సెకండ్ హ్యాండ్ వాహనాలు కొంటున్నారా ? - ఈ జాగ్రత్తలు తీసుకోండి
పాత వాహనాలపై ఆపరేషన్ కవచ్ పేరుతో హైదరాబాద్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు - కనీస నిబంధనలు పాటించకుండా విక్రయాలపై నజర్ - కొనుగోలుదారుడిని మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Published : June 9, 2026 at 10:40 AM IST
Precautions For Buying Old Vehicles : హైదరాబాద్ నగరంలో చోరీ చేస్తున్న వాహనాలు రోడ్లపై పరుగులు తీయకుండా ఉండడానికి, పాత వాహనాలను కొనుగోలు చేస్తున్న వారు మోసపోకుండా ఉండడానికి పోలీసులు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల'ఆపరేషన్ కవచ్' పేరుతో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సెకండ్ హ్యాండ్ వాహనాలు కనీస నిబంధనలు పాటించకుండా విక్రయాలు సాగిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ అక్రమాల నియంత్రణకు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేశారు.
అందులో యజమాని వివరాల ధ్రువీకరణ లేకుండా వాహనాలను కొనుగోలు చేసినా, తక్కువ తిరిగినట్లు రీడింగ్ మార్చినా సోషల్ మీడియాలో వాహనాల తప్పుడు ఫొటోలు, వాస్తవం లేని సమాచారంతో ప్రకటనలు ప్రచారం చేసిన కొనుగోలుదారులను మోసం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పాత వాహనాలతో జాగ్రత్త :
- వ్యాపారం చేసేవారు పాత వాహనాన్ని కొనుగోలు చేసే ముందు ఎవరైతే అమ్మకం చేస్తున్నారో వారి నుంచి ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు పత్రం నకలు తీసుకోవాలి.
- వాహన ఆర్సీలో ఉన్న పేరు, చిరునామాను సరిచూసుకోవాలి. ఆ వాహనాన్ని యజమాని కాకుండా ఇతురులు ఎవరైనా విక్రయిస్తుంటే పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను పరిశీలించుకోవాలి.
- విక్రేత గుర్తింపు, వాహన యజమాని వివరాలు సంతృప్తికరంగా లేకపోతే వాహనాన్ని వ్యాపారులు తీసుకోవడం గానీ, ప్రకటనలు ఇవ్వడం, తిరిగి విక్రయించడం పూర్తిగా నిషేధమని గుర్తించాలి.
- ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే ముందు దొంగతనం చేసిందా? బ్లాక్ లిస్ట్‌లో ఉందా? లేదా ఏదైనా ప్రమాదానికి గురైయ్యిందేమోనని వాహన పోర్టర్ ద్వారా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
- వాహనంపై పెండింగ్ చలానాలు, టోల్గేట్ బకాయిలు, రోడ్డు పన్నులు లేకుండా చూసుకోవాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలను విక్రయించాలనుకుంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తప్పనిసరిగా తీసుకోవాలి.
- గుర్తింపు నంబర్స్ ట్యాంపరింగ్ చేసినా, పూర్తిగా లేకపోయినా చోరీ వాహనంగానే భావించి పోలీసులు తక్షణమే సీజ్ చేస్తారు.
- కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసే వ్యక్తి లేదా కంపెనీకి సంబంధించిన ఆర్టీవో కార్యాలయం నుంచి లైసెన్సు పొంది ఉండాలి. అలాంటి వారి వద్దే కొనుగోలుచేయాలి
- వాహనాల పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. ఇంజిన్ కండిషన్, విడి భాగాలను మెకానిక్‌తో తనిఖీ చేయించుకోవడం మంచిది.
- వాహనాన్ని ప్రత్యక్షంగా నడిపి చెక్ చేసుకోవాలి. ఛాసిస్ నంబరును తప్పనిసరిగా చూడాలి.
- వాహనం రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ (పొల్యూషన్) పత్రాలను క్షుణంగా పరిశీలించాలి.
- కేసులు, జరిమానాలు లేకుండా చూసుకున్నాకే తీసుకోవడం మేలు.
కొత్త నిబంధనల ప్రకారం యజమాని కానీ లేదంటే రిజిష్టర్ డీలరు కానీ యాజమాన్య హక్కుల బదిలీకి దరఖాస్తు సమర్పించే అవకాశం లభిస్తుంది. దీనివల్ల వాహనాలు అమ్మదలుచుకున్నవారు డీలరును సంప్రదిస్తే సరిపోతుంది.
పాత వాహనాలు అమ్మాలనుకుంటే ఇలా చేయాలి :
- ప్రస్తుత వాహన యజమాని తన వాహనాన్ని ఫలానా డీలరుకు అప్పగిస్తున్నట్లు చెబుతూ ఫామ్ 29సిని ఎలక్ట్రానిక్ రూపంలో అధికారులకు సమర్పించాలి.
- అపుడు వెంటనే ఆటో జనరేటెడ్ అక్నాలెడ్జిమెంట్ నంబరు వస్తుంది.
- 29సి ఫామ్ సమర్పించిన తర్వాత డీలరే ఊహాజనిత యజమానిగా మారిపోతారు. ఆ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లకు, వాటితో జరిగే సంఘటలకు అతనే జవాబుదారీగా మారిపోతారు.
- రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యువల్, డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, వాహన యాజమాన్య హక్కుల బదిలీ అన్నీ డీలరు చేతులమీదుగానే నిర్వహించడానికి వీలు కలుగుతుంది.
- ఒకవేళ డీలర్ నుంచి వాహనాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే ఫామ్ 29డిని సమర్పించాలి. అప్పటి నుంచి పాత యజమానికే పూర్తి హక్కులు వస్తాయి. దీంతో ఆ వాహనంపై డీలర్ లావాదేవీలు చేయలేరు.
రోడ్లపైకి రావాలంటే ఫైన్ వేస్తారని భయం - భాగ్యనగరంలో గ్రీన్ ట్యాక్స్ కష్టాలు
పాతవాహనాలు కొంటున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మోసపోతారు!

