ఈ హెల్మెట్ భలే స్మార్ట్ గురు! - విష వాయులను స్వచ్ఛ వాయువులుగా మార్చేస్తుంది
విశాఖ నాస్కామ్ అంకుర కేంద్రం యువత ప్రతిభ - ఎయిర్ క్వాలిటీ మానిటర్, హెల్మెట్‌ను రూపొందించిన ఐఐఎం విద్యార్థులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 28, 2025 at 3:46 PM IST
Air Quality Monitor Designed By IIM Students in Visakha: ఒకరు తమ మేధాశక్తిని ఉపయోగిస్తే ఎన్నో ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. అదే ఓ నలుగురి ఆలోచనలు ఒక్కటైతే సమాజానికి ఉపయోగపడే మరెన్నో ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయనడంలో అతిశయోక్తి లేదు. నగరాలు, పట్టణాల్లో కాలుష్యం పెరిగిపోతోంది. ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయి.
అవి వాహనచోదకుల ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తున్నాయి. దీనికి ఏయూ నాస్కామ్ సెంటర్‌లోని అంకుర కేంద్రం యువత కొన్ని పరిష్కార మార్గాలను కొనుగొన్నారు. వారి సృజనాత్మక ఆలోచనల నుంచి ఎయిర్ క్వాలిటీ మానిటర్, సేఫ్ గార్డ్ ఎక్స్ హెల్మెట్ పరికరాలు పుట్టుకొచ్చాయి.
గాలి నాణ్యత తెలుసుకునేలా: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం ప్రాంతానికి చెందిన లక్ష్మీసాయి ప్రవీణ్ కుమార్ పంచకర్ల విశాఖ ఐఐఎంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వాతావరణంలో గాలి నాణ్యతను సులువుగా తెలుసుకొనేలా పరికరాలను ఆవిష్కరించాలనే ఆలోచన వచ్చింది. ఏయూలోని నాస్కామ్ కేంద్రం పోత్సాహాన్ని అందించింది. తద్వారా అంకుర కేంద్రం రూపుదాల్చింది. మొత్తం ఏడాది కాలం పాటు శ్రమించి ఎయిర్ క్వాలిటీ మోనిటర్, సేఫ్ గార్డ్ ఎక్స్ హెల్మెట్ ప్రొటోటైప్‌లను తయారు చేశారు.
పరికరం పనిచేస్తుందిలా! : ఎయిర్ క్వాలిటీ మానిటర్‌ను కారులో ఏర్పాటు చేసుకుంటే రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు వాటిలోని సెన్సార్లు గాలిలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్, తదితర హానికర వాయువులు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తాయి. ఫిటర్లు ఆయా వాయువులను శోషించుకుని గాలిని శుద్ధి చేస్తాయి.
సేఫ్‌గార్డ్ ఎక్స్ హెల్మెట్ నాలుగు దశల ఫిల్ట్రేషన్ విధానంలో పనిచేస్తుంది. ఇందులో ప్రీ, కార్బన్, హెపా ఫిల్టర్లు, యూవీ ఛాంబర్ ఉంటాయి. ఫిల్టర్లు గాలిలోని విషవాయులను శోషించగా, యూవీ ఛాంబర్ అల్ట్రా వైలెట్ కిరణాల ద్వారా వైరస్‌లు, ఇతర సూక్ష్మజీవులను పూర్తిగా నిర్వర్యం చేస్తాయి.
ఆవిష్కరణలను మెచ్చిన ప్రభుత్వం: అంకుర కేంద్రం ఏర్పాటులో సింధు చిన్నాల, రమ్య ముత్యాల, శివజ్యోతి భాగస్వాములుగా ఉన్నారు. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో రవి ఈశ్వరపు దీనికి సహకారాన్ని అందించారు. ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ ఆవిష్కరణలను ప్రభుత్వం మెచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమి, విద్యుత్తు, నీరు ఇవ్వడానికి ప్రభుత్వం, అలాగే అవసరమైన నిధులు సమకూర్చడానికి ‘సిడ్బీ’ బ్యాంకు ముందుకొచ్చాయని విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు.
మరికొన్ని ఆవిష్కరణలు: ఇంజినీరింగ్ విద్య అంటేనే సమాజానికి, మానవ గమనానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడం. విద్యార్థి దశ నుంచే ఆ దిశగా ఆలోచనలు చేస్తే భవిష్యత్ తరాలకు మేలు చేసే ఎన్నో ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. విజయవాడ పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్ కళాశాల ఆ తరహా ప్రయత్నమే చేసింది. కాలేజీ నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాకథాన్‌లో మొత్తం 12 రాష్ట్రాల నుంచి దాదాపు 1900 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజానికి ఉపయోగపడే వందలాది ప్రాజెక్టులు ప్రదర్శించారు.
ప్రస్తుతం అందరినీ పట్టి పీడిస్తున్నది ట్రాఫిక్. ఉదయం లేచింది మొదలు ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలంటూ రోజంతా పరుగులు పెడుతూనే ఉంటాం. ఈ తరుణంలో ట్రాఫిక్ జామ్ వల్ల గంటల తరబడి సమయం వృథా అవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఏఐ ఆధారిత డ్రోన్‌ను రూపొందించారు కేబీఎన్ కళాశాల విద్యార్థి బృందం.
ఈ ప్రాజెక్టు ముఖ్యంగా ట్రాఫిక్‌ను రియల్‌టైమ్‌లో దాదాపు 30 కిలోమీటర్ల వరకు మానిటరింగ్ చేస్తుంది. అకస్మాతుగా జరిగిన ప్రమాదాలను గుర్తించడంతో పాటు ట్రాఫిక్ రద్దీని సైతం పసిగట్టే సమాచారాన్ని అందిస్తుంది. హెల్మెట్ ధరించని వెహికల్స్‌ను గుర్తించి ఆటోమేటిక్‌గా చలానా విధిస్తుంది. దీనిపై మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని కళాశాల ప్రిన్స్‌పల్ డా. శరవణ కుమార్ స్పష్టం చేశారు.
12 రాష్ట్రాల నుంచి 1900 మంది - ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్న విద్యార్థులు
ఐదేళ్లలో 20 వేల అంకుర పరిశ్రమలు - లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం: RTIH సీఈవో ధాత్రిరెడ్డి

