'పొలాలు, పొదలు, దట్టమైన గడ్డి ప్రదేశాల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి'
మొదట్లో గుర్తిస్తే స్క్రబ్ టైఫస్‌కు చికిత్స వారం రోజులే - సాధారణ యాంటీ బయాటిక్స్‌తో నయం - నిర్లక్ష్యం చేస్తే అవయవాల పనితీరుపై దుష్ప్రభావం - ‘స్క్రబ్ టైఫస్’పై డాక్టర్ ఎంవీ రావు సూచనలు

Published : January 5, 2026 at 4:33 PM IST
What Is Scrub Typhus Disease How To Prevent It : స్క్రబ్ టైఫస్‌కు కారణమయ్యే పొద పురుగు పేను కన్నా అతి సూక్ష్మమైనది. అడవులు, పొలాలు, పొదలు, దట్టమైన గడ్డి ప్రదేశాల్లో ఎక్కువగా ఇది ఉంటుంది. అతి చిన్నదైన ఆ పురుగు మానవులకు కుట్టడం వల్ల ‘ఓరియెంటియా సుట్సుగముషి’ అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. దాని ద్వారానే స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది కొత్తది కాకపోయినప్పటికీ చాలా మందిలో అవగాహన లేకపోవడం కారణంగానే వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు. దాదాపు పుష్కర కాలం కిందట ఈ వ్యాధిపై అధ్యయనం చేసిన వైద్య బృందంలో ఆయన కూడా ఓ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్క్రబ్ టైఫస్ రావడానికి కారణాలు? వ్యాధి లక్షణాలు? చికిత్స తదితర వివరాలను సీనియర్ డాక్టర్ ఎంపీరావు వివరిస్తున్నారు.

ఏటా 10 లక్షల మంది : ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 10 లక్షల మంది స్క్రబ్ టైఫస్ వ్యాధి బారినపడుతున్నట్లుగా పలు అధ్యయనాలు చెబుతున్నాయని డాక్టర్ ఎంవీ రావు పేర్కొన్నారు. మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, సిక్కిం తదితర రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయన్నారు. జ్వరం వచ్చిన తొలిరోజుల్లోనే ఇతర జ్వర కారక పరీక్షలతో పాటు స్క్రబ్ టైఫస్ పరీక్ష చేయించుకోకపోవడమే ముప్పునకు మూల కారణమని ఎంవీరావు పేర్కొన్నారు. గతంలో గ్రామాల్లో ఎక్కువగా ఈ కేసులు కనిపించేవని ఇటీవల పట్టణ ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయన్నారు. గడ్డి నేలపై ఇసుక దిబ్బల్లో పడుకున్నప్పుడు ఈ పురుగు కుట్టే అవకాశాలున్నాయని ఆయన వివరించారు.

సిగరెట్‌తో కాల్చిన మచ్చ ఆకారంలో : అధిక జ్వరం, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు, బలహీనత వంటి సాధారణ లక్షణాలతోనే ఈ వ్యాధి మొదలవుతుందని డాక్టర్ ఎంవీరావు అన్నారు. సకాలంలో గుర్తించనట్లయితే ప్రాణాంతకంగా మారుతుందన్నారు. అన్ని అవయవాల పనితీరును దెబ్బతీస్తుందని చెప్పారు. కొద్దిమందిలో ఇది కుట్టిన దగ్గర సిగరెట్‌తో కాల్చితే ఎలా మచ్చ పడుతుందో అలా ఏర్పడుతుందని తెలిపారు. ఇక్కడి నుంచి బ్యాక్టీరియా లింఫ్ నోడ్స్‌కు వ్యాప్తి చెందుతుందని ఆయన వివరించారు. ముఖ్యంగా తొడలు, బాహువులు, మెడ, జననేంద్రియ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మచ్చ కనిపిస్తుందని తెలిపారు. కొంతమందిలో కనపడదని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.

వ్యాధి నిర్ధారణ ఎలా : వ్యాధి నిర్ధారణకు చాలామంది సీఆర్‌పీ టెస్ట్ చేస్తుంటారని డాక్టర్ ఎంవీ రావు అన్నారు. నిజానికి సీఆర్‌పీ అనేది అన్ని సందర్భాల్లో అవసరం లేదని వివరించారు. ఇది ఇన్‌ఫ్లమేషన్ గురించి చెబుతుందే తప్ప జబ్బు నిర్ధారణ పరీక్ష కాదని చెప్పారు. ఈ జబ్బును నిర్ధారించడానికి ఇమ్యునో క్రోమటోగ్రఫిక్ టెస్ట్ (ఐసీటీ) చేస్తారని తెలిపారు. యాంటీబాడీ ఎలీసా చేస్తారని, ఇది అత్యంత విశ్వసనీయ పరీక్ష అని వివరించారు. ఈ టెస్ట్ ఇప్పుడు అన్ని చోట్లా అందుబాటులో ఉందని ఎంవీరావు తెలిపారు.
ఎవరిలో ఈ జబ్బు ఉన్నట్లు అనుమానించాలంటే
- జ్వరం మూడు నాలుగు రోజులైనా తగ్గకపోయినట్లయితే
- ప్లేట్‌లెట్లు కూడా తగ్గినట్లయితే
- శ్వాస సమస్యలతో పాటు కళ్లలో పసుపు రంగు కనిపిస్తుంటే
- తెల్ల రక్తకణాలు పెరిగితే
- బహుళ అవయవాల సమస్యలు తలెత్తితే
పొదలు, గడ్డి ప్రదేశాల్లో జాగ్రత్తలు ముఖ్యం
- మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి
- పొలాలు, పొదలు, అడవులు, పార్కుల్లో పనిచేసే వారు, ఆ ప్రదేశాలకు వెళ్లినవారు శరీరాన్ని కప్పి ఉంచే వస్త్రాలు ధరించాలి
- పాదాలకు రక్షణగా సాక్సు, బూట్లను వేసుకోవాలి
- పొలాలు, పార్కుల్లో కూర్చునేటప్పుడు దుప్పటి లాంటిది కింద పరుచుకోవాలి
- శరీరంపై ఏదైనా పురుగు పాకుతున్నట్లుగా అనిపిస్తే వెంటనే దులిపేసుకోవాలి
- బట్టల్లో పురుగులను గుర్తిస్తే వేడి నీటిలో ఉతకాలి
- శరీరంపై నీటితడి లేకుండా చూసుకోవాలి
- ఇళ్లలో, పరిసరాల్లో పొదలు, గడ్డి దట్టంగా పెరగకుండా అప్రమత్తంగా ఉండాలి
- ఈ పురుగులు ఎలుకల శరీరానికి అతుక్కుని జీవించే అవకాశముంది
- అందువల్ల ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి
- పెంపుడు జంతువులు బయట తిరిగి వస్తే వాటి శరీరంపై కూడా పురుగులున్నాయేమో పరిశీలించడం మంచిది
"ఈ పొద పురుగు కుట్టిన 7-10 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం వచ్చినప్పుడు.. మామూలుగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ తదితర పరీక్షలన్నీ చేస్తారు. చాలా సందర్భాల్లో టైఫాయిడ్‌కు ఫాల్స్ పాజిటివ్ వస్తుంటుంది. దీంతో టైఫాయిడ్‌కు మందులు వాడి.. స్క్రబ్ టైఫస్‌ను వదిలేస్తారు. వ్యాధి ముదిరతే సాధారణంగా ఇచ్చే యాంటీ బయాటిక్స్ పనిచేయవు. జ్వరం తగ్గదు. 5-7 రోజులు గడిచేసరికి నెమ్మదిగా అన్ని అవయవాలపై దుష్ప్రభావం చూపిస్తుంది. గుండె, కిడ్నీ, కాలేయం, మెదడు, ఊపిరితితుల పనితీరును దెబ్బతీస్తుంది. ఊపిరి తీసుకోవడంలో ఉక్కిరిబిక్కిరి, శ్వాసకోశాల్లో నీరు చేరడం, రక్తపోటు పడిపోవడం, కిడ్నీలు, కాలేయం పనితీరు దెబ్బతినడం వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తుతాయి"- డాక్టర్ ఎంవీరావు, సీనియర్ జనరల్ ఫిజీషియన్
సకాలంలో చికిత్స అందకపోతే? : ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో, గర్భిణుల్లో స్క్రబ్ టైఫస్ తీవ్రత అధికంగా ఉంటుందని డాక్టర్ ఎంవీరావు తెలిపారు. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్(ఏఆర్‌డీఎస్) బారినపడిన వారిలోనూ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అన్నారు. సకాలంలో ఈ జబ్బును గుర్తించి చికిత్సను అందించినట్లయితే త్వరగా తగ్గుముఖం పడుతుందన్నారు. డాక్సీసైక్లిన్, అజిత్రోమైసిన్ లాంటి సాధారణ యాంటీ బయాటిక్స్‌తో నయమవుతుందని తెలిపారు. పిల్లలు, గర్భిణులకు అజిత్రోమైసిన్ ఐదు రోజులు పాటు ఇవ్వాలని సూచించారు. మిగిలిన వారికి డాక్సీసైక్లిన్ వారం రోజులు ఇవ్వచ్చన్నారు. తొలిదశలో గుర్తిస్తే దీనికి చికిత్స వారం రోజులేనని డాక్టర్ ఎంవీ రావు పేర్కొన్నారు.
'స్క్రబ్ టైఫస్' గురించి భయపడుతున్నారా? - ఆందోళన అవసరం లేదన్న వైద్య నిపుణులు
'తేవీటి పురుగు'ను తేలిగ్గా తీసుకోవద్దు - కుడితే వ్యాధి సోకుతుందంటున్న నిపుణులు!

