అక్కడ రూ.2లక్షలు - ఇక్కడ రూ.999కే - మామిడి మేళాలో ప్రత్యేక ఆకర్షణ మియాజాకీ
బీచ్‌రోడ్డులో మామిడి వైభవం - ఒక్కచోట 40 రకాల సేంద్రియ పండ్లు - సేంద్రియ మామిడితో ఆరోగ్యానికి భరోసా అంటున్న వైద్యులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2026 at 12:08 PM IST
Vizag Organic Mango Miyazaki 999 Rupees: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని బీజేపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సేంద్రియ మామిడి పండ్ల మేళా విశాఖ నగరవాసులను ఆకట్టుకుంటోంది. ఈ మేళాలో దాదాపు 40 రకాల మామిడి పండ్లను విక్రయానికి ఉంచారు. ప్రత్యేకించి మియాజాకీ, ఇమామ్ పసంద్, మల్లిక, అమృతం, కేసరి, స్వాగతం, చిలుకలు మామిడి, కొబ్బరి మామిడి, పలుకులు, బంగినపల్లి, సువర్ణరేఖ, దసేరీ, రసాలు రకాలకు సందర్శకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
విదేశాల్లో రూ.2లక్షలు - ఇక్కడ రూ.999: ‘మామిడిలో అత్యుత్తమ జాతి మియాజాకీ. ఇది మూలంగా జపాన్ విత్తనం. చాలా అరుదు. మన రాష్ట్రంలో ఈ విత్తనాన్ని అభివృద్ధి చేసి ఉత్తరాంధ్రలో సాగు చేస్తున్నాం. విదేశాల్లో కిలో రూ.2లక్షలకు పైగా ధర పలుకుతున్న ఈ రకాన్ని ఇక్కడ రూ.999కే అందిస్తున్నాం. చంపావతి, గోస్తని, బహుదా నదీ పరీవాహక ప్రాంతాలు ఈ పంటకు అనువుగా ఉన్నాయి. అందుకే ఎస్.కోట, గజపతినగరం, ఇచ్ఛాపురం ప్రాంతాల్లోని నాలుగు ప్లాంట్లలో సాగు చేస్తున్నాం. ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పించాం’ అని మియాజాకీ ఉత్పత్తుల మేనేజర్ సీహెచ్ దివ్య వివరించారు.
చూడటానికి సాధారణం - తింటే అమృతం: ఉత్తరాంధ్రలో పూర్తిగా సేంద్రియ విధానంలో పండించిన అన్ని మామిడి రకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యకరమైన పండ్లను నగర ప్రజలకు చేర్చడమే మా ఉద్దేశమని ఆయన అన్నారు. వచ్చే శని, ఆదివారాల్లో మరిన్ని కొత్త రకాలు తీసుకొస్తామన్నారు. బయట మార్కెట్‌లో రసాయనాలతో మగ్గించిన పండ్ల రంగు చూసి మోసపోవద్దని సూచిస్తున్నారు. మా పండ్లు చూడటానికి సాధారణంగా ఉన్నా రుచిలో అద్భుతంగా ఉంటాయని మామిడి పండ్ల నిపుణుడు అప్పాజీ చెప్పారు.
వేపగుంట, గాజువాక సంతల్లోనూ: రసాయనాలతో పండిన మామిడి తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని వ్యవసాయదారుడు ఎస్. సత్యనారాయణ వివరించారు. అందుకే ఎస్.కోట ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మామిడి తోటలు పెంచుతున్నామన్నారు. వేపగుంట, గాజువాక వీకెండ్ సంతల్లోనూ ఈ సేంద్రియ మామిడి పండ్లను విక్రయిస్తున్నామని గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుడు ఎస్.సత్యనారాయణ తెలిపారు.
కాయలు కోసి పండ్లుగా మార్చి - ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్న వ్యాపారులు
అనారోగ్యం కొని తెచ్చుకోకండి! - కల్తీ మామిడి పండ్లను ఇలా గుర్తించండి!

