ఫోన్ పోయిందా? పాతదే కదా అని కంప్లైంట్ ఇవ్వలేదా? - సైబర్ క్రైమ్‌లో చిక్కుకున్నట్లే!
సెల్‌ఫోన్ పోతే నిర్లక్ష్యం వద్దంటున్న అధికారులు - మనకు తెలియకుండానే సైబర్ మోసంలో మనమూ ఇరుక్కునే ప్రమాదం ఉందంటూ హెచ్చరిక - ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటూ సూచన

Published : March 1, 2026 at 2:41 PM IST
Theft Smart Phone Recovery Telugu : నేటి ఆధునిక కాలంలో చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఏ పనీ పూర్తి కావడం లేదు. మనం లేచినప్పటి అలారం మొదలుకొని పడుకునే ముందు జోలపాట వరకు అంతా ఫోన్ల పైనే అధారపడి పని చేస్తున్నాం. అలాంటి మొబైల్ ఫోన్ ఒక్కసారిగా దొంగలపాలైతే ప్రాణం పోయినంత పనవుతుంది. చేతిలో సెల్‌ఫోన్ పోయినా, ఎవరైనా దొంగిలించినా పోనీలే అని నిర్లక్ష్యం వహించవద్దు. వీలైనంత త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దీనికోసం సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయడం ఎంతో ముఖ్యం.
ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారుగా 1500 పాత మొబైల్ ఫోన్లను, మదర్ బోర్డులను, బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. పాత స్మార్ట్ ఫోన్లను సేకరించి వాటిని బాగుచేసి, అందులోని డాటా ఆధారంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణంలోని పలు కాలనీల్లో తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీనితో పాటు చోరీ చేసిన మొబైల్ ఫోన్లు, ఎక్కడైనా దొరికినవి కూడా దీనిలో వినియోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవి పాటించకుంటే సైబర్ మోసంలో ఇరుక్కునే ప్రమాదం : ఈ విధమైన చర్యల కారణంగా మనకు తెలియకుండానే సైబర్ మోసంలో మనమూ ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉంది. లేనిపోని చిక్కులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పాతవనో, పాడైపోయాయనో మొబైల్ ఫోన్లను విక్రయించరాదు. దానిలోని డాటా మొత్తాన్ని తొలగించిన తర్వాతే ఫోన్‌ను అమ్మాలి.
అనుమానించాల్సిందే : తక్కువ ధరలో వస్తున్నాయని, సెకండ్ హ్యాండ్లో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయొద్దని అధికారులు అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొనుక్కొంటే కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అవి చోరీకి గురైనవా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలని అంటున్నారు. దీనికోసం సీఈఐఆర్‌లో పరీక్షించుకోవచ్చని చెబుతున్నారు. పాత వస్తువులను కొనుగోలు చేస్తామంటూ వీధిలోకి చాలా మంది వస్తూ ఉంటారని, అయితే చరవాణులను సేకరించే వారి విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని అంటున్నారు. మరీ అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
సీఈఐఆర్ పనిచేసేదిలా : ముందుగా సీఈఐఆర్ అధికార వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అధికార వెబ్సైట్ www.ceir.gov.in లో లాగిన్ అవ్వాలి. అనంతరం అపహరణకు గురైన మొబైల్ ఫోన్ మోడల్, కంపెనీ పేరు, ఐఎంఈఐ నంబరు, బిల్లు తదితర వివరాలను నమోదు చేయాలి. సెల్‌ఫోన్ ఎక్కడ, ఏరోజు పోయింది అనే విషయాలతో పాటు ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనే వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తయిన తర్వాత ఓ ఐడీ నంబరును కేటాయిస్తారు. ఫోన్ పరిస్థితిని తెలుసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం నమోదు చేసిన వివరాల ఆధారంగా మన ఫోన్ పనిచేయకుండా చేస్తారు. ఒకవేళ మనకు ఫోన్ దొరికితే మళ్లీ అదే వెబ్సైట్లోకి వెళ్లి అన్‌బ్లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మనకు కేటాయించిన ఐడీని నమోదు చేస్తే మన ఫోన్ యాథావిధిగా పని చేస్తుంది.
"తక్కువ ధరలో వస్తున్నాయని, సెకండ్ హ్యాండ్లో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయొద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో కొనుక్కొంటే కాస్త అప్రమత్తంగా ఉండాలి. అవి చోరీకి గురైనవా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. దీనికోసం సీఈఐఆర్‌లో పరీక్షించుకోవచ్చు. పాత వస్తువులను కొనుగోలు చేస్తామంటూ వీధిలోకి చాలా మంది వస్తూ ఉంటారు. అయితే చరవాణులను సేకరించే వారి విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. మరీ అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలి." - పోలీసు అధికారులు
సందులో దోచేస్తారు, సూడాన్‌లో అమ్మేస్తారు - ఇదీ మొబైల్ దొంగల తీరు
రద్దీ ప్రాంతాల్లో ఏమరుపాటుగా ఉన్నారా? - మీ సెల్‌ఫోన్ గోవిందా!

