ETV Bharat / state

విజయవాడ ఉగ్రమూలాల కేసులో కొత్తకోణాలు - మహిళల్ని జిహాదీలుగా మార్చేందుకు 'ఖవాతీన్‌'

'ఖవాతీన్‌' గ్రూప్‌ ఇన్‌ఛార్జిగా హైదరాబాద్‌ యువతి సైదాబేగం - సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు ఉచ్చు - మొత్తం ఆరుగురు విదేశీ హ్యాండర్ల గుర్తింపు - భారత్‌లో సైబర్‌ దాడులకు కుట్ర

Qawateen Group to Convert Women Into Jihadis
Qawateen Group to Convert Women Into Jihadis (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 9, 2026 at 10:33 AM IST

3 Min Read
Choose ETV Bharat

Qawateen Group to Convert Women Into Jihadis: జిహాదీ కార్యకలాపాల్లో మహిళలను భాగస్వాముల్ని చేసేందుకు విదేశీ హ్యాండర్లు సిద్దమయ్యారు. 'ఖవాతీన్‌' పేరిట ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి సామాజిక మాధ్యమాల ద్వారా మహిళల్ని ఉచ్చులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఇంఛార్జిగా హైదరాబాద్‌ యువతి సైదాబేగం వ్యవహరిస్తున్నారని విజయవాడ ఉగ్రలింకుల కేసులో ఈ కొత్తకోణాలు బయటపడ్డాయి. యువతను జిహాదీ వైపు మళ్లించడంలో ఆరుగురు విదేశీ హ్యాండ్లర్ల పాత్ర ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ గుర్తించింది.

ఖవాతీన్‌: విజయవాడ ఉగ్రమూలాల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిహాదీ కార్యకలాపాల్లో మహిళలను భాగస్వాముల్ని చేసేందుకు విదేశీ హ్యాండ్లర్లు మహిళలతో 'ఖవాతీన్‌' పేరిట ఏకంగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సామాజిక మాధ్యమాల ద్వారా మహిళల్ని ఈ ఉచ్చులోకి లాగేవారని నిర్థారించారు. ఈ కేసులో పట్టుబడిన హైదరాబాద్‌కు చెందిన సైదాబేగం 'ఖవాతీన్‌' బాధ్యతలు చూసేవారని గుర్తించారు. ఆమెకు పాకిస్థాన్, జమ్మూకశ్మీర్‌లోని జిహాదీలతో సంబంధాలున్నాయని రాష్ట్ర కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ దర్యాప్తులో తేలింది. భారత్‌లో ఇస్లామిక్‌ రాజ్య స్థాపనే లక్ష్యంగా యువతను జిహాద్‌ వైపు మళ్లించిన వారిలో అల్‌ హకీం షుకూర్‌ కాకుండా మరో ఐదుగురు విదేశీ హ్యాండ్లర్లు ఉన్నట్లు గుర్తించారు.

40కి పైగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు: పాకిస్థాన్, బంగ్లాదేశ్, యూఏఈ, అఫ్గానిస్థాన్, సిరియా దేశాలకు చెందిన మహమ్మద్‌ హుజైఫా, నింజా, హేంరోక్సీ, అబూ మహరీబ్, అబూ బలూచీలు హ్యాండ్లర్లుగా వ్యవహరించినట్లు వెల్లడైంది. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థలైన ఐసిస్, అల్‌ఖైదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌ ఏక్యూఐఎస్​ తరఫున పని చేస్తున్నట్లు తేలింది. వీరు సామాజిక మాధ్యమాల్లో జిహాద్‌ వీడియోలను పోస్టు చేస్తూ వాటిపట్ల ఆకర్షితులయ్యే యువతను ప్రేరేపించి ఉగ్రవాదులుగా మారుస్తున్నట్లు నిర్ధారణైంది. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన మహమ్మద్‌ రహమతుల్లా షరీఫ్‌ సహా మిగతా నిందితులంతా కలిసి 40కి పైగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల ద్వారా పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, సిరియాల్లోని విదేశీ హ్యాండ్లర్లతో నిత్యం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు వెలుగుచూసింది.

జిహాద్‌ కోసం యువతను పంపించటం హిజ్రాత్‌, జిహాద్‌ ద్వారా భారత్‌లో ఇస్లామిక్‌ రాజ్యం ఏర్పాటు 'ఖిలాఫత్‌' కోసం విదేశీ హ్యాండ్లర్లతో కలిసి నిందితులు పనిచేస్తున్నట్లు తేలింది. అందులోభాగంగా 'బెనెక్స్‌ కామ్‌' పేరిట ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌ల్లో గ్రూపులు ఏర్పాటుచేసి వాటిలో ఉగ్రవాద శిక్షణపై తరచూ చర్చించుకునేవారని గుర్తించారు. ఆ గ్రూపులో సభ్యులుగా ఉన్న వారితో సహా మరికొందర్ని ఉగ్రవాద శిక్షణలో చేరాలని విదేశీ హ్యాండ్లర్లు ప్రేరేపించినట్లు గుర్తించారు. విదేశాల్లోని మదర్సాల్లో ఇప్పటికే కొంతమంది యువకులు జిహాదీ శిక్షణ పొందుతున్నారంటూ ఆ వీడియోలను గ్రూపుల్లో పోస్టు చేసేవారని తేలింది.

విధ్వంసం నేర్పిస్తారు: బ్లాక్‌ పౌడర్, ఐఈడీల తయారీకి సంబంధించిన వీడియోలు, ఫార్ములా డాక్యుమెంట్లు, వాటితో పేలుళ్లు, విధ్వంసం ఎలా సృష్టించాలి అనే అంశాలపై పాకిస్థాన్‌ హ్యాండ్లర్లు ఈ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు పోస్టు చేసినట్లు తేలింది. వీటితో పాటు ఆయుధాల వినియోగం, స్నిఫర్‌ రైఫిల్స్‌ వాడకం తదితర అంశాలపై ఈ గ్రూపులోనే శిక్షణ అందించేవారని గుర్తించారు. ఈ గ్రూపులోని మరికొందరు సభ్యులు భారత్‌ త్వరలో ఇస్లామిక్‌ రాజ్యంగా మారుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసేవారని తేలింది. బైక్‌లపై ఇస్లామిక్‌ స్టేట్‌ జెండాలు కట్టుకుని తిరిగినట్లు గుర్తించారు.

భారత ప్రభుత్వ కీలక సంస్థలపై సైబర్‌ దాడులు చేయాలని, అధికారిక వెబ్‌సైట్లు, ఇతర సమాచారాన్ని హ్యాక్‌ చేయాలని విదేశీ హ్యాండ్లర్లు బెనెక్స్‌ కామ్‌ గ్రూపు సభ్యులకు చెప్పేవారని నిర్థారించారు. సైబర్‌ దాడులు ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేవారని డబ్బులూ పంపించేవారని గుర్తించారు. అవి ఎవరి ద్వారా, ఎలా చేరాయనేదానిపై ఇప్పుడు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ దర్యాప్తు చేస్తోంది. విజయవాడ ఉగ్రమూలాల కేసు విస్తృతి, తీవ్రత దృష్ట్యా దీన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కు అప్పగించాలని నిర్ణయించారు. కేసును ఆ సంస్థకు రెండు, మూడు రోజుల్లో బదలాయించనున్నారు.

షుకూర్‌ ఆదేశాలతో భారత్‌లో ఐసిస్ కార్యకలాపాలు - కస్టడీలో ఉగ్ర లింకుల కేసు నిందితులు

జిహాదీ శిక్షణ కోసం పాకిస్థాన్​కు, ఐసిస్‌తో సంబంధాలు - టెర్రర్ లింక్ కేసులో విస్తుపోయే నిజాలు