ETV Bharat / state

మన్యం జిల్లాలో హృదయవిదారక ఘటన - చెత్త తీసుకెళ్లే రిక్షాలో మృతదేహం తరలింపు

ఆస్పత్రిలో అందుబాటులో లేని అంబులెన్స్​ - ప్రైవేట్​ వాహనానికి రూ.2500 - నగదు లేక డెడ్​బాడీని రిక్షాపై తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు

Woman Dead Body on Garbage Rikshaw
Woman Dead Body on Garbage Rikshaw (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 27, 2025 at 12:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

Woman Dead Body on Garbage Rikshaw in Manyam District: నిరుపేద వృద్ధ మహిళ అనారోగ్యంతో చనిపోతే ఇంటికి తరలించడానికి ఆంబులెన్సు సదుపాయం కూడా లేదు. ఒకవేళ కిరాయికి వాహనాన్ని మాట్లాడుకుని వెళదామంటే వారి దగ్గర డబ్బుల్లేవు. ఓ పక్క బాధ, మరోపక్క దరిద్రం. చివరకు వేరే గత్యంతరం లేక పక్కన ఉన్న చెత్తను తరలించే రిక్షాలో మహిళ మృతదేహాన్ని తరలించిన హృదయవిదారక ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.

నగదు లేక రిక్షా బండిలోనే తరలింపు: స్థానికుల వివరాల ప్రకారం గుమ్మలక్ష్మీపురానికి చెందిన రాధమ్మ (65) తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు భద్రగిరి సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారు. వృద్ధ మహిళ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆసుపత్రిలోని అంబులెన్సు సదుపాయం లేకపోవడంతో ప్రైవేటు వాహనాన్ని సంప్రదించారు. కానీ డ్రైవర్ రూ.2,500 అవుతుందని చెప్పారు.

దాంతో అంత మొత్తంలో ఇచ్చే స్తోమత సంబంధిత కుటుంబ సభ్యులకు లేక, మరోదారి లేక చివరికి చెత్త సేకరించే రిక్షా బండిలోనే తరలించారు. రాధమ్మ భర్త, కుమార్తె కొన్నాళ్ల కిందట దురదృష్టవశాత్తు మృతి చెందడంతో మహిళ ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న ఐటీడీఏ అంబులెన్స్‌లో మృతదేహాలు తరలించడానికి అవకాశం లేదనీ, మహాప్రస్థానం వాహనం సైతం ఆసుపత్రిలో లేదనీ, అది మంజూరు చేస్తే సమస్య ఉండదని భద్రగిరి సీహెచ్‌సీ వైద్యులు అనిల్, త్రివేణి ఈ సందర్భంగా తెలిపారు.

గతంలో సైతం ఎన్నో ఘటనలు: తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద దారుణ ఘటన జరిగింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేయటంతో చేసేది లేక మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లిన సంఘటన జరిగింది. రేణిగుంటకు చెందిన 35 ఏళ్ల మహిళ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

అనంతరం ఆమె మృతదేహాన్ని రేణిగుంటకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్​ను సాయం కోరగా అతను రూ.2500 డిమాండ్ చేశాడు. తమ వద్ద 2,000 వేలు మాత్రమే ఉన్నాయని మృతురాలి బంధువులు చెప్పినా వినకపోవటంతో గతిలేని పరిస్థితుల్లో ఆటోలోనే మృతదేహాన్ని రేణిగుంటకు తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.

తండ్రి అంతిమయాత్రలో జోలె పట్టిన కుమార్తె: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్‌కు చెందిన ఒంటెద్దు దుర్గయ్య కూలీ. పాములు పట్టడం వ్యాపకం. ఆయనకు కుమార్తె రాజేశ్వరి, కుమారుడు కాశీరాం ఉన్నారు. భార్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. కుమార్తె పదో తరగతి పూర్తిచేసింది. అప్పట్నుంచి ఆమెను బంధువుల ఇంట్లో ఉంచిన దుర్గయ్య పదిహేనేళ్ల కుమారుడితో కలిసి ఊరి చివరన గుడిసెలో నివసిస్తున్నాడు.

ఊరిలో ఎవరింట్లోకి పాము వచ్చినా సరే దుర్గయ్యకు ప్రజలు సమాచారాన్ని అందించేవారు. దాంతో ఆయన పట్టుకుని అటవీ ప్రాంతంలో వదలడం ఒక ఆనవాయితీగా ఉండేది. ఓ కాలనీలో పాము సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి పట్టుకున్నాడు. సంచిలో వేస్తుండగా పాము చేతిపై కాటు వేయడంతో మరణించాడు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు.

చివరకు దహన సంస్కారాలకు డబ్బుల్లేని పరిస్థితులలో బంధువులు వైకుంఠ రథాన్ని మాత్రం సమకూర్చారు. ఇతర ఖర్చులకు సొమ్ముల్లేకపోవడంతో రాజేశ్వరి అంతిమయాత్రలోనే జోలె పట్టి యాచించడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. కుటుంబానికి అండగా ఉన్న నాన్న కూడా మరణంతో తాము అనాథలమయ్యామని అక్కాతమ్ముళ్లు తీవ్ర కన్నీటిపర్యంతమయ్యారు.

డబ్బుల్లేక.. తండ్రి అంతిమయాత్రలో జోలె పట్టిన కుమార్తె

అంబులెన్స్ డ్రైవర్ నిరాకరణ... ఆటోలో మృతదేహం తరలింపు