ETV Bharat / state

ఏపీలో సచివాలయాల పేర్లు మార్పు - స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా నామకరణం

గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు - స్వర్ణ గ్రామం, వార్డుగా మారనున్న గ్రామ, వార్డు సచివాలయాలు - చట్టసవరణకు ఆర్డినెన్స్‌ జారీకి అనుమతి - అమరావతి అభివృద్ధికి రూ.7,387 కోట్ల నాబార్డు రుణం

AP Cabinet Takes Key Decisions
AP Cabinet Takes Key Decisions (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 7:52 AM IST

3 Min Read
Choose ETV Bharat

AP Cabinet Takes Key Decisions: గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారనున్నాయి. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అమరావతి అభివృద్ధి పనుల కోసం రూ.7,387 కోట్ల నాబార్డు రుణాన్ని తీసుకోవడానికి అంగీకరించింది. అందుకుగాను రూ.137 కోట్లతో అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ సహా ఎస్సీల రుణాలపై రూ.41.61 కోట్ల వడ్డీ మాఫీకి తీర్మానించింది.

ఆర్డినెన్స్‌ జారీకి అనుమతి: సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 25 అంశాలకు ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ ఆర్డినెన్స్‌ ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషించనున్నాయని ఇందుకుగాను కార్యనిర్వాహకుల పాత్రలు, బాధ్యతలు సవరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అందుకే సచివాలయాల పేరు మారుస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు అనుమతించింది. ఆర్యవైశ్య సంఘాల విజ్ఞప్తి మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మార్చేందుకు అనుమతించింది.

ఏపీలో సచివాలయాల పేర్లు మార్పు - స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్పు (ETV)

అమరావతికి రూ.7,387 కోట్ల నాబార్డు రుణం: రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ ప్రాజెక్టుల అమలుకు నాబార్డు, నాబార్డు ఇన్‌ఫ్రా అసిస్టెన్స్‌ పథకాల కింద రూ. 7,387 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాజధానిలో రూ.538 కోట్ల విలువైన వివిధ పనుల ప్రతిపాదనల్నీ ఆమోదించింది. రాజధానిలో రూ.137 కోట్లతో అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ నిర్మాణ పనులను టెండర్‌లో తక్కువకు కోట్‌ చేసిన ఎల్​ అండ్​ టీ కి అప్పగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

రహదారి భద్రత సెస్​కు ఆమోదం: సీఆర్​డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకూ పచ్చజెండా ఊపింది. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌లో రూ.16,073 కోట్లతో వికేంద్రీకృత భూగర్భ మురుగునీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి సైతం ఆమోదముద్ర వేసింది. కొత్త మోటారు వాహనాలపై రవాణాశాఖ వసూలు చేసే జీవిత పన్నులో 10 శాతం చొప్పున రహదారి భద్రత సెస్‌ ప్రవేశపెట్టడానికి ఆర్డినెన్స్‌ జారీ చేసే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

రూ. 41.61 కోట్ల వడ్డీ మాఫీ: తద్వారా నెలకు రూ.22.5 కోట్లు, ఏడాదికి రూ. 270 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ ఎన్​ఎస్​ఎఫ్​డీసీ (నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థికాభివృద్ధి సంస్థ కింద రాయితీ రుణాలు పొందిన 11,479 మందికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొన్నేళ్లుగా వాయిదాలు చెల్లించకపోవడం వల్ల పేరుకుపోయిన రూ.41.61 కోట్ల రూపాయల వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపింది.

"గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అని మార్పు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న రహదారుల మరమ్మతులకు ఈరోజు వరకూ రూ. 1200 కోట్లను అంతేకాకుండా కొత్తగా మరో రూ.2,500 కోట్లను మంజూరు చేసి ముందుకెళ్లాం". -నాదెండ్ల మనోహర్, మంత్రి

"సీఆర్​డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. జాతీయ సఫాయి కర్మచారీ ఆర్థికాభివృద్ధి సంస్థ కింద రాయితీ రుణాలు కొన్నేళ్లుగా చెల్లించకపోవడం వల్ల పేరుకుపోయిన రూ.41.61 కోట్ల రూపాయల వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపింది" -అనగాని సత్యప్రసాద్,మంత్రి

గ్రామ పంచాయతీల్లో 'పన్ను' చెల్లింపులకు ప్రత్యేక పోర్టల్‌ - ఇకపై లెక్కలు పక్కాగా చూపాల్సిందే

ఏపీలో "స్వర్ణ పంచాయతీ యాప్‌" - ఇక నుంచి డిజిటల్‌ విధానంలోనే పన్నులు