విశాఖలో నేటి నుంచి 'లైట్‌హౌస్ ఫెస్టివల్' - రెండు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు
1957 జూన్ 15న డాల్ఫినోస్ లైట్‌హౌస్ ప్రారంభం - రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు సందర్శకులకు అనుమతి - ఏటా జనవరి 26, ఆగస్టు 15న ఉచిత ప్రవేశాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 9, 2026 at 10:01 AM IST
Vizag Lighthouse Festival 2026 : నౌకాయానానికి లైట్‌హౌస్ (దీపపు స్తంభం) దిక్సూచిగా నిలుస్తోంది. విశాఖపట్నం వైభవాన్ని చాటిచెప్పే విధంగా కేంద్ర నౌకాశ్రయాలు (పోర్టులు), నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు, రేపు విశాఖలో ‘లైట్‌హౌస్ ఫెస్టివల్-3.0’ 2026ను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు బీచ్‌రోడ్డులోని ఎంజీఎం పార్కు ముస్తాబవుతోంది. భారతదేశపు సముద్ర వారసత్వాన్ని ప్రజల చెంతకు తీసుకొచ్చేలా ఇప్పటికే పూరీలో 2023, గోవా తీరాల్లో 2024లో ఈ ఉత్సవాలు నిర్వహించారు.
రెండు రోజుల పాటు ఉత్సవాలు : బీచ్‌రోడ్డులో ఉన్న ఎంజీఎం పార్కులో రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, సముద్ర యానం, దీపపు స్తంభం ప్రాధాన్యంపై సందర్శకులకు వివరిస్తారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సందర్శకులకు అనుమతి :
- డాల్ఫినోస్‌పై ఉన్న లైట్‌హౌస్‌ను 1957వ సంవత్సరం జూన్ 15న ప్రారంభించారు. విశాఖ పోర్టుకు వచ్చే నౌకలకు 32 నాటికల్ మైళ్ల దూరం నుంచే ఈ లైట్‌హౌస్ దారి చూపుతుంది.
- రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వచ్చే సందర్శకులకు ప్రవేశం కల్పిస్తారు. సందర్శించడానికి పెద్దలకు రూ.10, పిల్లలకు రూ.3 ప్రవేశ రుసుము ఉంటుంది.
- ఏటా జనవరి 26, ఆగస్టు 15న ఉచిత ప్రవేశాలు కల్పిస్తారు. సందర్శకులు ఆధార్‌కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ప్రస్తుతం మరమ్మతులు చేస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా సందర్శకులను అనుమతిని నిలిపివేశారు.
అప్పట్లో 4, ఇప్పుడు 1 : విశాఖ పోర్టు ఏరియాలో ఒకప్పుడు నాలుగు లైట్‌హౌస్‌లు ఉండేవి. కాల క్రమంలో ఎంజీఎం పార్కు, సెయింట్ అలోసిస్ పాఠశాల, భీమిలి వద్ద ఉన్న లైట్‌హౌస్‌లు శిథిలమవడంతో మళ్లీ వాటిని పునరుద్ధరించలేదు. సెయింట్ అలోసిస్ వద్ద ఉన్న దీపపు స్తంభాన్ని ప్రస్తుతం సందర్శకుల కోసం మ్యూజియంగా మార్చారు. ప్రస్తుతం డాల్ఫినోస్‌పై ఉన్న లైట్‌హౌస్ ఒక్కటి మాత్రమే నౌకాయానానికి సేవలు అందిస్తుంది.
లైట్‌హౌస్‌కు ఘన చరిత్ర : విశాఖపట్నం ఆర్కే బీచ్ వుడాపార్కు తీరాన ఉన్న ఈ లైట్‌హౌస్‌కు ఘన చరిత్ర ఉంది. 1903లో బ్రిటిషువారి హయాంలో సముద్రంలో వచ్చే నౌకలకు దారి చూపేందుకు దీనిని నిర్మించారు. దీని ఎత్తు సుమారు 52 అడుగులు ఉంటుంది. 19 కిలోమీటర్ల దూరంలోని నౌకలు నేరుగా ఒడ్డుకు రాకుండా మలుపు తిరిగి ఓడరేవుకు సురక్షితంగా చేరుకొనేలా ఈ లైట్‌హౌస్ దారి చూపేది. తర్వాత అత్యాధునిక రాడార్లు, జీపీఎస్ సాంకేతిక విధానాలు అందుబాటులోకి రావడంతో 2015 నుంచి ఈ లైట్‌హౌస్‌ను నౌకాయానానికి ఉపయోగించడం లేదు. అనంతరం దీనిని పర్యాటక ప్రాంతంగా మార్చారు. నిత్యం వందలాది మంది పర్యాటకులు ఈ లైట్‌హౌస్‌కు వస్తున్నారు. అయితే పలువురు దీనిపైకెక్కి సాహసాలు చేయడంతోపాటు ప్రేమ విఫలమైందని దూకడం, మద్యం తాగడం వంటి ఘటనలకు పాల్పడేవారు. అదే విధంగా పెచ్చులూడి శిథిలావస్థకు కూడా చేరుకోవడంతో 2024లో దీనిని మూసేశారు. 120 ఏళ్లలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఇప్పటికీ ఈ లైట్‌హౌస్ స్థిరంగా నిలిచి ఉంది. విశాఖకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఈ లైట్‌హౌస్‌కు మరమ్మతులు చేపట్టి దీనిని సంరక్షించాలని, దీనికి పూర్వ వైభవాన్ని తీసుకొని రావాలని పర్యాటకులు కోరుతున్నారు.
రెయిన్ అలర్ట్ : బలపడిన వాయుగుండం - నేడు తుపానుగా మారే అవకాశం
ఏపీలో ఎగిరే టాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ - ఇక ట్రాఫిక్ సమస్యకు చెక్

