పొలానికి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి రాలేదు : వివాహేతర బంధానికి రైతు బలి
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య - పొలానికి వెళ్లిన భర్తను రాడ్డుతో కొట్టి హత్య చేసిన భార్య ప్రియుడు - రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం - పోలీసుల విచారణలో బయటపడ్డ నిజం

Published : June 13, 2026 at 2:54 PM IST
Wife Kills Husband For Insurance : అతడో సాదాసీదా రైతు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు ఉదయాన్నే పొలానికి బయలుదేరాడు. కానీ మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. 'నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు' అంటూ ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. తీరా సీన్ కట్ చేస్తే అక్కడ వెలుగు చూసిన నిజాలు చూసి పోలీసులే విస్తుపోయారు. ఎందుకంటే అది ప్రమాదం కాదు. అత్యంత పక్కా స్కెచ్‌తో చేసిన హత్య. అసలు ఆ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది ఎవరు? అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంతకీ ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారు? పోలీసుల విచారణలో బయటికొచ్చిన నిజాలేంటి?
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య : వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి. ప్రియుడి కోసం భర్తను, ప్రియురాలి కోసం భార్యను చంపుతున్న ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నా మిగతా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది. బీమా సొమ్ము కోసం హత్యను కాస్తా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య గత నెల 21న మరణించాడు. పొలానికి వెళ్తుండగా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయాడని అతని భార్య రేణుక గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. కానీ సాంకేతిక ఆధారాలు, సీసీ పుటేజీలో మరో వ్యక్తితో రేణుక సన్నిహితంగా ఉంటున్నట్లు, పదే పదే ఫోన్లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరి సంబంధంపై ఆరా తీశారు. మృతుడి భార్య రేణుక, ఆమె ప్రియుడు గంగా శేఖర్‌లను నిందితులుగా తేల్చారు.
భర్త రాజయ్య వ్యవసాయ క్షేత్రం నుంచి వస్తుండగా కిందపడి చనిపోయినట్టు అతడి భార్య రేణుక ఫిర్యాదు చేశారు. కానీ గంగా శేఖర్, రేణుకకు గత నాలుగు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. రాజయ్య తలపై ఐరన్ రాడ్డుతో గట్టిగా కొట్టి చంపేశారు. తమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని తొలగించాలనేది వారి ఉద్దేశం. సీసీ కెమెరాల ఆధారంగా విచారించగా నిందితులు నేరాన్ని అంగీకరించారు. నిందితుడు వాడిన సెల్‌ఫోన్, రాడ్‌ను, బైక్‌ను సీజ్ చేసి జ్యుడీషియల్ కస్టడిలోకి తరలించాం. - శ్రీనివాసరావు, డీఎస్పీ ఎల్లారెడ్డి
పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా : రాజయ్య సమీప బంధువైన గంగాశేఖర్‌తో రేణుకకు నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరి మధ్య సంబంధంపై రాజయ్యకు తెలిసి చాలాసార్లు నిలదీశాడు. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలు మొదలై తారాస్థాయికి చేరాయి. తమ సంబంధానికి అడ్డొస్తున్న భర్త రాజయ్యను ఎలాగైనా అడ్డు తప్పించాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది.
ఐరన్ రాడ్డుతో తలపై గట్టిగా కొట్టి చంపి : మే 21న రేణుక ప్రియుడు గంగాశేఖర్ రాజయ్యను మాట్లాడుకుందాం అంటూ గాంధారి తీసుకెళ్లి మద్యం తాగించాడు. మత్తులో ఉన్న రాజయ్యను తిర్మన్‌పల్లి శివారులోకి తీసుకొచ్చి ఐరన్ రాడ్డుతో తలపై గట్టిగా కొట్టి చంపాడు. రాజయ్యపై రూ.కోటికి పైగా ఉన్న బీమా సొమ్మును కాజేయాలని చూశాడు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కంగుతిన్నారు. తమ కుమారుడిని హత్య చేసిన ఆ ఇద్దరిని జైలు నుంచి బయటికి రాకుండా చూడాలని మృతుడి తండ్రి కోరాడు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. పోలీసులు అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఆర్మీ ఉద్యోగి దారుణ హత్య - కట్టుకున్న భార్య చేతిలోనే హతం
హతమార్చేందుకు 8 నెలల క్రితమే ప్లాన్ - మాల్కాజిగిరిలో తుపాకీతో కాల్చి భార్య హత్య

