60 ఎకరాల్లో భారీ నీటి స్టోరేజీ ట్యాంకు - పరిశ్రమలకు కొరత లేకుండా సరఫరా
మేనకూరు సెజ్ సమీపంలో 60 ఎకరాల్లో భారీ నీటి ట్యాంకు - దీని నుంచి పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా -కొన్నేళ్లుగా సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులకు అడ్డుకట్ట

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 21, 2026 at 8:45 PM IST
Heavy Water Tank in Chittoor District : ఇది తిరుపతి జిల్లా మేనకూరు సెజ్ సమీపంలోని ద్వారకాపురం వద్ద 60 ఎకరాల్లో నిర్మించిన ట్యాంకు. దీని నుంచి పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేస్తున్నారు. వెంకటగిరి సమీప ఊట్లపల్లి స్లూయిస్ నుంచి పైపులైన్లు వేశారు. పది ఎంఎల్‌డీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి దశలవారీగా ట్యాంకుకు నింపుతున్నారు. ఒకేసారి నింపితే ట్యాంకు కట్టలకు ఇబ్బంది కలిగే అవకాశముండటంతో అవసరాల మేరకు నిల్వ చేస్తున్నారు.
ఒక్కో ట్యాంకర్‌కు వేలకు వేలు వసూలు : ఏపీఐఐసీ అధికారులు మేనకూరు సెజ్, ఐటీ పార్కు, అత్తివరం పరిధిలోని కంపెనీలకు స్థానికంగా కొందరు రాజకీయ నాయకులు నీటి సరఫరా చేసి కొన్నేళ్లుగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇదో పెద్ద వ్యాపారంగా మారింది. ఒక్కో ట్యాంకర్‌కు వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వీరికి అడ్డుకట్ట పడనుంది.
నెలనెలా రీడింగ్ తీసి నగదు వసూలు : ప్రస్తుతం ట్యాంకు నుంచి నీటిని బిర్లా కార్బెన్ కంపెనీకి రోజుకు మూడు ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేసేలా ఏపీఐఐసీ అధికారులు కంపెనీ యాజమాన్యంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు సరఫరా చేస్తున్నారు. అలాగే ప్రీమియర్ ఎనర్జీ కంపెనీకి రోజుకు ఆరు ఎంఎల్‌డీ, అత్తివరం స్టార్ ఇండస్ట్రీస్‌కు రోజుకు 300 కేఎల్ నీటిని అందిస్తున్నారు. శర్మగ్రూపు, అత్తివరం పరిధిలోని కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఒక కేఎల్ నీటిని రూ.120లకు విక్రయించనున్నారు. నీటిని వినియోగించే కంపెనీల్లో మీటర్లు పెట్టి ఎంతమేరకు వినియోగిస్తున్నారో నెలనెలా రీడింగ్ తీసి ఆ మేరకు నగదు వసూలు చేస్తున్నారు.
పెరగనున్న భూగర్భ జలాలు : ద్వారకాపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కడా నీటి లభ్యత లేదు. ఇక్కడి రైతులు చెరువులోకి వచ్చే తెలుగుగంగ జలాలతో పంటలు సాగు చేసుకుంటున్నారు. వందల అడుగుల లోతు బోర్లు వేసినా నీరు పడవు. గంగ జలాలు రాకముందు ఇక్కడ కరవు పరిస్థితులు కనిపించేవి. అలాంటిది గ్రామం ఆనుకుని పెద్ద ట్యాంకు ఏర్పాటు చేయడంతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఎల్‌నినోను తట్టుకునేలా ముందస్తు చర్యలు : కంపెనీల నిర్మాణాలకు నీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవసరాల మేరకు పొదుపుగా వాడుకునేలా, ఎల్‌నినోను తట్టుకునేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ పరిధిలో పదికి పైగా కంపెనీల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం, భవిష్యత్తులో నీటి అవసరాలకు ప్రభుత్వం 60 ఎకరాల విస్తీర్ణంలో నీటి నిల్వ స్టోరేజీ ట్యాంకును నిర్మించింది. గతంలో టీడీపీ హయాంలోనే పనులు ప్రారంభమైనా అనంతరం వచ్చిన వైఎస్సార్సీపీ దీన్ని పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది.
ఏపీకి రావాల్సిన తుంగభద్ర జలాలను అడ్డుకున్న కర్ణాటక రైతులు
ఏపీకి అత్యంత గడ్డుకాలం - ఎల్‌నినోతో సాగుకే కాదు, తాగునీటికీ తిప్పలే!

