ETV Bharat / state

రిజర్వాయర్లలో అంతంత మాత్రంగా నీటి నిల్వ - ఈసారి సాగుకు ఆగాల్సిందేనా!

శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరామసాగర్‌ రిజర్వాయర్లలో తగ్గిన నీటి నిల్వలు - భారీ ప్రవాహాలు వచ్చినా రిజర్వాయర్లన్నీ మళ్లీ నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి - క్యారీ ఓవర్‌ స్టోరేజిని వినియోగించుకోని ప్రభుత్వాలు

Irrigation projects
WATER LEVELS IN RESERVOIRS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 4, 2026 at 12:57 PM IST

3 Min Read
Choose ETV Bharat

Water Levels Reduced in Irrigation Reservoirs : కృష్ణా, గోదావరి బేసిన్లలోని రిజర్వాయర్లలో ప్రస్తుత నీటి నిల్వలతో మరో నెల రోజులు తాగునీటికి ఎటువంటి సమస్య లేకపోయినా, సాగునీటికి మాత్రం పైన ఉన్న రాష్ట్రాల్లో వర్షాలు కురిసి అక్కడి రిజర్వాయర్లు నిండే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నాగార్జునసాగర్, శ్రీరామసాగర్‌, శ్రీశైలం ఇలా ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మే నెలతో ముగిసిన నీటి సంవత్సరంలో కృష్ణా, గోదావరి బేసిన్లలోని రిజర్వాయర్లలోకి ఊహించని ప్రవాహాలు వచ్చాయి. గోదావరి నుంచి సుమారుగా 4640, కృష్ణా నుంచి 1660 మొత్తంగా 6300 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. ఇంత భారీ ప్రవాహాలు వచ్చినా రిజర్వాయర్లు అన్నీ ఖాళీ చేసి మళ్లీ వరద నీటి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.

క్యారీ ఓవర్ స్టోరేజి : నీటి వరద ప్రవాహం సెప్టెంబర్, అక్టోబర్​ నెలల్లో ఎక్కువగా ఉన్నప్పుడు క్యారీ ఓవర్‌ స్టోరేజి కింద నిల్వ చేసుకొని తర్వాత సంవత్సరం వినియోగించుకునే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ, పునర్విభజన తర్వాత కానీ ప్రతి సంవత్సరం వచ్చిన నీటిని వాడుకోవడం, సముద్రానికి వదిలేయడం తప్ప క్యారీ ఓవర్‌ కింద వినియోగించుకున్న దాఖలాలు చాలా అరుదుగా ఉన్నాయి. వానాకాలం సీజన్‌ ప్రారంభమయ్యే జూన్‌ నాటికి ఎగువన ఉన్న ఆలమట్టి డ్యాం, నారాయణపూర్‌ రిజర్వాయర్లలో గత ఏడాది సీజన్‌ ప్రారంభం నాటితో పోల్చితే ఇప్పుడు చాలా తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న నీటిని కూడా కాలువలకు ప్రత్యేకించి నారుమళ్లకు వదిలారు.

నారాయణపూర్​లో మెరుగ్గానే : ఆలమట్టి డ్యాంలో గత ఏడాది జూన్‌ కంటే ప్రస్తుతం సుమారు 30 టీఎంసీల వాటర్ తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం 24 టీఎంసీలే ఉన్నా, డెడ్‌స్టోరేజి పోను నామమాత్రంగానే అందుబాటులో ఉండగా, ఇందులో కాలువలకు 2824 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దిగువన ఉన్న నారాయణపూర్‌లో గత ఏడాది లాగానే నీటి నిల్వ కొంత మెరుగ్గా ఉంది. వర్షాలు ఆలస్యమైనా ఈ నెలాఖరు వరకు సాగునీటికి కూడా సరిపడేలా నారాయణపూర్‌లో నిల్వలు ఉన్నాయి. ఆలమట్టి, నారాయణపూర్‌లకు 110 టీఎంసీలు వచ్చిన తర్వాత కానీ దిగువకు నీటి విడుదల ప్రారంభం కాలేదు. జూన్, జులై నెలలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయకూడదని ప్రాజెక్టు రూల్‌కర్వ్‌ స్పష్టంగా చెబుతున్నా, దాన్ని పాటిస్తున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి.

ఇందిరా ప్రియదర్శిని జూరాలలో 6 టీఎంసీలు ఉండటంతో పాటు స్థానికంగా కురిసిన వర్షాలతో కొంత వరద ప్రవాహం ఉండగా, కాలువలకు కూడా కొంత నీటిని రిలీజ్​ చేస్తున్నారు. తుంగభద్ర మాత్రం ఖాళీగా ఉంది. ఈ రిజర్వాయర్‌లోకి 100 టీఎంసీలు వస్తే కానీ దిగువకు వదలరు.

పూడిక కారణంగా 80 టీఎంసీలకు తగ్గింది : తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్​లో కనీస నీటిమట్టం కంటే తక్కువగా నిల్వ ఉంది. గత ఏడాది కంటే 10 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ఆయకట్టు కూడా శ్రీశైలంలోకి వచ్చే నీటి ప్రవాహం పైనే ఆధారపడి ఉంది. గోదావరి నది బేసిన్‌లో ప్రధానమైన శ్రీరామసాగర్‌లో 16.41 టీఎంసీల నీరు ఉంది. పూడిక కారణంగా శ్రీరామసాగర్ రిజర్వాయర్‌ సామర్థ్యం కూడా 80 టీఎంసీలకు తగ్గిపోయింది. సింగూరు మినహా బేసిన్‌లోని మిగిలిన రిజర్వాయర్లలో నీటి నిల్వలు గత ఏడాది కంటే కొంత మెరుగ్గా ఉండటంతో తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదని, సాగునీటికి మాత్రం వర్షాలు ప్రారంభమైన తర్వాత వచ్చే ప్రవాహంపైనే ఆధారపడాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి.

రిజర్వాయర్లలో అంతంతమాత్రంగా నీటిమట్టాలు
ఎగువ రాష్ట్రాల్లో జలాశయాలు నిండితేనే..