ETV Bharat / state

ఓటర్లకు అలర్ట్ - ఎన్యూమరేషన్‌ పత్రాలు సబ్మిట్ చేశారా? - లేదంటే త్వరపడండి

ఎన్యూమరేషన్‌ పత్రాలు సబ్మిట్ చేయడానికి 6 రోజులే గడువు - ఈ నెల 14లోగా సమర్పించకపోతే ఓటుహక్కు కోల్పోయే ముప్పు - ఎన్యూమరేషన్‌ పత్రాలు అందకపోతే వెంటనే బీఎల్‌వోను సంప్రదించండి

Special Intensive Revision in AP
Special Intensive Revision in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 9, 2026 at 7:29 AM IST

3 Min Read
Choose ETV Bharat

Special Intensive Revision in AP : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాలో మీ పేరు కొనసాగాలా? అయితే వెంటనే అప్రమత్తమవ్వాలని అధికారులు పేర్కొంటున్నారు. మీ వివరాలు నింపిన ఎన్యూమరేషన్‌ పత్రాలను (ఈఎఫ్‌) బీఎల్‌వోలకు వెనక్కి ఇవ్వడానికి ఇక ఆరు రోజులే గడువు ఉందని చెబుతున్నారు. అంటే ఈ నెల 14వ తేదీయే తుదిగడువని పేర్కొంటున్నారు. పూర్తిచేసిన ఎన్యూమరేషన్‌ పత్రాలు ఆలోగా బీఎల్‌వోలకు సమర్పించకపోతే మీ ఓటుహక్కు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు.

ఈ నెల 21న ఎన్నికల సంఘం విడుదల చేసే ముసాయిదా జాబితాలో మీ పేరుండదని ఆ తర్వాత ఓటుహక్కు పొందాలంటే చాలా కష్టమని వివరిస్తున్నారు. పశ్చిమబెంగాల్, బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో లక్షలమంది ఇలా ఓటుహక్కు కోల్పోయారని అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే మీ ఎన్యూమరేషన్‌ పత్రాల్లో వివరాలు నింపి బీఎల్‌వోలకు ఇవ్వాలని చెబుతున్నారు. ఇప్పటికీ ఎన్యూమరేషన్‌ పత్రాలు మీకు అందకపోతే https://voters.eci.gov.in వెబ్‌సైట్‌లోకి లేదా ఈసీఐ నెట్‌ యాప్‌లోకి వెళ్లి పొందొచ్చని తెలియజేస్తున్నారు. ఆన్‌లైన్‌లోనే వాటిని సమర్పించొచ్చని పేర్కొంటున్నారు. లేదా మీ ప్రాంత బూత్‌స్థాయి అధికారిని (బీఎల్‌వో) సంప్రదించి ఎన్యూమరేషన్‌ పత్రం తీసుకోవాలని అంటున్నారు. మీ బీఎల్‌వో ఫోన్‌ నంబర్‌ స్థానిక పోలింగ్‌ కేంద్రంలో లేదా ఈసీఐనెట్‌ మొబైల్‌ యాప్‌లో, సీఈవో ఆంధ్రా వెబ్‌సైట్‌లో ఉంటుందని సూచిస్తున్నారు.

రసీదు భద్రపరుచుకోవడం మరిచిపోవద్దు : 2002 నాటి ఓటర్ల జాబితా ప్రాతిపదికన ప్రస్తుత ఓటర్ల జాబితా పరిశీలించి లింక్‌ చేస్తున్నారు. 2002 నాటి జాబితాలో మీ పేరుంటే ఆ వివరాలు ఎన్యూమరేషన్‌ ఫాంలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే మీ తల్లిదండ్రులు లేదా భర్త/భార్య లేదా ఇతరత్రా కుటుంబీకులు, సంబంధీకుల పేర్లు ఎవరివి ఉంటే వారి వివరాలు ఎంటర్ చేయాలి. వీటితోపాటు మీ పుట్టినతేదీ, ఆధార్, సెల్​ఫోన్ నంబర్, తండ్రి/సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య/భర్త పేరు, వారి ఎపిక్‌ నంబర్ (అందుబాటులో ఉంటే) వివరాలన్నీ నింపి, కొత్త కలర్‌ ఫొటోలు అతికించి బీఎల్‌వోకివ్వాలి. రెండు ఫాంలలో ఒకదానిపై బీఎల్‌వో సంతకం చేసి దాన్నే రసీదుగా ఓటరుకు ఇస్తారు. దీన్ని తప్పనిసరిగా భద్రపరుచుకోవాలి.

  • 2002 నాటి ఓటర్ల జాబితా, ప్రస్తుత జాబితా రెండూ https://voters.eci.gov.in వెబ్‌సైట్‌లో, సీఈవో ఆంధ్ర వెబ్‌సైట్‌లో, ఈసీఐ నెట్‌ యాప్‌లో ఉన్నాయి. బీఎల్‌వోల వద్ద, రాజకీయ పార్టీలకు చెందిన బూత్‌స్థాయి ఏజెంట్ల (బీఎల్‌ఏ) దగ్గరా ఉంటాయి.
  • ఇప్పటివరకూ ఏపీ వ్యాప్తంగా 2,88,28,419 మంది ఎన్యూమరేషన్‌ పత్రాల (ఈఎఫ్‌) డిజిటలైజేషన్‌ మాత్రమే పూర్తయ్యింది. ఇంకా 1,26,63,972 ఓటర్ల పత్రాల డిజిటిలైజేషన్‌ పూర్తిచేయాలి. మరో 1,35,303 మందికి ఇప్పటివరకూ ఎన్యూమరేషన్‌ పత్రాలు అందలేదు. ఇవన్నీ చేయడానికి ఆరు రోజులే సమయముంది. అందుకే ఇప్పటివరకూ నింపిన ఎన్యూమరేషన్‌ పత్రాలు వెనక్కి ఇవ్వని ఓటర్లు వెంటనే ఇచ్చేయాలి.
  • ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 46,397 మంది బీఎల్‌వోలు ఉన్నారు. వీరు రోజుకు సగటున 21.10 లక్షల చొప్పున ఎన్యూమరేషన్‌ పత్రాలను ఎన్నికల సంఘం పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయగలిగితేనే నిర్దేశిత గడువులోగా డిజిటలైజేషన్‌ పూర్తవుతుంది.
  • రాష్ట్ర వ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో ఇప్పటివరకూ 4,14,92,391 (99.67 శాతం) మందికి ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీ పూర్తైంది. పంపిణీ అయినవాటిలో 69.25 శాతం మేర డిజిటలైజేషన్‌ జరిగింది. ఇంకా 30.75 శాతం మంది ఓటర్ల ఎన్యూమరేషన్‌ పత్రాల డిజిటలైజేషన్‌ ఆరు రోజుల్లో జరగాలి.

అకారణంగా ఓటర్లను తొలగించే ప్రసక్తే లేదు: ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌ వెల్లడి

2002లో మీ ఓటు ఎక్కడుందో తెలుసా?