ETV Bharat / state

నేటి తరానికి ఆధునిక టెక్నాలజీతో బోధన - కృషికి గుర్తింపుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

సాంకేతికతను జోడించి వినూత్న పద్ధతుల్లో పాఠాలు - వివిధ పుస్తకాలు, టూల్స్‌ రూపొందించిన రాజేష్‌ - హలో ధృతి పేరుతో యాప్‌ రూపొందించిన రాజేష్‌ఇప్పటివరకు 2 లక్షల మంది టీచర్లకు ఐసీటీ టూల్స్

Vizianagaram Government School Teacher Rajesh Got National Award
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న రాజేష్‌ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 29, 2026 at 1:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vizianagaram Government School Teacher Rajesh Got National Award: ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తాతయ్య స్ఫూర్తితో ఉపాధ్యాయుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు. బోధనకు ఆధునిక టెక్నాలజీ జోడించి నేటి తరానికి వినూత్న పద్ధతుల్లో బోధిస్తున్నారు. కరోనా సమయంలోనూ లక్షలాది మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాడు. ఆ కృషికి గానూ ఆయనను భారత ప్రభుత్వం జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారానికి ఎంపిక చేసింది. ఇంతకీ ఎవరా ఉపాధ్యాయుడు? అతడి బోధనా పద్ధతుల ప్రత్యేకతలేంటి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

చాక్‌పీస్‌ పట్టుకుని బోర్డుపై అక్షరాలు రాస్తూ పాఠాలు బోధించే పద్ధతులకు కాలం చెల్లుతోంది. అందుకు ఉదాహరణ విజయనగరం జిల్లా ధర్మవరంనకు చెందిన రాజేశ్‌ మాస్టారు. సాధారణ ప్రభుత్వ పాఠశాలలో చదివి, తాతయ్య కోరిక మేరకు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. అయితే అందరిలా కాకుండా బోధనకు సాంకేతిక హంగులద్దుతూ జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. కష్టపడే తత్వముంటే ప్రభుత్వ బడుల్లో చదివిన వారైనా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని నిరూపిస్తున్నారు.

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి , ఇప్పుడు హెచ్​ఎం - జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (ETV Bharat)

రాజేశ్‌ మాస్టార్‌ టెన్త్‌ వరకు ప్రభుత్వ బడుల్లోనే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ ఓపెన్ క్యాటగిరీలో ర్యాంక్ సాధించి గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2008లో డీఎస్సీ రాసి, 2010లో విజయనగరంలోని తాండ్రంగిలో తొలిసారి ఉపాధ్యాయుడిగా పోస్టింగ్ అందుకున్నారు. అలా 5 విభిన్న పాఠశాలల్లో సేవలు అందిస్తూ ప్రస్తుతం చనుమల్లుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

బోధన, సాధనలకు పుస్తకాలు: పిల్లలకు చదువు భారంగా మారకూడదని భావించిన రాజేశ్ మాస్టారు, బోధనలో వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడేలా ఆయన స్వయంగా కొన్ని అద్భుతమైన పుస్తకాలను రాశారు. ఆర్ట్‌ బేస్డ్‌ టీచింగ్‌ స్ట్రాటజీస్‌ నేర్చుకునేందుకు 'ఆమోద' పుస్తకం, క్రియేటివ్‌ ఇంగ్లీష్‌ బోధనా పద్ధతుల కోసం 'తరంగ్‌' అనే పుస్తకం, విద్యార్థులకు ఇంగ్లీష్‌ వర్క్‌బుక్‌గా 'యాక్టివేట్‌' పుస్తకం, 1,2 తరగతుల విద్యార్థులు తెలుగు భాషపై పట్టు సాధించేందుకు తెలుగు సాధనా పుస్తకం రాశారు. కరోనా సంక్షోభ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల ద్వారా ఏకంగా లక్షా 80 వేల మంది విద్యార్థులకు పాఠాలు బోధించారు రాజేశ్‌ మాస్టార్‌. అంతేకాదు ఇప్పటివరకు 2 లక్షల మంది టీచర్లలకు ఐసీటీ టూల్స్, ఇంగ్లీష్ స్ట్రాటజీస్, దీక్ష యాప్ వినియోగంపై శిక్షణనిచ్చారు.

'నేటి డిజిటల్ యుగానికి తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో రాజేశ్ మాస్టారు ముందంజలో ఉన్నారు. ప్రాథమిక స్థాయిలో భాష, గణిత సామర్థ్యాలను పెంచే ఎఫ్​ఎల్​ఎన్​ (Foundational Literacy & Numeracy) లక్ష్యాల కోసం 'హలో ధృతి' యాప్‌ రూపొందించారు. నవోదయ, సైనిక స్కూల్స్ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే 22 వేల మంది విద్యార్థులకు ప్రత్యేక వాట్సాప్ ఆటోమేషన్ ద్వారా శిక్షణ అందించారు.' -తోటి ఉపాధ్యాయురాలు

కష్టపడేతత్వమే నిలబెడుతుంది: ఈ విజయాల వెనుక ఆయన భార్య, ఉపాధ్యాయురాలైన వసుంధర ప్రోత్సాహం ఎంతో ఉంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే, భర్త కొత్త ఆలోచనలకు ఆమె నిత్యం వెన్నుదన్నుగా నిలిచారు. రాజేశ్ మాస్టార్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రావడం పట్ల తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బోధనా విధానాన్ని తాము కూడా అనుసరిస్తున్నామని గర్వంగా చెబుతున్నారు. భవిష్యత్తులో మరింత వినూత్న సాంకేతికతను జోడించి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మెరుగైన బోధనా పద్ధతులను అందిస్తానని రాజేశ్ మాస్టారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడే తత్వం ఉంటే ప్రభుత్వ బడుల్లో చదివిన వారైనా జాతీయ స్థాయిలో శిఖరాగ్రానికి చేరవచ్చని నిరూపిస్తున్నాడీ మాస్టార్‌.

బడికి రాని ఉపాధ్యాయులు - గిరిజన బిడ్డల కోసం టీచర్‌గా మారిన మహిళ

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రకటన - తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి దక్కిన అరుదైన గౌరవం