ETV Bharat / state

ప్రియుడి మోజులో పడి - కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో దారుణం - వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కిరాతకం - కిరాయి హంతకులతో ఊపిరాడకుండా చేసి హత్య - భార్య, ఆమె ప్రియుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Anakapalli Murder Case
Anakapalli Murder Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 4, 2026 at 8:50 PM IST

3 Min Read
Choose ETV Bharat

Anakapalli Murder Case : ప్రియుడి మోజులో పడి ఓ భార్య కిరాతకంగా వ్యవహరించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది. లక్ష రూపాయలు సుపారీ ఇచ్చి మరీ కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరామపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ కేసును ఛేదించిన పోలీసులు, భార్య, ఆమె ప్రియుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

అసలేం జరిగిందంటే : శ్రీరామపురం గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి అప్పలనాయుడుకు హైమాతో 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పలనాయుడు విశాఖపట్నంలో కళాసీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే, దేవరాపల్లిలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న కె.కోటపాడు మండలం జోగన్నపాలెం గ్రామానికి చెందిన బండారు గంగాధరతో హైమాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా కలుసుకుంటున్నారు.

ప్రియుడి మోజులో పడి కట్టుకున్నోడికే ఉరి - లక్ష రూపాయల సుపారీతో భర్త దారుణ హత్య (ETV Bharat)

భర్తకు అనుమానం రావడంతో : కొద్దిరోజులుగా భార్య ప్రవర్తనలో మార్పులు రావడంతో అప్పలనాయుడుకు అనుమానం మొదలైంది. ఆమెను గమనించేందుకు విశాఖలో తాను చేస్తున్న కళాసీ పనిని రూ.రెండు లక్షలకు విక్రయించేశాడు. తిరిగి స్వగ్రామానికి వచ్చేశాడు. ఇంటి వద్దే ఉంటూ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. భర్త ఎప్పుడూ ఇంటి వద్దే ఉంటుండటంతో హైమా అక్రమ సంబంధానికి అడ్డుకట్ట పడింది.

ప్రియుడితో కలిసి స్కెచ్ : వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హైమా కక్ష పెంచుకుంది. ఎలాగైనా అతడిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడు గంగాధర్‌తో కలిసి హత్యకు పథకం పన్నింది. ఈ క్రమంలో గంగాధర్ తన మేనల్లుడు నాగభూషణకు ఈ విషయం చెప్పాడు. అప్పలనాయుడును చంపేందుకు రూ.లక్ష ఖర్చు అవుతుందని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం విశాఖపట్నం నుంచి మరో ఇద్దరిని కిరాయికి మాట్లాడుకున్నారు.

ఊపిరాడకుండా చేసి దారుణంగా : పథకం ప్రకారం ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దారుణానికి ఒడిగట్టారు. అప్పలనాయుడు ఇంట్లో మంచంపై గాఢ నిద్రలో ఉన్నాడు. అదే సమయంలో కిరాయి హంతకులతో కలిసి అతడి పీక నులిమారు. ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఉదయం లేచి చూసేసరికి అప్పలనాయుడు మంచంపై శవమై కనిపించాడు. ఇది గమనించిన మృతుడి సోదరుడు, ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసును ఛేదించిన పోలీసులు : సోదరుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యే ప్రియుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు నిర్ధారించారు. దీంతో భార్య హైమా, ప్రియుడు గంగాధర్, అతడి మేనల్లుడు నాగభూషణలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో సీఐ కృష్ణ, ఎస్సై సత్యనారాయణ ఈ వివరాలను వెల్లడించారు.

"అప్పలనాయుడు మృతిపై ఆయన సోదరుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టాం. విచారణలో భార్య హైమానే ఈ హత్య చేయించినట్లు తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడు గంగాధర్‌తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. లక్ష రూపాయల సుపారీకి ఒప్పందం కుదుర్చుకుని, విశాఖ నుంచి వ్యక్తులను రప్పించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం." -కృష్ణ, సీఐ

ప్రకాశం జిల్లాలో విషాదం - ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లాలో విషాదం - రైలు పట్టాలపై తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు