విజయవాడ ఉత్సవ్ 2.0 - కళాకారుల ప్రదర్శనలకు ప్రజలు ఫిదా
Vijayawada Utsav 2.0 విజయవాడలో కృష్ణా నదీ తీరాన పున్నమి ఘాట్ వేదికగా విజయవాడ ఉత్సవ్ 2.0 అట్టహాసంగా ప్రారంభమైంది.

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 12, 2026 at 10:12 AM IST
Vijayawada Utsav 2.0 : కృష్ణాతీరాన బాణసంచా వెలుగులు వేదికలపై కళాకారుల హోరెత్తించే ప్రదర్శనలు ఎటుచూసినా ఉత్సాహం అడుగడుగునా ఆనందోత్సాహాలు! ఇలా విజయవాడ నగరం ఉత్సవాల హోరులో మునిగిపోయింది. కృష్ణానది తీరం నుంచి సింగ్‌నగర్ వరకు సంబరాల జోష్ మిన్నంటింది. అంగరంగ వైభవంగా ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్-2 నగరవాసుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బాణసంచా కాంతులు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలతో బెజవాడ పండుగ శోభను సంతరించుకుంది. కళాకారుల ఆటపాటలకు నగరవాసులు ఫిదా అయ్యారు. ఉత్సవాల జోరుతో విజయవాడ ఊగిపోయింది.
పున్నమి ఘాట్ వేదికగా : విజయవాడలో కృష్ణా నదీ తీరాన పున్నమి ఘాట్ వేదికగా విజయవాడ ఉత్సవ్ 2.0 అట్టహాసంగా ప్రారంభమైంది. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ సహకారంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చొరవతో నిర్వహిస్తున్న వేడుకలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, కల్చరల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ తేజస్వి సహా పలువురు నగర ప్రముఖులు ఉత్సవ్‌లో భాగమయ్యారు.
విజయవాడ ప్రజలే అంబాసిడర్లు : సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో విజయవాడ ఉత్సవ్ వేడుకలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి చేరుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ వేడుకలకు విజయవాడ ప్రజలే అసలైన బ్రాండ్ అంబాసిడర్లని, స్థానిక కళాకారులు, యువతలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో ఎంతో అవసరమని చెప్పారు. కృష్ణమ్మ పరవళ్లు, దుర్గమ్మ ఆశీస్సులతో విజయవాడ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయయని హోంమంత్రి అనిత కొనియాడారు. విజయవాడ ఆతిథ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పడమే ఉత్సవ్ ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ ఉత్సవ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖను అవార్డుగా భావిస్తున్నామన్నారు.
కామ్రేడ్ కళ్యాణ్ చిత్ర బృందం సందడి : పున్నమి ఘాట్ సహా విజయవాడ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో తొలిరోజు నిర్వహించిన కార్యక్రమాలు అదరహా అనిపించాయి. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఒకదానిని మించి మరొకటి అనేలా సాగిన ప్రదర్శనలు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో కుటుంబ సమేతంగా విచ్చేసిన నగరవాసులు కళాకారుల ప్రదర్శనలు వీక్షించి మైమరచిపోయారు. సింగ్‌నగర్‌లో కామ్రేడ్ కళ్యాణ్ చిత్ర బృందం సందడి చేసింది. విజయోత్సవ సభను ఉత్సవాల్లో భాగంగా నిర్వహించింది. అనంతరం ప్రముఖ గాయని గీతా మాధురి లైవ్ కాన్సర్ట్ నగర వాసులను ఉర్రూతలూగించింది. మాస్ పాటలతో స్టేడియం దద్దరిల్లింది.
నగర వాసుల కేరింతలు : దసరా సెలవులు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన నగర వాసులంతా కుటుంబ సమేతంగా విజయవాడ ఉత్సవాలకు హాజరై ఆద్యంతం ప్రదర్శనలను ఆస్వాదించారు. విజయవాడ ఉత్సవ్ మొదటి సీజన్‌కు మించి రెండవ సీజన్ ఉందని ప్రదర్శనలు ఒకదానిని మించి మరొకటి ఉన్నాయంటూ నగర వాసులు కేరింతలు కొట్టారు.
బ్రహ్మాండ నాయకుని వైభవం - నేటి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్న పేదలకు అండగా ఉన్నాం: సీఎం చంద్రబాబు

