'పదవి ఆమెది - అధికారం మొత్తం ఆయనది' : 'సర్పంచ్'కు విలువేది?
రిజర్వేషన్ కారణంగా భార్యను పదవిలో ఉంచి - నిర్ణయాలు మాత్రం భర్త తీసుకుంటూ - ఎవరికి ఓటు వేశారో తెలియని స్థితిలో గ్రామ ప్రజలు - తీరు మారాలని అభ్యర్థన

Published : January 8, 2026 at 10:43 AM IST
Husband is Ruling Sarpanch Post : ఓటేసి ఎన్నుకున్నది ఒకరినైతే, అధికారం చలాయిస్తుంది మరొకరు. అసలు తాము ఓటు వేసింది ఎవరికి అనే అనుమానం కలుగుతుంది ప్రజలకు. గ్రామ సభలో అధికారుల పక్కన కుర్చీలో దర్జాగా ఆసీనులైన మహిళా సర్పంచి భర్తలనుద్దేశించి జనంలోంచి వచ్చే సందేహాలు ఇవి. ఇలాంటి సందర్భాలు ఎన్నోసార్లు గ్రామ ప్రథమ పౌరురాలికి ఎదురవుతున్నాయి. ఆధిపత్య ధోరణితో భర్తో, తండ్రో, కుమారుడో, మరో కుటుంబ సభ్యుడో పెత్తనం సాగిస్తున్న తీరు మారడం లేదు.
545 మందిలో 256 మంది ఆడవారే : నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 545 మంది సర్పంచులుగా ఎన్నికయ్యారు. వీరిలో 256 మంది మహిళలే. విద్యావంతులైన వారు, వ్యవసాయం చేసేవారు, గృహిణులు ఎక్కువ మంది గ్రామ పాలనా పగ్గాలు చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా చాలాచోట్ల 'పదవి ఆమెది, అధికారం ఆయనది' అనే పరిస్థితులు నెలకొన్నాయి. భర్త, కుమారుడు, కుటుంబసభ్యులు, బంధువు ఎవరో ఒకరు కుర్చీలో కూర్చుంటున్నారు.
ప్రజల ప్రతినిధి ఆమె : వనితలకు పదవులు, రాజకీయాలు కొత్తే కావొచ్చు. ఇప్పటివరకు ఇంటి పనులకో, వ్యవసాయానికో పరిమితమై ఉండొచ్చు. పాలనానుభవం పెద్దగా లేకపోవచ్చు. అయితేనేం! ప్రజా సమస్యలపై వారికీ అనుభవం ఉండే ఉంటుంది. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధి ఆమె. అయినా సొంతింటి వారే బయటకు రాకుండా చిన్నబుచ్చుతుంటే ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. 'సర్పంచ్ సాబ్' అని నలుగురు పిలుస్తుంటే పులకరిస్తున్నారే తప్ప, మన ఇంటి ఆడపడుచును 'పతిచాటు సతి' అని పదుగురిలో పలుచన చేస్తున్నామని గ్రహించట్లేదు.
ఇటువంటి ధోరణే ఇక్కడ :
- డిచ్‌పల్లి మండలంలోని ఓ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మహిళా సర్పంచి పక్కనే భర్త కూడా ఆసీనుడయ్యాడు. ఈ దృశ్యం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది.
- బోధన్ నియోజకవర్గంలో ఇటీవల మరో గ్రామంలో మహిళా సర్పంచికి బదులు ఆమె భర్తనే అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చాడు. సందర్శనకు వచ్చిన అధికారినే దబాయించడం నివ్వెరబోయేలా చేసింది.
- పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించిన వేళ, మహిళా సర్పంచుల పక్కనే వారి పతులకూ కుర్చీలు వేసి సన్మానాలు చేశారు. అంటే అటు కుటుంబీకులు, ఇటు జనం సైతం 'అతడిదే పెత్తనం' అని అంగీకరించినట్లేనా?
- సభల్లో, అధికారిక కార్యక్రమాల్లోనూ భర్త పేరు జోడించి ప్రస్తావిస్తున్నారు. 'అర్ధనారీశ్వరుడు' అంటే ఇదేనేమో అని సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా విమర్శించడం పరిపాటి అయ్యింది.
గౌరవం దక్కనివ్వండి : సర్పంచి కుర్చీలో ఆమెకు బదులు కుటుంబ సభ్యులు కూర్చోవద్దన్న నిబంధనను అమలు చేయాలి. తన ఇంటినే కాకుండా తమ గ్రామాన్ని కూడా బాగు చేసే నాయకత్వ లక్షణాలు ఒక మహిళకు ఉంటాయి. అందుకే ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలి. కానీ కొందరు అలా చేయడం లేదు.
- రెండు కుర్చీల సంప్రదాయానికి స్వస్తి పలకాలి. పత్రాల్లో, ప్రసంగాల్లో పేరు పక్కన జోడించొద్దని నిర్వాహకులకు సున్నితంగా చెప్పాలి.
- పాలనలో, నిర్ణయాల్లో అవసరమైనప్పుడు సలహాలు, సూచనలకే పాత్ర పరిమితం కావాలి. గడపదాటి బయటకొస్తే జోక్యం తగదు.
- సమావేశాల్లో ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలో చెప్పొచ్చు. సభల్లో ప్రజల్లో ఒకరిగా కూర్చొని గమనించాలి. ఏదైనా సలహా ఇవ్వాలంటే చీటీ రాసి పంపొచ్చు.
- ప్రభుత్వ శాఖలు, పథకాల గురించి చెప్పాలి. అధికారిక కార్యక్రమాల్లో ఎలా మెలగాలో తెలియజెప్పాలి. అప్పుడే సంతకానికే పరిమితం కాని సర్పంచిగా గ్రామ చరిత్రలో పేరు నిలుస్తుంది.
ఇక రిజర్వేషన్ ఎందుకు? : మహిళలకు ఉన్న ప్రత్యేక రిజర్వేషన్ల కారణంగా అధికారం కోసం, ఇంట్లో ఉన్న తమ ఆడవారితో ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు మగవారు. ఆ విధంగా పదవిలో నామమాత్రంగా మహిళలు ఉంటున్నారు. పెత్తనం మాత్రం మగవారు చేస్తున్నారు. వాళ్లు కూడా భర్తకు ఎదురు చెప్పలేని స్థితిలో బాధ్యతలను మగవారికే అప్పగిస్తున్నారు. ఇలా భర్తలే నిర్ణయాలు తీసుకోవడం, సమావేశాలకు హాజరవ్వడం వంటి సంఘటనలు పలుచోట్ల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ఉద్దేశం పక్కదారి పడుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచ్ టు వర్కర్స్- ఆ ఊరిలో అన్నింటిలో మహిళలే నాయకత్వం!- మహిళా సాధికారతకు ఈ గ్రామం ఉదాహరణ

