పత్రాలు ఇచ్చారు సరే - ఎలా నింపాలి 'సర్' : అయోమయంలో పల్లె ఓటర్లు
అధ్వాన్నంగా నిరాక్షరాస్యుల పరిస్థితి - ఉమ్మడి నిజామాబాద్‌లో మందకొడిగా సాగుతున్న 'సర్' ప్రక్రియ - మారిన చిరునామాలు గుర్తించటంలో బీఎల్వోల ఇబ్బందులు - 2002 జాబితాలో లేని పేర్లు

Published : June 30, 2026 at 12:52 PM IST
Voters Facing Issues With Filling Enumeration Form : రాష్ట్రంలో ఎస్ఐఆర్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఆర్ఐ ప్రక్రియ వేగంగా సాగుతోంది. బీఎల్‌వోలు ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను అందిస్తున్నారు. అయితే ఎన్యూమరేషన్ పత్రాన్ని ఎలా నింపాలో తెలియక ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
గ్రామాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతున్నారు. దీంతో వారంతా అయోమయంలోకి వెళ్తున్నారు. ఇక నిరాక్షరాస్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. బీఎల్‌వోలు ఇచ్చిన పత్రాలను ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు కొంతమంది పేర్లు అసలు 2002 జాబితాలో లేవు. దీంతో లేనివారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టణాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ నెమ్మదిగా : బీఎల్‌వోలు వారికి కేటాయించిన పరిధిలో ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించి, పత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 4,28,207 పత్రాలు పంపిణీ చేశారు. అయితే మున్సిపల్ ప్రాంతాల్లో మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. బీఎల్వోలకు ఓటర్ల చిరునామాలు గుర్తించడం కష్టంగా మారింది. చాలా మంది ఓటర్లు వారి నివాసాలను మార్చుకున్నారు.
దీంతో వారు ప్రస్తుతం ఉంటున్న అడ్రెస్‌ను కనుగొనటానికి బీఎల్‌వోలు ఇబ్బంది పడుతున్నారు. ఒకే ఇంట్లో 5 లేదా 6 ఓట్లు ఉంటే బీఎల్‌వోలు 1, 2 ఫామ్‌లను ఇచ్చి వెళ్తున్నారు. దీంతో వారు తమ కుటుంబంలో మిగిలిన సభ్యుల పత్రాల కోసం వేచి ఉంటున్నారు. రోజంతా తిరిగినా కొంతమందివి చిరునామాలు లేకపోవటంతో సర్వే ప్రక్రియ మందగిస్తుందని అధికారులు అంటున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా, కామారెడ్డిలో మాత్రం చాలా మంది ఓటర్లు వారి అడ్రస్‌లను మార్చుకున్నారు.
ఓటర్ల ప్రధాన సమస్యలు ఇవే :
- 2002 నాటి ఓటర్ల జాబితాలో కొంతమంది ఓటర్ల ఇంటి పేర్లు వారి పేర్ల చివరన ఉండగా, ప్రస్తుత జాబితాలో ఇంటి పేరు మొదట కనిపిస్తోంది. దీనివల్ల పత్రాలను ఎలా నింపాలో వారికి అర్థం కావడం లేదు.
- పాత జాబితాలో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దాలా లేక గతంలో ఉన్న వివరాలనే యథాతథంగా నమోదు చేయాలా అనే విషయంలో ఓటర్లు సందిగ్ధంలో ఉన్నారు.
- 2002 నాటి ఓటర్ల జాబితాలో పేర్లు లేని కోడళ్లు ఆ జాబితాల్లో తమ పుట్టింటి వారి వివరాల కోసం వెతుకుతున్నారు. కానీ జాబితాలో తల్లిదండ్రుల పేర్లు దొరకకపోవటంతో ఆందోళన చెందుతున్నారు.
- 2002 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా వివరాలను నమోదు చేయాలని సూచనలు ఇచ్చినప్పటికీ కొందరు వ్యక్తులు తమ ప్రస్తుత వయస్సును నమోదు చేస్తున్నారు.
- వలస వెళ్లిన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్ ఎక్కడ ఇవ్వాలని బీఎల్‌వోలు వారికి ఫోన్ చేస్తున్నారు. దానికి ఆ ఆ ఓటర్లు తమకు వీలైనప్పుడు వచ్చి వాటిని తీసుకుంటామని చెబుతున్నారు.
తొలిరోజు సమస్యల నడుమ సర్ సర్వే ప్రారంభం - పలుచోట్ల పనిచేయని మొబైల్ యాప్‌లు
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం - బీఎల్‌వోలు ఇంటికి రాకుంటే కాల్ చేయాలని ఈసీ సూచన

