బాబుకు అనారోగ్యంపై ఆవేదన - ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి
రెండేళ్ల కవల పిల్లలను గొంతునులిమి చంపిన తల్లి సాయిలక్ష్మి - పిల్లలను చంపి భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య - దంపతుల మధ్య గొడవలే ఘటనకు కారణమని భావిస్తున్న పోలీసులు

Published : October 14, 2025 at 8:22 PM IST
Woman Jumps To Death After Killing Two Year Old Twins : నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి భూమ్మీదకు తీసుకొచ్చిన తన ప్రతిరూపాన్ని ఏ తల్లైనా చిదిమేస్తుందా? పిల్లలకు చిన్న గాయమైతేనే కన్నపేగు విలవిలలాడుతుంది. కానీ కొందరు తల్లులు తమ కడుపున పుట్టిన బిడ్డలనే కడతేర్చుతున్నారు. అది కూడా ముక్కుపచ్చలారని పసివాళ్లను. ఆ తర్వాత వాళ్లూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివారు బాలానగర్‌లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. రెండేళ్ల వయసున్న ఇద్దరు కవలల్ని కన్నతల్లే కడతేర్చింది. అనంతరం భవనంపై నుంచి దూకి తానూ ఆత్మహత్య చేసుకుంది.
తాజాగా నగర శివారు బాలానగర్‌లో ఓ తల్లి తన కడుపున పుట్టిన ఇద్దరు కవలపిల్లల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపగా కన్నతల్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టడానికి గల కారణాల గురించి పోలీసుల ఆరా తీస్తున్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన అనిల్‌కుమార్- సాయిలక్ష్మి దంపతులు నగరంలోని బాలానగర్ పరిధిలో ఉన్న పద్మనగర్ ఫేస్-1 కాలనీలో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కవలపిల్లలు పుట్టగా వారిలో ఒకరు బాబు, మరొకరు పాప. అనిల్ కుమార్ సాప్ట్‌వేర్ ఉద్యోగి కాగా సాయిలక్ష్మి ఇంటి దగ్గరే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుంది. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు.
ఇటీవలే పిల్లల రెండో ఏడాది పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అయితే కవల పిల్లల్లో బాబుకు సరిగ్గా మాటలు రాకపోవడంతో స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోవడంతో బాబుకు మెరుగైన వైద్యం చేయించాలంటూ సాయిలక్ష్మి భర్తకు చెబుతూ ఉండేది. ఈ విషయంలో అప్పుడప్పుడూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని సమాచారం. అలాగే పాపకు కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడంతో ఆమెకూ చికిత్స చేయించేవారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పిల్లల్ని కన్నావంటూ అనిల్‌కుమార్ భార్య సాయిలక్ష్మితో అప్పుడప్పుడూ గొడవ పడేవాడని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో సాయిలక్ష్మి మానసికంగా కలత చెంది, ఒత్తిడికి గురైనట్లు సమాచారం.
ఈనెల 13న రాత్రి అనిల్‌కుమార్ నగరంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి మరుసటి రోజు వైజాగ్‌లో జరిగే వివాహ వేడుకకు హాజరవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు. అదే రోజు రాత్రి కూడా భార్యాభర్తలిద్దరి మధ్య ఏదో సంభాషణ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన సాయిలక్ష్మి 14న తెల్లవారుజామున తన కడుపున పుట్టిన ఇద్దరు కవలపిల్లల గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఆమె నివాసం ఉండే భవనం పైకి ఎక్కి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సాయిలక్ష్మి మృతదేహంతో పాటు ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్న ఇద్దరు పిల్లల మృతదేహాలని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న అనిల్‌కుమార్ ఇంటి వద్దకు చేరుకున్నాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయిలక్ష్మి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాయిలక్ష్మి ఈ ఘాతుకానికి ఒడిగట్టడం వెనుకున్న కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు ముందురోజు రాత్రి ఏం జరిగిందో అన్వేషిస్తున్నారు. సాయిలక్ష్మి, అనిల్‌కుమార్‌లకు సంబంధించిన కాల్ డేటాను పరిశీస్తున్నారు. ఆర్థికంగా కూడా వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి అప్పటికప్పడు ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకుందా? లేక ముందు నుంచి ఉన్న ఆలోచనతోనే ఇలా చేసిందా? అనేది గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనలో నూరేళ్ల జీవితాన్ని చూడాల్సిన ముక్కుపక్కుపచ్చలారని ఇద్దరు కవలలు రెండేళ్లకే తనువు చాలించారు. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
డబ్బు కోసం పరిచయస్థుడి మర్డర్ - యూట్యూబ్‌లో చూసి తల, మొండం వేరు చేసి ఘాతుకం
భయంతో సోదరుడినే చంపేశారు - నిలదీసేందుకు వెళ్లి ప్రాణాలు తీసేశారు

