చెల్లెలు మృతి - రెండు రోజులుగా ఇంట్లో మృతదేహంతోనే అక్క
ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మరణించిన హేమలత - ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు - హేమలతతో పాటే కలిసి ఉన్న మూగ మహిళ ఝాన్సీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 5:14 PM IST
Woman Died in Vizianagaram : ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వివాహం చేసుకోలేదు. ఒకరి కోసం ఒకరూ బతుకుతున్నారు. కానీ ఏమైందో తెలియదు. చెల్లెలు అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. చనిపోయిన రెండు రోజుల తర్వాత గానీ బయటకు రాలేదు. అదీ స్థానికులు దుర్వాసన వస్తుందని పోలీసులకు సమాచారమిస్తేనే విషయం బయటపడింది. ఇంతకు ఆమె చనిపోవడానికి కారణం ఏంటి?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా తెర్లాం మండలం పెరుమాలి ఎస్సీ వీధిలోని ఓ ఇంట్లో ఓ మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. బాణాల హేమలత (52), తన మూగ అక్క ఝాన్సీతో కలిసి ఎస్సీ వీధిలోని నివాసం ఉంటోంది. ఇరువురికీ వివాహం కాలేదు. అక్క ఝాన్సీకి మాటలు రావు, చెవులు కూడా వినిపించవు. చెల్లి హేమలతే ఆమెకు అన్నీ తానై చూసుకునేది. ఈ క్రమంలో చెల్లి హేమలత ఇంట్లోనో హఠాత్తుగా మృతి చెందింది.
కళ్లముందే చెల్లి ప్రాణాలు విడిచినా చెవుడు, మూగ కారణంగా అక్క ఝాన్సీ ఆ విషయాన్ని చుట్టు పక్కల వాళ్లకి ఎవరికీ చెప్పలేకపోయింది. చెల్లి మృతదేహం పక్కనే ఉండిపోయింది. ఇద్దరికీ ఇద్దరికీ మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.
ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తీసి చూడగా హేమలత చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఆమె చనిపోయి రెండు రోజులై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
"ఎస్సీ కాలనీలో ఝాన్సీ, హేమలత ఇద్దరూ అక్కాచెల్లెళ్లు నివాసం ఉంటున్నారు. వీరికి వివాహం కాలేదు. ఇద్దరీ మానసిక స్థితి సరిగా లేదు. అక్కకు చెవుడు, మూగ కారణంగా సోదరి చనిపోయిందన్న విషయం ఎవరికీ చెప్పలేదు. గత రెండు రోజులుగా చెల్లెలు శవం పక్కనే ఉంది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చారు.హేమలత అనారోగ్యంతో మృతి చెందిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నాం" - సాగర్ బాబు, ఎస్సై
సైబర్ నేరాలపై పోలీసుల యుద్ధం - ప్రచార రథాలతో ప్రజల్లో అవగాహన
భార్య కనిపించడం లేదని పోలీస్‌స్టేషన్‌కు భర్త - విచారణలో బయటపడ్డ భయంకరమైన నిజం

