వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల సుపారీ ఇస్తామన్నది ఎవరు? - రంగంలోకి ఈడీ
మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తింపు కేసు నమోదు - కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సహా నిందితుల నివాసాల్లో సోదాలు- కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం- అవినాష్‌రెడ్డి ఇంట్లో లెక్కల్లో చూపని రూ.24 లక్షలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 22, 2026 at 7:27 AM IST
ED Raids on MP Avinash Reddy : వివేకా హత్య కోసం కీలక కుట్రదారులు వెచ్చించాలని నిర్ణయించుకున్న రూ.40 కోట్లు వారు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనుకున్నారు? అంత భారీ మొత్తం వారికి ఇచ్చేందుకు తెర వెనుక సిద్ధమైన వ్యక్తులెవరు? హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురు నిందితులకు అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణాల్లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసులో కీలక కుట్రదారులు, నిందితులు, అనుమానితులు, తెరవెనక సూత్రధారులు వివేకా హత్యకు కొన్ని నెలల ముందు, తర్వాత నిర్వహించిన ఆర్థిక లావాదేవీల్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ డబ్బు ఎవరి నుంచి ఎవరికి, ఏయే మార్గాల్లో రూటింగ్ అయ్యింది, దీనికి మూలం ఎక్కడుందనే కోణంలో వివరాలు సేకరిస్తోంది. ఈ క్రమంలోనే నిందితులైన అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి, సునీల్‌యాదవ్, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిల నివాసాల్లో సోదాలు చేసి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకుంది.
హత్య వెనక రాజకీయ నాయకులు: వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15 అర్ధరాత్రి తర్వాత పులివెందులలోని ఆయన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఫిబ్రవరి 10న ఎర్ర గంగిరెడ్డి నివాసంలోనే కుట్ర రూపొందించినట్లు సీబీఐ దర్యాప్తులో తేల్చింది. వివేకానందరెడ్డిని చంపేయ్ ఈ హత్య చేస్తే నీ జీవితం సెటిలైపోతుంది. నువ్వు ఒక్కడివే కాదు. మేమూ నీతో వస్తామని ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పారని కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు.
హత్య వెనక వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి వంటి పెద్ద రాజకీయ నాయకులున్నారని, హత్య చేస్తే శివశంకరరెడ్డి రూ.40 కోట్లు ఇస్తారని, అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తానని కూడా ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడు. వివేకానందరెడ్డిని చంపాలని ఎర్ర గంగిరెడ్డి చెప్పిన రెండు, మూడు రోజుల తర్వాత సునీల్ యాదవ్ కోటి నగదు తీసుకెళ్లి దస్తగిరికి అడ్వాన్స్‌గా ఇచ్చాడని సీబీఐ అభియోగపత్రంలో పేర్కొంది.
ఇంత డబ్బు ఎక్కడిదని దస్తగిరి ప్రశ్నించగా వివేకా హత్య కోసం ఎర్ర గంగిరెడ్డికి శివశంకరరెడ్డి ఇవ్వగా ఆయన తనకు ఇచ్చారంటూ సునీల్ సమాధానమిచ్చారని అని కూడా అభియోగపత్రాల్లో స్పష్టం చేసింది. దస్తగిరికి అడ్వాన్స్‌గా ఇచ్చిన కోటిలో నుంచి రూ.25 లక్షలు సునీల్ యాదవ్ అప్పు తీసుకున్నాడని, మిగతా రూ.75 లక్షలను దస్తగిరి తన స్నేహితుడైన సయ్యద్ మున్నా దగ్గర ఉంచినట్లు సీబీఐ తేల్చింది. అందులో రూ.46.70 లక్షల నగదు, లెక్కల్లో చూపని బంగారు ఆభరణాలను సయ్యద్ మున్నా, అతని తల్లి పేరిట ఉన్న లాకర్ల నుంచి గతంలోనే సీబీఐ స్వాధీనం చేసుకుంది.
ఎంపీ అవినాష్‌రెడ్డి సహా నిందితుల నివాసాల్లో సోదాలు: వివేకానందరెడ్డి వైఎస్సార్సీపీలో చేరటం వల్ల తమ రాజకీయ ప్రాబల్యానికి అడ్డుకట్ట పడుతుందనే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, వారి ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డిలు వివేకాను అంతమొందించాలనుకున్నారని సీబీఐ అభియోగపత్రాల్లో పేర్కొన్నట్లు ఈడీ తెలిపింది. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్‌తో కలిసి కుట్ర పన్నారని అందులో భాగంగానే డబ్బులు చెల్లించారని అభియోగపత్రాల్లో తెలిపినట్లు వెల్లడించింది.
సీబీఐ ఎఫ్‌ఐఆర్, అభియోగపత్రాల ఆధారంగా కేసు పెట్టిన ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌తో పాటు కడప జిల్లాలోని నిందితుల నివాసాల్లో మొత్తం 7 చోట్ల ఈడీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సంబంధించి హైదరాబాద్ కోకాపేట గోల్డెన్‌మైన్ రోడ్డులోని ఓపెన్‌స్కై స్పేస్ అపార్ట్‌మెంట్‌లోని నివాసంలోనూ, పులివెందుల్లోని ఇంట్లోనూ తనిఖీలు చేశాయి.
పులివెందులలో అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి, యాదటి సునీల్ యాదవ్, షేక్ దస్తగిరి, తొండూరు మండలం టి.తుమ్మలపల్లెలో ఎర్ర గంగిరెడ్డి నివాసాల్లోనూ సోదాలు నిర్వహించాయి. అవినాష్‌రెడ్డి నివాసం నుంచి లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదు, 2 బ్యాంకు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుల నివాసాల నుంచి పలు కీలకపత్రాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.
రూ.20 కోట్లు అడ్వాన్సుగా: వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం కడప నుంచి పులివెందులకు పిలిపించి, రెండు గంటల పాటు విచారించారు. వైద్య శిబిరం నిర్వహణ పేరిట 2023 నవంబరు 28న కడప కేంద్ర కారాగారానికి వెళ్లిన చైతన్యరెడ్డి, అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరిని బెదిరించారంటూ గతంలోనే కేసు నమోదైంది. తాను చెప్పినట్లు సీబీఐ అధికారులకు వాంగ్మూలమిచ్చి సహకరిస్తే రూ.20 కోట్లు అడ్వాన్సుగా ఇస్తామని లేదంటే జైలు నుంచి బయటకొచ్చాక నీ అంతు చూస్తానని దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించారనే ఆరోపణలున్నాయి. దీనిపైనే చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. పులివెందులలో అవినాష్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిపినప్పుడు ఆయన లేరు. అవినాష్ చిన్నాన్న వైఎస్ మనోహర్‌రెడ్డి ఇంటి తాళాలు తీశారు. ఈడీ అధికారులు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాల గురించి మనోహర్‌రెడ్డిని ప్రశ్నించారు.
విశ్లేషణ పూరయితే అసలు గుట్టు వీడే అవకాశం: వివేకాను హత్య చేస్తే శివశంకరరెడ్డి రూ.40 కోట్లు ఇస్తారని, అందులో రూ.5 కోట్లు నీకు వాటాగా ఇస్తాను అంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలమిచ్చినట్లు సీబీఐ అభియోగపత్రాల్లో పేర్కొంది. రూ.40 కోట్లు చెల్లించే ఆర్థిక స్థితి శివశంకరరెడ్డికి ఉందా? లేకపోతే అంత పెద్ద మొత్తం ఇస్తానని ఆయనకు భరోసా ఇచ్చిన తెర వెనక పెద్దలెవరు అనే కోణాల్లో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే కొంత ప్రాథమిక సమాచారం సేకరించింది. వాటి విశ్లేషణ పూర్తయితే అసలు గుట్టు వీడే అవకాశముంది. దస్తగిరికి చెల్లించిన అడ్వాన్సులో కొంత మొత్తాన్ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మిగతా ముగ్గురు నిందితులకు చెల్లించిన అడ్వాన్సు సొమ్ము ఏమైందనే కోణంలో ఈడీ ఆరా తీస్తోంది.
వివేకా హత్య కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: వైఎస్ సునీత
నా తండ్రి వివేకా హత్య కేసులో సీబీఐ లోతుగా విచారణ జరపలేదు: వైఎస్ సునీత

