కిడ్నీ మార్పిడి పేరుతో మోసం - 33 కేసులున్న నకిలీ డాక్టర్ అరెస్ట్
రూ.లక్ష ఇస్తే కిడ్నీ ఆపరేషన్ చేస్తామని మోసం - డబ్బు అందిన వెంటనే ఫోన్ స్విచాఫ్ - నిందితుడు ఇమంది జ్యోతి శివశ్రీపై వివిధ పీఎస్‌ల్లో 33 కేసులు ఉన్నాయన్న విశాఖ డీసీపీ మణికంఠ

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 26, 2025 at 10:16 PM IST
Fake Doctor Arrested in Kidney Transplant Scam in AP : కిడ్నీ మార్పిడి పేరుతో మోసానికి పాల్పడిన నకిలీ వైద్యుడిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో కిడ్నీ అవసరమైన వారి నుంచి రూ.లక్ష తీసుకుని విజయవాడకు పరారైన నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేసినట్టు విశాఖ డీసీపీ మణికంఠ తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు.
ఇమంది జ్యోతి శివశ్రీ తనను తాను డాక్టర్ ప్రవీణ్‌గా పరిచయం చేసుకుని కిడ్నీ ఇప్పిస్తానని మభ్యపెట్టి డబ్బులు కాజేసినట్టు విశాఖ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిందన్నారు. శ్రీకాకుళానికి చెందిన రామ్ జీ కుమారుడికి కిడ్నీ అవసరం కావడంతో పత్రికా ప్రకటన వేశారు. ఇదే అదునుగా భావించిన జ్యోతి శివశ్రీ తనను డాక్టర్‌గా పరిచయం చేసుకున్నారు. కేజీహెచ్‌లో తాను పని చేస్తున్నానని, ఆసుపత్రికి రావాలని నమ్మబలికాడు. అక్కడే డబ్బులు తీసుకుని మాయమాటలు చెప్పి ఉడాయించాడు.
33 కేసుల్లో తప్పించుకుని తిరుగుతూ : నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 33 కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. ఆయా కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నా కోర్టు విచారణకు రావడం లేదన్నారు. ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులు ఇమంది జ్యోతి శివశ్రీని అరెస్టు చేశామని వెల్లడించారు. 2004లో ద్విచక్ర వాహనం చోరీ ఘటనలో శివశ్రీపై తొలి కేసు నమోదైంది. బైక్‌లు, సెల్‌ఫోన్ల చోరీలు కార్ల అమ్మకాల మధ్యవర్తిత్వంలో మోసాలు వంటి పలు నేరాల్లో నిందితుడు ఆరి తేరాడని డీసీపీ వివరించారు. అన్ని కేసుల సమాచారం తెప్పించి నిందితుడికి కఠిన శిక్షపడేలా చూస్తామని విశాఖ డీసీపీ మణికంఠ స్పష్టం చేశారు.
" శ్రీకాకుళంకు చెందిన దూసి రామ్‌జీ తనయుడికి కిడ్నీ అవసరం అయ్యింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో దాతలు ఎవరైనా ఉంటే తెలియజేయమని పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలో అతని భార్య ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ అబ్బాయికి ఉచితంగా కిడ్నీ మార్పిడి చేస్తాము, విశాఖ కేజీఎహెచ్‌కు రండి అని చెప్పారు. అనంతరం అతడు డాక్టర్ ప్రవీణ్ అనే పేరుతో పరిచయం చేసుకున్నాడు. తరువాత ఫైల్స్ అన్ని పరిశీలించి లక్ష రుపాయలు తీసుకువస్తే కిడ్నీ మార్పిడి చేస్తాం అన్నాడు.
అది నమ్మిన దూసి రామ్‌జీ అడిగిన డబ్బులు తెచ్చాడు. అనంతరం కిడ్నీ మార్పిడి పేరుతో నిందితుడు లక్ష తీసుకుని పత్తా లేకుండా పోయాడు. తరువాత విచారిస్తే అతనొక దొంగ డాక్టర్ అని తెలింది. దీనిపై రామ్‌జీ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారిస్తే నిందితుడు ఇమంది జ్యోతి శివశ్రీపై వివిధ పీఎస్‌ల్లో 33 కేసులు నమోదయ్యాయని తెలిసింది. కార్లు, బైకులు, ఫోన్ల చోరీ కేసులు, సెటిల్‌మెంట్ల ఫిర్యాదులు ఉన్నాయి. ఎట్టకేలకు నిందితుడ్ని విజయవాడలో అరెస్ట్ చేశాం." - చందోలు మణికంఠ, విశాఖ డీసీపీ
10ఏళ్లకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్- కట్‌చేస్తే 13ఏళ్లకే 2 గోల్డ్ మెడల్స్- ఔరా ఇషాన్!
మనవడి కోసం ప్రాణం పణంగా పెట్టిన బామ్మ- 70ఏళ్ల వయసులో కిడ్నీ దానం - KIDNEY TRANSPLANT

