పించుకున్నా ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. వైద్యం చేస్తున్నట్లు నటించి ఏకంగా భర్త నరాల్లోకి సెలెయిన్‌ ద్వారా టాయిలెట్‌ క్లీనర్‌ ఎక్కించి మరీ హతమార్చింది.

ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్‌కల్‌కు చెందిన ప్రశాంత్‌కు వెల్మల్‌కు చెందిన సంధ్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇక్కడే ఉంటే వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుందని భావించిన ప్రశాంత్‌ ఉపాధి వెతుక్కుంటూ రెండేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. ఆ సమయంలో భార్య సంధ్య నిజామాబాద్‌కు చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అలాగే భర్త స్నేహితుడు మరొకరితోనూ సన్నిహితంగా ఉంటోంది. ఈక్రమంలో భర్త దుబాయ్‌ నుంచి తిరిగి వస్తున్నాడని మళ్లీ వెళ్తాడో లేదో తెలియదని సంధ్యతోపాటు ఆమె ప్రియుడు భావించారు. ఒకవేళ ఇక్కడే ఉండిపోతే తమ బండారం బయటపడుతుందని భయపడ్డారు. అందుకే అతన్ని వచ్చిన వెంటనే అంతమొందించాలని పక్కాగా పథకం వేసుకున్నారు.

టాయిలెట్‌ క్లీనర్‌ను నరాల్లోకి ఎక్కించి : భర్తను చంపేందుకు ప్రియుడితోపాటు అదే గ్రామానికి చెందిన వెంకటసాయి సహకారం తీసుకుంది సంధ్య. అంతకు ముందు నర్సుగా పనిచేసిన అనుభవం ఉండటంతో విషం కలిపిన ఇంజెక్షన్‌ భర్తకు చేసి చంపేద్దామని తొలుత అనుకున్నారు. అలా చేస్తే అందరికీ అనుమానం వస్తుందని భావించి బాగా మద్యం తాగించి డాబాపై నుంచి తోసేసి ప్రమాదవశాత్తూ చనిపోయాడని అందరినీ నమ్మించాలని అనుకున్నారు. అందులో భాగంగానే దుబాయ్‌ నుంచి భర్త ఇంటికి తిరిగి వచ్చిన రెండురోజులకే వెంకటసాయితో కలిసి డాబాపై మద్యం తాగించింది. దీనిపై ఫోన్‌కాల్‌లో చర్చించింది.

మత్తులో ఉన్న ప్రశాంత్‌ను కొట్టి కిందపడేశాడు. స్వల్ప గాయాలతో బయటపడిన భర్తను ఎవరికీ తెలియకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంట్లో టాయిలెట్‌ క్లీనర్‌ను నరాల్లోకి ఎక్కించి చంపేశారు. డాబా పైనుంచి పడటం వల్లే చనిపోయాడంటూ అందరినీ నమ్మించారు.

"వీరు 6 నెలల ముందునుంచే పథకం వేశారు. మా మావయ్య జూన్​ 27న ఇంటికి వచ్చారు. ఆరోజు నుంచి అతడికి రోజూ మద్యం తాగించేందుకు ఓ వ్యక్తిని నియమించింది. మద్యం సేవించాక డాబాపై పడుకోపెట్టేవారు. ఆరోజు కూడా మావయ్యకు మద్యం తాగించి కొట్టారు. తర్వాత ఏమీ తెలియనట్టు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి తీసుకొచ్చాక రక్తం వచ్చేలా మళ్లీ కొట్టారు. తర్వాత మత్తు మందు, టాయిలెట్​ క్లీనర్ కలిపి తనకి ఇంజెక్షన్​ చేశారు" - ప్రశాంత్‌ , బంధువు

విచారణలో బయటపడిన అసలు నిజం : డాబా పైనుంచి పడిపోయిన తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా ఆస్పత్రికి తీసుకెళ్లడం స్వల్ప గాయాలకే చనిపోవడంతో అనుమానం వచ్చిన ప్రశాంత్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో అసలు నిజం బయటపడింది. తామే ప్రశాంత్‌ను చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు.

భార్యాబిడ్డలను బాగా చూసుకోవాలని దేశంగాని దేశం వెళ్లి భర్త కష్టపడుతుంటే వివాహేతర సంబంధాల మోజులో ఏకంగా భర్తనే చంపడానికి ఆ భార్య పథకం వేసింది. నర్సుగా ఉన్న అనుభవాన్ని భర్తను బతికించుకోవడానికి ఉపయోగించకుండా అతన్ని దారుణంగా టాయిలెట్‌ క్లీనర్‌తో చంపడానికి ఉపయోగించింది.

"మొదట భర్త మద్యం తాగి డాబా పైనుంచి పడిపోయాడని నమ్మించింది. అయితే అతడు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాడు. మృతుడి భార్యకు గతంలో నర్సుగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో అతడిని ఇంజిక్షన్ ఇచ్చి చంపాలని భావించింది. తర్వాత ఉదయం అతడికి మత్తు మందు ఇచ్చింది. టాయిలెట్​ క్లీనర్​ను కూడా ఇంజెక్షన్​ ద్వారా ఎక్కించింది.​ దీంతో ఆయన మరణించారు. ఈ విషయాలు విచారణలో తెలియడంతో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాం. దీంతో కోర్టు వారిని జైలుకు పంపింది" - సురేశ్‌కుమార్, నిజామాబాద్‌ సౌత్‌ సీఐ

ప్రియుడితో భర్తను హత్య చేయించిన భార్య - వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే

పొలానికి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రాలేదు : వివాహేతర బంధానికి రైతు బలి