'మెట్రో అలైన్‌మెంట్ మార్చండి - లేకపోతే రోడ్డున పడతాం' - విజయవాడవాసుల కన్నీటి పర్యంతం
గాంధీనగర్, ఏలూరు రోడ్డు మీద కాకుండా బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా అలైన్‌మెంట్ మార్చాలని డిమాండ్ - వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడి -అలైన్మెంట్లో మార్పులు లేకపోతే రోడ్డున పడతామన్న నగర వాసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 20, 2026 at 8:04 PM IST
Vijayawada Residents Demanding Change in Metro Rail Alignment : విజయవాడ నగరంలో మెట్రో మార్గాన్ని గాంధీనగర్, ఏలూరు రోడ్డు మీద కాకుండా బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా వచ్చేలా అలైన్‌మెంట్ మార్చాలని నగర వాసులు కోరుతున్నారు. మెట్రో భూసేకరణకు సంబంధించి విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి నగరంలోని బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, గాంధీనగర్, బీఆర్టీఎస్ రోడ్డు ప్రాంతానికి చెందిన పలువురు నగర వాసులు హాజరయ్యారు. అధికారులు వీరి నుంచి సలహాలు, సూచనలు తీసుకోగా తమకున్న ఇబ్బందులు, అనువైన మార్గాన్ని నగర వాసులు వివరించారు.
పదేళ్ల క్రితం ఇచ్చిన మార్కింగ్ ప్రకారమే అధికారులు ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని అదే చేస్తే వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న, అత్యంత కీలకమైన ఏలూరు రోడ్డులో దుకాణదారులు, యజమానులు రోడ్డున పడతారని నగర వాసులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తమకు ఆధారం లేకుండా పోతుందని ప్రభుత్వం ఆలోచించి మెట్రో అలైన్మెంట్లో మార్పు చేయాలని కన్నీటిపర్యంతమవుతున్నారు. దీనిపై అధికారులను వివరణ అడగ్గా ఇది కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమే అని దీని ప్రకారం చర్యలు ఉండవని నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మాత్రమే తదుపరి ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు.
"విజయవాడలోని గాంధీ నగర్ మీదుగా మెట్రో వెళ్లేందుకు అధికారులు మార్కింగ్ వేశారు. దీనిపై ఆందోళన తెలపడానికి కలెక్టర్ ఆఫీసుకు వచ్చాం. మా సూచనలు అడిగారు, మేం చెప్పాం. ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునే, ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో అనేకరకాల మలుపులతో మార్కింగ్ వేశారు. ఆ మలుపులు కాకుండా నేరుగా గుణదల పడవల రేవు దగ్గరి నుంచి బీఆర్టీసీ రోడ్డుకు మార్కింగ్ వేస్తే ఎవ్వరికీ నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరి జీవితాలు నాశనం కాకుండా ఉంటాయి." - స్థానికులు, గాంధీనగర్
కీలక దశకు మెట్రో రైల్ ప్రాజెక్టులు : విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపునకు సంబంధిత డివిజన్‌కు పంపింది. రెండు నగరాల్లో కలిపి తొలిదశలో రూ.21,616 కోట్ల భారీ పెట్టుబడితో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ నుంచి నగరంలోని కీలక ప్రాంతాలకు మెట్రో అనుసంధానంతో ఉద్యోగులు, ప్రజల రాకపోకలు సులభతరం కానున్నాయి.
విజయవాడలో గన్నవరం నుంచి కారిడార్ ఏర్పాటుతో విమానాశ్రయం, నగరం ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతాల మధ్య ప్రజా రవాణా అనుసంధానం బలోపేతం కానుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్రానికి పంపారు. వీటిపై కొన్ని అభ్యంతరాలు, సూచనల తర్వాత ఆర్థిక మదింపునకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సంయుక్త భాగస్వామ్య విధానం (జేవీ మోడల్)లో ఈ రెండు ప్రాజెక్టులూ చేపట్టనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 20%, కేంద్ర ప్రభుత్వం 20% చొప్పున నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన 60% నిధులు ఆర్థిక సంస్థల నుంచి సేకరించనున్నారు. కొన్ని విదేశీ బ్యాంకులు రుణం సమకూర్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
40 శాతం వరకు టెండరింగ్ ప్రక్రియ : విశాఖ ఇప్పటికే పారిశ్రామిక, ఐటీ, పర్యాటక కేంద్రంగా ఎదుగుతోంది. విజయవాడ వాణిజ్య, రవాణా, పరిపాలనా కేంద్రంగా కీలకంగా ఉంది. ఈ రెండు నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గడంతో పాటు నగర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి. నగర అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా మెట్రో కారిడార్ల వెంట కొత్త వృద్ధి కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉంది. మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం వరకు టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులిచ్చింది.
మెట్రో రైల్ ప్రాజెక్టుకు 80 ఎకరాలు : డీపీఆర్‌లపై ఆర్థిక మదింపు ప్రక్రియ పూర్తయి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడితే తొలి దశ పనులకు పునాది పడనుంది. విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఎస్‌ఐఏ) సర్వే ప్రారంభమైంది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరులో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. రెండు కారిడార్ల మెట్రో రైల్ ప్రాజెక్టుకు దాదాపు 80 ఎకరాలు అవసరం. ఇందులో కోచ్ డిపో, మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, రెవెన్యూ అధికారుల బృందాలు సంయుక్తంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ సర్వే నిర్వహిస్తున్నాయి. ఇది పూర్తయ్యాక భూసేకరణకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ ఇవ్వనుంది.
విశాఖ, విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుల్లో మార్పులు - రాష్ట్రానికి సూచించిన కేంద్రం
విశాఖ మెట్రోకు త్వరలో అనుమతి - అనుబంధ రవాణా వ్యవస్థపై అధికారుల కసరత్తు

