'పవనన్నా నన్ను కాపాడు-చంపేస్తారని భయమేస్తోంది' - కువైట్ నుంచి మహిళ వీడియో
మస్కట్‌లో పని కోసం వెళ్తే అక్కడి సేఠ్ తనను నిత్యం వేధిస్తూ కొడుతున్నాడన్న మహిళ - తన బాధలను పవన్ కల్యాణ్‌కు చెప్పుకొంటూ వీడియో విడుదల చేసిన అన్నమయ్య జిల్లాకు చెందిన మహిళ

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2026 at 11:33 AM IST
Woman Request To Deputy CM Pawan Kalyan : తన కుటుంబం, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఎన్నో కళలు కనింది ఆ మహిళ. వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆశపడి అందరిని వదిలి విదేశాలకు వెళ్లింది. అక్కడికి వెళితే కడుపు నిండా తిండి లేదు, కంటినిండా కునుకు లేదు. నా అనే వారు లేకపోవడంతో నిత్యం నరకం చూపించారు ఆమె యజమాని. ఇలా నిత్యం నరకయాతనతో కన్న బిడ్డలను, పుట్టిన ఊరిని గుర్తుకు తెచ్చుకొని కుమిలిపోయిందా మహిళ. చివరి ప్రయత్నంగా దేవుడిపై భారం వేసి తన బాధను సెల్ఫీ వీడియో తీసి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తెలిపింది.
మస్కట్‌లో పని కోసం వెళ్తే, అక్కడి సేఠ్ తనను నిత్యం వేధిస్తూ కొడుతున్నాడని, చంపేస్తారని భయమేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నే తనను కాపాడాలంటూ ఆ మహిళ రోదించారు. తన బాధలను చెప్పుకుంటూ ఆమె ఒక వీడియో చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఇంతకి ఆ మహిళ ఎవరు? అక్కడా ఎలాంటి బాధలను అనుభవించిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
గదిలో బంధించి అన్నం, నీళ్లు ఇవ్వకుండా : ఉపాధి కోసం విదేశాలకు వెళితే చివరకు కష్టాలే మిగిలాయి ఆ మహిళకు. నాలుగు డబ్బులు వెనకేసుకుని తన పిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆ తల్లి పడిన ఆశలు అడియాశలుగా మారాయి. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానల్‌కు ముగ్గురు పిల్లలు. బతుకుదెరువు కోసం, బిడ్డలను చదివించాలన్న తపనతో ఒక ఏజెంట్ ద్వారా కొద్దిరోజుల క్రితం అప్పులు చేసి ఆమె మస్కట్‌కు వెళ్లారు.
అక్కడ సేఠ్ తనను ఒక గదిలో బంధించి నిత్యం అన్నం, నీళ్లు ఇవ్వకుండా వేధిస్తూ కొడుతున్నాడని రోదిస్తూ శనివారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టారు. తనకు మాట్లాడే సమయం కూడా లేదని, ఫిట్స్ వచ్చి చనిపోయేలా ఉన్నానని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్న తనను కాపాడాలని కోరారు. తాను చనిపోతే ముగ్గురు పిల్లలను పోషించే దిక్కు కూడా లేదని రోదించారు. బాత్రూంలో ఈ వీడియో చేశానని, సేఠ్‌కు తెలిస్తే తనను చంపేస్తాడని వాపోయారు. తనను కాపాడి, తన ముగ్గురు బిడ్డలకు రక్షణ కల్పించాలని కంటతడి పెట్టారు.
ఏజెంట్లు, యజమానుల చేతుల్లో వేధింపులు : ఇలా బతుకుదెరువు కోసం వివిధ దేశాలకు వెళ్లిన రాష్ట్ర ప్రజలను ఏజెంట్లు, అక్కడి యజమానులు వేధించిన ఘటనలు చాలానే వెలుగుచూశాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ యంత్రాంగం, టీడీపీ-ఎన్నారై విభాగం నేతల సమన్వయంతో పదుల సంఖ్యలో స్వస్థలాలకు చేర్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది.
అలాంటి వారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు మంత్రి లోకేశ్. ఇబ్బందుల్లో ఉన్నామంటూ బాధితులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెడితే చాలు మెరుపువేగంతో స్పందిస్తూ గొడ్డు చాకిరీ నుంచి వారికి విముక్తి కల్పిస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా తెలుగుదేశానికి అనుబంధంగా పనిచేసే ఎన్నారై టీడీపీ బృందాలనూ రంగంలోకి దింపి బాధితులను ఎడారి కష్టాల నుంచి గట్టెక్కిస్తున్నారు.
తాజాగా బతుకుదెరువు కోసం మస్కట్‌కు వెళ్లిన మహిళ అక్కడి సేఠ్ తనను నిత్యం వేధిస్తూ కొడుతున్నాడని, చంపేస్తారని భయమేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నే తనను కాపాడాలంటూ తన బాధలను చెప్పుకొంటూ ఒక వీడియో చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టడం విశేషం.
'భోజనం పెట్టకుండా వేధిస్తున్నారు' - మస్కట్‌లో శ్రీకాకుళం వాసుల ఇక్కట్లు
దుబాయ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోనసీమ మహిళ - స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి

