ETV Bharat / state

ఫోన్​ పోతే ఆ 15 నిమిషాలు చాలా కీలకం - జాగ్రత్తలు పాటిస్తే వ్యక్తిగత సమాచారం సేఫ్​

మొబైల్ పోయిందా? వెంటనే చర్య తీసుకోండి - ఫోన్‌లోని బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, యూపీఐ & వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు వహించాలి - ఆ 15 నిమిషాలు చాలా కీలకం

Cyber Crime Awareness On Phone Passwords
ఫోన్​ పోతే ఈ జాగ్రత్తలు తప్పనిసరి (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 1, 2026 at 3:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

Cyber Crime Awareness On Phone Passwords : మీ ఫోన్ పోయిందా? "పర్లేదులే, అందులో స్క్రీన్ లాక్ ఉంది కదా ఎవరూ ఓపెన్ చేయలేరు!" అని ధీమాగా కూర్చున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లేనని విజయవాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మనం బతుకుతున్న ఈ డిజిటల్ యుగంలో మన జీవితమంతా స్మార్ట్‌ఫోన్‌లోనే నిక్షిప్తమై ఉంది. ఫోన్ పోయిన తర్వాత గడిచే మొదటి 15 నిమిషాలు అత్యంత కీలకం అని మన 'ఖాకీ బాబులు', 'సైబర్ చిట్టి' నెటిజన్లను అప్రమత్తం చేస్తున్నారు. ఆ కొద్ది నిమిషాల్లోనే మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బు మాయం కాకుండా మీ వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవ్వకుండా కాపాడుకోవడానికి వెంటనే స్పందించడం ఎంతో ముఖ్యం అని సూచిస్తున్నారు.

ప్రజలను హెచ్చరించేందుకు యానిమేటెడ్​ మీడియో : సైబర్ నేరాలపై ప్రజలకు వినూత్నంగా అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లా ఖాకీ స్టూడియో ఒక ఆసక్తికరమైన వీడియోను తెరపైకి తెచ్చింది. అందరికీ సుపరిచితమైన కార్టూన్ పాత్రలు మోటు, పట్లుల ద్వారా చరవాణి (మొబైల్ ఫోన్) పోయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు ఎంతో చాకచక్యంగా వివరించారు.

ఈ కథనంలో అసలు ఏం జరిగిందంటే : రోడ్డుపై వెళ్తూ తన ఫోన్‌లో రీల్స్ చూస్తూ పూర్తిగా మునిగిపోయిన మోటు చేతిలో నుంచి ఒక దొంగ ఫోన్‌ను లాక్కొని పారిపోతాడు. ఈ విషయాన్ని మోటు తన స్నేహితుడు పట్లుకు చెప్పగా పట్లు వెంటనే పోలీసులకు కేసు పెడదామంటాడు. కానీ మోటు మాత్రం "నా ఫోన్‌కు లాక్ ఉంది కదా ఎవడూ ఓపెన్ చేయలేడు! పద హాయిగా సమోసా తిని తీరిగ్గా పోలీస్ స్టేషన్‌కు వెళ్దాం" అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఎంట్రీ ఇచ్చిన 'ఖాకీ బాబు', 'సైబర్ చిట్టి' మోటు భ్రమలను పటాపంచలు చేస్తారు. ఫోన్ పోయిన తర్వాత గడిచే మొదటి 15 నిమిషాలు అత్యంత కీలకమైనవని హెచ్చరిస్తూ, స్క్రీన్ లాక్ ఉన్నప్పటికీ సైబర్ నేరగాళ్లు ఎంత ప్రమాదకరంగా డేటాను డబ్బును దొంగిలించగలరో వివరిస్తారు.

15 నిమిషాలు కీలకం :

  • మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే మొదటి చర్యగా మీ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి సిమ్ కార్డును బ్లాక్ చేయించాలి.
  • అలాగే బ్యాంక్ ఖాతాలు, యూపీఐ వంటి ఫోన్‌కు అనుసంధానించిన ఆర్థిక సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలి.
  • ఈ ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చండి.
  • మొబైల్ ఫోన్, ఐఎమ్​ఈఐ నంబర్‌ను బ్లాక్ చేయడానికి సీఈఐఆర్​ పోర్టల్‌లో ఒక అభ్యర్థనను సమర్పించండి.
  • సిమ్‌ను బ్లాక్ చేయడం మీ ఆర్థిక లావాదేవీలను సురక్షితంగా ఉంచుకోవడం మంచిది.

ఫోన్ పోగొట్టుకున్న 15 నిమిషాలలోపు ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యక్తిగత సమాచారం దొంగల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించవచ్చని ఖాకీబాబు, సైబర్‌చిట్టి సలహా ఇస్తున్నారు. ఇది బ్యాంక్ ఖాతాలు, ఎస్​ఎమ్​ఎస్​ సందేశాలు, నోటిఫికేషన్‌లు, ఓటీపీల దుర్వినియోగాన్ని నిరోధించడంలో కూడా సహాయపడుతుంది.

తనిఖీ చేయడమే పాపమైనట్లు అసభ్య వ్యాఖ్యలు - విజయవాడలో కేసు నమోదు

ఫేక్, మ్యూల్ అకౌంట్ల ద్వారా బ్యాంకులకు టోకరా - ఏకంగా రూ.5 కోట్లు కాజేసిన నిందితుడు