ETV Bharat / state

ప్రత్యేక స్టైల్​ను అనుసరించి చైన్​ స్నాచింగ్​ - పోలీసులకు చిక్కిన దొంగల ముఠా

ఒంటరి మహిళలను టార్గెట్​ చేసి - ద్విచక్ర వాహనం నుంచి కారులోకి మారుతూ దొంగతనం - 104 గ్రాముల బంగారం, 40 లక్షల విలువ గల వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Chain Snatching In Wanaparthy
Chain Snatching In Wanaparthy (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : December 31, 2025 at 3:45 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chain Snatching In Wanaparthy : ఒంటరి మహిళలను టార్గెట్​గా చేసుకుని, మెరుపు వేగంతో వస్తారు. రెప్పపాటు కాలంలో మెడలో గొలుసు లాగేసుకుని, ఏం జరిగిందో తెలుసుకునేలోపే మాయం అయిపోతారు. వనపర్తి పోలీసులు బంగారు గొలుసు చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. గొలుసు దొంగతనాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ఉక్కు పాదం మోపుతున్నప్పటికీ, కొంతమంది కేటుగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసుల చోరీలకు తెగబడుతున్నారు. వనపర్తి జిల్లాలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోన్న మహిళల మెడలో బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన నిందితులు పోలీసులకు చిక్కడంతో గొలుసు దొంగల గుట్టురట్టు అయ్యింది.

ప్రత్యేక స్టైల్​ను అనుసరిస్తూ దొంగతనం : అమరచింత మండలం నాగల్ కడ్మూరుకు చెందిన గట్టు వెంకటేష్, బండమీది రాజేష్, కురువ రాములు, డ్యాం వెంకటేశ్​లు ముఠాగా ఏర్పడి, 2024లో గొలుసు దొంగతనాలు మొదలుపెట్టారు. దొంగతనాలు చేయడంలో వీరు ఒక ప్రత్యేక స్టైల్​ను అనుసరిస్తున్నారు. ముందుగా ఇద్దరు బైక్‌పై వచ్చి మహిళ మెడలో గొలుసు లాక్కొని వెళ్తారు. కొంత దూరం వెళ్లాకా, ద్విచక్ర వాహనం నుంచి కారులోకి మారుతారు. కారులో ఉన్న వారు బైక్‌కు మారుతారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి ఈ ట్రిక్ పాటిస్తున్నారు.

సీసీ ఫుటేజ్​, కారు నంబరు ఆధారంగా : సరిగ్గా ఇదే విధంగా లక్ష్మీనగర్‌ కాలనీలో ఓ మహిళ మెడలో గొలుసును చోరీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులు ఓ చోట సీసీ ఫుటేజీలో అనుమానాస్పదంగా కనిపించారు. కారు నంబరు ఆధారంగా నిందితులను వెతకసాగారు. ఈ క్రమంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, అనూహ్యంగా నిందితులే పోలీసులకు చిక్కారు.

ప్రత్యేక స్టైల్​ను అనుసరించి చైన్​ స్నాచింగ్ (ETV)

"2024 మే నుంచి ఈ నలుగురు ఒక ముఠాగా ఏర్పడి చైన్​ స్నాచింగ్ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వాహనాల తనిఖీలు చేస్తుంటే ద్విచక్ర వాహనంపై ఇద్దరు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చి వారిని పట్టుకుంటే, వారితో మరో ఇద్దరు పక్కన కారులో ఉన్నారని, అంతా కలిసి చైన్​ స్నాచింగ్​ చేసేందుకు వచ్చారని చెప్పారు. అలాగే వీరిపై జడ్చర్ల, నర్వ పోలీస్ స్టేషన్​లలో ఇంతకు ముందే కేసులు నమోదయ్యాయి. నిందితుల దగ్గర నుంచి 104 గ్రాముల బంగారం, రూ.40 లక్షల విలువ కలిగిన వాహనాలను రికవరీ చేశాం." - వెంకటేశ్వరరావు, డీఎస్పీ వనపర్తి

గతంలో పలు చోట్ల నేర చరిత్ర : నిందితులు గతంలోనూ జడ్చర్ల, కొత్తకోట, నర్వ మండలాల సమీపంలో చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 104 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, ఒక ఆటో, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురు నిందితులను రిమాండుకు తరలించారు. ఈ మధ్యకాలంలో గొలుసు దొంగతనాలు పెరిగినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

అప్రమత్తత ముఖ్యం : మహిళలు బంగారం ధరించి ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఎదురైతే తక్షణమే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి నేరాలు ఎ్కకువగా అవుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నేరస్థులు ఎంత జాగ్రత్త పడినా ఏదో ఒక రోజు దొరికిపోతారు, వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.

చెయిన్ ​స్నాచింగ్​లు, అమ్మేసి జల్సాలు - మరో చోరీకి వెళుతూ దొరికిన గొలుసు దొంగ

యూట్యూబ్​లో చూసి చైన్ స్నాచింగ్ – కానీ బ్యాడ్​ లక్