ETV Bharat / state

విశాఖ వేదికగా ప్రతిష్ఠాత్మక 'బ్రిక్స్‌' సదస్సు - హాజరుకానున్న సీఎం చంద్రబాబు

విశాఖలో బ్రిక్స్‌ దేశాల సదస్సుకు రంగం సిద్ధం - ఈ నెల 22, 23న బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాలు - హాజరుకానున్న బ్రిక్స్‌ దేశాల మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు

BRICS meeting Visakhapatnam 2026
BRICS meeting Visakhapatnam 2026 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 20, 2026 at 9:41 AM IST

2 Min Read
Choose ETV Bharat

BRICS meeting Visakhapatnam 2026 : అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు విశాఖపట్నం వేదిక కాబోతోంది. ఈ నెల 22, 23 తేదీల్లో నగరంలో బ్రిక్స్‌ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం నగర యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు రానుండటంతో నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.

11 దేశాల నుంచి ప్రతినిధుల రాక : ఈ అంతర్జాతీయ సదస్సుకు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాలతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఇండోనేసియా దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. మొత్తం 11 దేశాల నుంచి ఐదుగురు మంత్రులు, 50 మంది ఉన్నత స్థాయి అధికారులు విశాఖ రానున్నారు. వీరంతా గురువారం నుంచే నగరానికి చేరుకోనున్నారు.

క్రీడలు, యువత భవితపై కీలక చర్చలు : ఈ ప్రతిష్ఠాత్మక బ్రిక్స్‌ సదస్సులో సభ్య దేశాలు పలు కీలక అంశాలపై చర్చించనున్నాయి. ప్రధానంగా యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, కొత్త ఆవిష్కరణలు, సాధికారత తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరపనున్నారు. వీటితో పాటు క్రీడాభివృద్ధి, క్రీడా రంగంలో సాంకేతికత వాడకం, క్రీడా పరిశ్రమ, సామర్థ్య నిర్మాణంపై సమాలోచనలు చేస్తారు. ముఖ్యంగా అంతరించిపోతున్న సంప్రదాయ, స్వదేశీ క్రీడల పరిరక్షణకు ఉమ్మడిగా తీసుకోవాల్సిన చర్యలపై సభ్య దేశాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఆకట్టుకోనున్న సైకిల్ ర్యాలీ : ఈ సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హాజరుకానున్నారు. ఈ ఈవెంట్​ను పురస్కరించుకుని నగరంలో పలు ఆకర్షణీయమైన కార్యక్రమాలను పర్యాటక శాఖ ప్లాన్ చేసింది. ముఖ్యంగా విశాఖలోని చారిత్రక బౌద్ధారామ ప్రాంతమైన తొట్లకొండలో బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పర్యావరణహిత కార్యక్రమంతో పాటు పర్యాటకులను ఆకట్టుకునే ఆర్కే బీచ్‌ రోడ్డులో 'బ్రిక్స్ ఫ్రెండ్‌షిప్ సైకిల్ ర్యాలీ'ని నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఉత్సాహంగా సుమారు 5 కిలోమీటర్ల మేర సాగనుంది.

ముమ్మరంగా ఏర్పాట్ల పరిశీలన : విశాఖలో అడుగుపెట్టనున్న అంతర్జాతీయ ప్రతినిధులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్, తొట్లకొండ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను విశాఖ జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్ స్వయంగా పర్యవేక్షించారు. భద్రత, రవాణా, వసతి, ఆహార విషయాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సదస్సును విజయవంతం చేసి విశాఖ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించేలా అధికారులు కృషి చేస్తున్నారు.

బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం

''బ్రిక్స్‌ సహకారం'తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం'