డ్యాన్స్‌కు నో చెప్పిన వరుడు - ఆగిన పెళ్లి
కాసేపట్లో పెళ్లి - కేరింతల నడుమ సాగుతున్న వధూవరుల ఊరేగింపు - అంతలో డ్యాన్స్ విషయమై చిన్న వివాదం - పెళ్లి కుమారుడికి షాకిచ్చిన వధువు తండ్రి

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 6, 2026 at 1:08 PM IST
Markapuram Marriage Incident : వివాహం ఆగిపోయిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. చివరి నిమిషాల్లో పెండ్లి ఆగిపోవడం ఇదివరకు ఎక్కువగా సినిమాల్లో చూసేవాళ్లం. కానీ ఈ మధ్య కాలంలో నిజ జీవితంలోనూ ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. కట్నకానుకల విషయంలో గొడవలతో కొన్ని, ప్రేమ వ్యవహారాలతో మరికొన్ని, ఇతరత్రా కారణాలతో ఇంకొన్ని ఇలా రీజన్ ఏదైనా కాసేపట్లో జరగాల్సిన వివాహాలు కాస్తా చివరి నిమిషంలో క్యాన్సిల్ అవుతున్నాయి. కానీ ఈ పెళ్లి మాత్రం ఊహించని విధంగా ఆగిపోయింది. మరికాసేపట్లో వివాహం జరగనుండగా వధువు తండ్రి ఈ పెండ్లికి నో చెప్పాడు. మరీ ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
వివాహానికి వచ్చిన బంధువులతో ఆ రెండు కుటుంబాల్లో ఆనందం నెలకొంది. అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. మరి కాసేపట్లో పెళ్లికి అందరూ సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. కానీ అంతలోనే డ్యాన్స్ విషయమై మొదలైన చిన్న వివాదం వారి ఉత్సాహాన్ని ఆవిరి చేసింది. చివరికి పెళ్లి రద్దు చేసే వరకు వెళ్లింది. ఈ ఉందతం మార్కాపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి, కంభం మండలం తురిమెళ్లకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం వేడుకకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. శనివారం రాత్రి వధువుతో పాటు కుటుంబసభ్యులు చిన్నగానిపల్లికి చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత వధూవరులను వాహనం ఎక్కించి బంధువులు ఊరేగింపును తలపెట్టారు. ఇరు కుటుంబాల వారు, స్థానిక యువకులు డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొడుతూ ముందుకు సాగుతున్నారు.
Wedding Cancel Due to Dance Issue : అంతలో వధూవరులూ డ్యాన్స్ చేయాలని కొందరు కోరారు. అందుకు అమ్మాయి సిద్ధం కాగా అబ్బాయి మాత్రం తాను డ్యాన్స్ చేసేదే లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా ‘నువ్వూ చేయడానికి వీల్లేదు’ అంటూ అమ్మాయిని గట్టిగా మందలించాడు. అలా కోప్పడటం వధువు తండ్రికి నచ్చలేదు. వివాహానికి ముందే ఇలా ఉంటే, పెళ్లి అయ్యాక ఇంకెలా ఉంటుందోనని కినుక వహించారు.
వెంటనే తన కుమార్తెను వాహనం పైనుంచి దించేశారు. పెళ్లీ వద్దు గిళ్లీ వద్దు అంటూ అందరూ కలిసి సొంతూరికి వెళ్లిపోయారు. వేడుక నిలిచిపోవడంతో ఇరువైపుల వారూ కట్నకానుకల లావాదేవీలను సెటిల్ చేసుకున్నారు. అప్పటికే భారీగా ఖర్చు చేసిన వరుడి తరఫు వారు లబోదిబోమంటున్నారు. దీంతో బంధువులతో కళకళలాడాల్సిన కల్యాణ మండపం కాస్త వెలవెలబోయింది. ఇలాంటి కారణంతో పెళ్లి ఆగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దయచేసి పెళ్లి నిర్ణయం మాకు వదిలేయండి - రాజీపడేదే లేదు అంటున్న యువత

