ఒంగోలులో లిఫ్ట్‌లో ఇరుక్కొని మహిళ మృతి - సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
ఒంగోల సూర్యా టవర్స్ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదం - లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన మహిళ - లిఫ్ట్ నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలింపు - చికిత్స పొందుతూ మృతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 19, 2026 at 7:41 PM IST
Lift Accident in Ongole : ప్రస్తుత కాలంలో లిఫ్ట్‌ల వాడకం సర్వసాధారణంగా మారింది. రోజూ కనీసం ఒక్కసారైనా ఎక్కువ మంది దీనిని వినియోగిస్తున్నారు. ఈ సౌకర్యం బాగానే ఉంది. కానీ మరి భద్రత మాటేంటి? పొరపాటున మధ్యలో ఆగినా, ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా, ఎక్కిన వాళ్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. బతుకు జీవుడా అంటూ గాయాలతో బయటపడ్డ వాళ్లు కొందరైతే మరణించిన వారు మరికొందరు. ఏమరపాటో, అవగాహన లేకపోవడమో కానీ లిఫ్ట్‌లే యమ పాశాలవుతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఎంతో మంది ఈ ప్రమాదాల బారిన పడుతుండడం కలవర పెడుతోంది.
ఇటీవల విశాఖ ఊర్వశి జంక్షన్ వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. లిఫ్ట్ ఫ్లోర్‌కు రాకుండానే డోర్ తెరుచుకోవడం వల్ల ముందుకు అడుగు వేసిన వృద్ధురాలు కింద పడిపోయారు. వెంటనే లిఫ్ట్ కూడా కిందకు దిగడం వల్ల దాని కింద నలిగి ఆమె ప్రాణాలు కోల్పోయారు.
Elevator Accidents in AP : ఈ మధ్యే హైదరాబాద్ చందానగర్‌లోని లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్, అనసూయ(43) దంపతులు బతుకుదెెరువు కోసం నగరానికి వచ్చి నల్లగండ్లలో ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. శ్రీనివాస్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండగా, అనసూయ గృహిణి. చందానగర్ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని బంధువులను పరామర్శించడానికి భార్యాభర్తలు వెళ్లారు. రెండో అంతస్తుకు చేరుకోవడానికి లిఫ్ట్ బటన్ నొక్కడంతో తలుపులు తెరుచుకున్నాయి. శ్రీనివాస్ లిఫ్ట్‌లోకి ఎక్కారు. అనసూయ ఒక కాలు లిఫ్ట్‌లో పెట్టి, రెండో కాలు పెట్టే లోపే తలుపులు మూసుకొని పైకి వెళ్లింది. ఆమె ప్రవేశద్వారంలో ఇరుక్కుపోయారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందింది.
తాజాగా ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒంగోలులోని సూర్యా టవర్స్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం నాడు (ఆగస్టు 16న) కుమార్తె, మనవడితో కలిసి బయట నుంచి వచ్చిన వినీత అపార్ట్మెంట్ లిఫ్ట్ ఎక్కారు. ముందుగా లిఫ్ట్ నుంచి మనవడితో పాటు కుమార్తె బయటకు వెళ్లారు. ఆ తర్వాత వినీత లిఫ్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో అది ఒక్కసారిగా కిందకు పోయింది.
ఈ క్రమంలో వినీత డోరు వద్ద ఇరుక్కుపోయింది. వెంటనే అపార్ట్‌మెంట్‌లోని వారు అక్కడికి చేరుకుని ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వినీత మృతి చెందారు. లిఫ్ట్ కేబుల్స్, నిర్వహణలో లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
లిఫ్ట్ ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు :
- లిఫ్ట్ తలుపులు మూసుకునేటప్పుడు అడ్డుగా చేతులు, కాళ్లు పెట్టడం వల్ల ఒక్కోసారి సెన్సార్లు పనిచేయక ప్రమాదాలు జరుగుతున్నాయి.
- గ్రిల్స్ ఉన్న లిఫ్టుల వినియోగంలో తలుపులు సగం తీసి వదిలేయడం, పిల్లలు లోపలికి వెళ్లి వాటిల్లో ఇరుక్కోవడం వంటివి తరచూ జరుగుతున్నాయి.
- లిఫ్టు సామర్థ్యం ఆధారంగా వాటి నిర్వహణ ఉంటుంది. పరిమితికి మించి ఎక్కితే మధ్యలో ఆగిపోవడం, కుప్పకూలడం జరుగుతాయి.
- లిఫ్టుల్లో ఇరుక్కుపోతే భయపడకుండా అత్యవసర బటన్లు మీటితే తలుపులు తెరుచుకుంటాయి. అలారం నొక్కొచ్చు. సూచించిన అత్యవసర నంబర్‌కు ఫోన్ చేయొచ్చు.
సాంకేతిక లోపంతో లిఫ్ట్ ప్రమాదం - విశాఖలో ప్రాణాలు కోల్పోయిన 75 ఏళ్ల వృద్ధురాలు

