ETV Bharat / state

మహిళల భద్రత కోసం - 'ట్రాక్‌ హర్‌ షూ' రూపొందించిన బెజవాడ యువకులు

ట్రాక్‌ హర్‌ షూ డివైస్‌ రూపొందించిన ధనుష్‌, జాన్‌వెస్లీ - సెన్సర్‌ టెక్నాలజీతో షూకి డివైస్‌ అమర్చిన యువకులు - షూ బొటనవేలి కింద అమర్చిన డివైస్‌ని నొక్కితే చాలు

EVijayawada Youth Develop Track Her Shoe Device for Women Safety
Vijayawada Youth Develop Track Her Shoe Device for Women Safety (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2026 at 2:03 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vijayawada Youth Develop Track Her Shoe Device for Women Safety: దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలపై అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ నుంచి మొన్నటి కోల్‌కతా ఘటన వరకు ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అలాంటి దారుణాలు చూసిన ఆ యువకులు చలించిపోయారు. స్త్రీలకు రక్షణగా నిలిచేలా సరికొత్త ఆలోచన చేశారు. ఆపదలో ఉన్న ఆడబిడ్డలను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నంగా ట్రాక్‌ హర్‌ షూ అనే డివైస్‌ను ఆవిష్కరించారు. విజయవాడకు చెందిన ధనుష్‌, జాన్‌వెస్లీ. మరి ఆ పరికరం తయారీ, పనితీరేంటో ఈ కథనం ద్వాారా తెలుసుకుందాం.

ట్రాక్‌ హర్‌ షూ: మహిళలపై ఏదో మూల రోజుకో అరాచకం జరుగుతూనే ఉంది. వాటి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి ఘటనలు చూసిన ఈ యువకులు చలించిపోయారు. అలాంటి ఆపద సమయంలో బాధితులను కాపాడేలా, ఏదైనా చేయాలని డిగ్రీలోనే సంకల్పించారు. బీటెక్‌లో అధ్యాపకుల సహకారంతో తమ సంకల్పానికి ఊపిరి పోశారు. ఆడబిడ్డలకు ఆపద ఎదురైనప్పుడు వారు వేసుకున్న షూనే ఆయుధంలా మారేలా ట్రాక్‌ హర్‌ షూ అనే పరికరం తయారు చేశారు. ఇటీవల ఈ ప్రాజెక్టు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఫ్యూచర్ ఫౌండర్స్ ప్రోగ్రాంకు ఎంపికైంది.

విజయవాడ కేబీఎన్​ కళాశాలకు చెందిన ఈ విద్యార్థులు ధనుష్‌, జాన్‌వెస్లీ. ప్రస్తుతం బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చదువుతున్నారు. చిన్ననాటి నుంచే ఎలక్ట్రాన్​పై ఆసక్తి ఉన్న వీరు మహిళల భద్రత కోసం సెన్సర్‌ టెక్నాలజీ ఉపయోగించి షూ తయారు చేశారు. దిశ, కోల్‌కత్తా డాక్టర్ కేసులో బాధితుల దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ లేకపోవడం వల్లే తమను తాము కాపాడుకోలేకపోయారని అలాంటి సమయంలో నిమిషాల్లో వారిని కాపాడటం కోసం ట్రాక్ హర్ షూ పేరుతో ఓ పరికరం రూపొందించారు. దీని ద్వారా ఆపద సమయంలో కుటుంబ సభ్యులకు మెసేజ్‌ వెళ్లేలా దీన్ని తయారు చేశారు.

'ఈ షూలో బొటన వేలు కింద సెన్సార్ ఏర్పాటు చేశాం. అత్యవసర సమయంలో ఆ సెన్సర్‌ను 2 సార్లు అదిమితే వారి డివైస్‌లో సేవ్ చేసిన ఫోన్ నంబర్లకు మెసేజ్‌తో పాటు లైవ్ లొకేషన్​ షేర్​ అవుతుంది. తక్కువ సమయంలో ఆపదలో ఉన్న వారిని కాపాడే అవకాశం ఉంటుంది.' -ధనుష్, ట్రాక్ హర్ షూ రూపకర్త

భవిష్యత్‌లో నానో టెక్నాలజీగా: మహిళల భద్రత కోసం తయారుచేసిన ఈ డివైస్‌ టెక్ ట్రిక్స్ 2026 ఎక్స్‌పోలో ప్రదర్శించగా అందరి మన్ననలు అందుకుంది. స్టార్టప్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం కోసం ఇటీవల ఈ ప్రాజెక్టు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఫ్యూచర్ ఫౌండర్స్ ప్రోగ్రాంకు ఎంపికైంది. ప్రస్తుతం మైక్రో టెక్నాలజీతో నడుస్తున్న ఈ డివైజ్ భవిష్యత్‌లో నానో టెక్నాలజీగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

ప్రస్తుతం కుటుంబ సభ్యులకు మాత్రమే సమాచారం వెళ్లేలా ట్రాక్ హర్ షూలో సాంకేతికత ను రూపొందించారీ యువకులు. రాబోయే రోజుల్లో స్థానిక పోలీస్ స్టేషన్, గస్తీ పోలీసులకు కూడా సమాచారం చేరేలా సాఫ్ట్‌వేర్ సిద్ధం చేస్తున్నామన్నాడు. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే ఉంగరాలు వంటి ఆభరణాల్లోనూ ఈ టెక్నాలజీని అమర్చేలా తయారు చేస్తామంటున్నారు ట్రాక్ హర్ షూ రూపకర్తలు. మహిళల రక్షణ కోసం ఆలోచించి టెక్నాలజీని ఆయుధంగా మలచిన ఈ యువకులని మనమూ అభినందిద్దాం. భవిష్యత్తులో ఈ ట్రాక్ హర్ షూ ప్రాజెక్ట్ మరింత విజయవంతం కావాలని కోరుకుందాం.

12 రాష్ట్రాల నుంచి 1900 మంది - ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్న విద్యార్థులు

ఒకే వేదికపై వందలాది విద్యార్థులు - సందడిగా యువజనోత్సవాలు